ప్రపంచ వాతావరణ సదస్సులో భాగంగా గ్లాస్గోలో పర్యటిస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ.. దిగ్గజ వ్యాపారవేత్త, మైక్రోసాఫ్ట్ సహవ్యవస్థాపకుడు బిల్ గేట్స్‌తో సమావేశమయ్యారు. వాతావరణ మార్పులు, స్థిరమైన అభివృద్ధి వంటి అంశాలపై ఇరువురూ చర్చించారు. ఇద్దరి మధ్య ఆహ్లాదకర వాతావరణంలో చర్చలు జరిగినట్లు పీఎంఓ ట్విట్టర్‌లో పేర్కొంది.
గేట్స్ ఫౌండేషన్ ద్వారా.. భారత్ సుస్థిరాభివృద్ధి లక్ష్యాలను చేరుకునేందుకు తోడ్పాటునందిస్తామని గతంలో బిల్‌గేట్స్ ప్రకటించారు. ఆరోగ్యం, పోషకాహారం, పారిశుద్ధ్యం, వ్యవసాయ రంగాలపై ప్రత్యేక దృష్టి సారించనున్నట్లు పేర్కొన్నారు. తాజాగా.. వినూత్న ఆవిష్కరణల ద్వారా వీటిని చేరుకుంటామని ఉద్ఘాటించారు.
"ప్రపంచ వాతావరణ సదస్సు ద్వారా.. సున్నా ఉద్గారాల లక్ష్యాన్ని చేరుకునేందుకు అవసరమైన కాలుష్య రహిత సాంకేతికతల అభివృద్ధిని వేగవంతం చేయడానికి మరిన్ని మార్గాలను కనుగొనే అవకాశం కలిగింది," అని గేట్స్ ట్వీట్ చేశారు.
ఈ మధ్యకాలంలో కరోనాపై పోరులో ప్రధానంగా దృష్టి సారించిన గేట్స్.. మహమ్మారిని ఎదుర్కోవడానికి ప్రపంచ సహకారం అవసరం అని అభిప్రాయపడ్డారు. ఈ మేరకు మోదీతో భేటీ అనంతరం ట్విట్టర్ వేదికగా ఆయనకు ధన్యవాదాలు తెలిపారు.
"దేశ ప్రజలందరికీ కరోనా వ్యాక్సిన్లు, పరీక్షలు సులభంగా అందించడంలో భారత్ కీలక పాత్ర పోషిస్తోంది. ప్రజలపై సామాజిక, ఆర్థిక ప్రభావాన్ని తగ్గించడానికి కృషి చేస్తున్న మోదీకి ధన్యవాదాలు."
-బిల్ గేట్స్, వ్యాపారవేత్త
నేపాల్ ప్రధానితో మోదీ..