ప్రపంచాన్ని ఈ ఏడాది అన్ని రంగాల్లో సంక్షోభంలోకి నెట్టిన కరోనా మహమ్మారితో పాటు వరుస విపత్తులు ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేశాయి. కొవిడ్-19ను మార్చిలో అధికారికంగా ప్రకటించినప్పటి నుంచి 2020 సంవత్సరం తొలి అర్ధభాగంలోనే 100కి పైగా ప్రకృతి వైపరీత్యాలు సంభవించినట్లు ఇంటర్నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ రెడ్‌క్రాస్, రెడ్ క్రిసెంట్ సొసైటీస్(ఐఎఫ్‌ఆర్‌సీ) వెల్లడించింది. ఈ మేరకు మంగళవారం ఐఎఫ్‌ఆర్‌సీ తన వార్షిక ప్రపంచ విపత్తుల నివేదిక విడుదల చేసింది. ఈ వైపరీత్యాలు ప్రపంచంలోని 5కోట్లకుపైగా ప్రజలను ప్రభావితం చేసినట్లు నివేదిక తెలుపుతోంది.
'6 నెలల్లో వందకుపైగా ప్రకృతి వైపరీత్యాలు'
కొవిడ్‌తో పాటు ప్రకృతి విపత్తులు.. ప్రపంచ దేశాలను ఈ ఏడాది తీవ్ర సంక్షోభంలోకి నెట్టాయి. మార్చిలో కరోనాను ప్రపంచ మహమ్మారిగా ప్రకటించినప్పటి నుంచి.. ఈ ఏడాది తొలి అర్ధభాగంలో వందకుపైగా ప్రకృతి వైపరీత్యాలు సంభవించినట్టు ఐఎఫ్‌ఆర్‌సీ నివేదికలో వెల్లడైంది. ఫలితంగా సుమారు 5కోట్ల మందికిపైగా ప్రభావితమైనట్టు తెలుస్తోంది.
కరోనాతో పాటు ఏకకాలంలో వాతావరణంలో మార్పులు చోటుచేసుకొని ప్రకృతి వైపరీత్యాలు సంభవించాయని నివేదిక వివరిస్తోంది. దీంతో లక్షల సంఖ్యలో ప్రజలు తీవ్రంగా నష్టపోయినట్లు తెలిపింది. పేదలు, అత్యవసర సాయం అవసరమైన ప్రజలు ఇలా నష్టపోయిన వారిలో ముందు వరుసలో ఉన్నట్లు ఐఎఫ్‌ఆర్‌సీ పేర్కొంది. గత దశాబ్దంతో పోలిస్తే ప్రస్తుతం విపత్తుల తీవ్రత పెరిగినట్లు నివేదిక అభిప్రాయపడింది. పదేళ్లలో ప్రకృతి వైపరీత్యాల వల్ల సంభవించిన విపత్తుల్లో 83 శాతం తీవ్రస్థాయిలో ఏర్పడిన వాతావరణ మార్పులకు సంబంధించి వరదలు, తుపానులు ఉన్నట్లు ఐఎఫ్‌ఆర్‌సీ వివరిస్తోంది.
ఇదీ చదవండి:మోడెర్నా టీకా పనితీరు అద్భుతం: ఫౌచీ