కొవిడ్- 19 వ్యాధికి కారణమయ్యే సార్స్- కోవ్-2 (కరోనా వైరస్) దాదాపు 200 రకాలుగా మారిందని శాస్త్రవేత్తలు గుర్తించారు. ప్రపంచవ్యాప్తంగా 7,500 మంది కరోనా బాధితుల నుంచి సేకరించిన నమూనాలను పరిశీలించగా ఈ విషయం వెల్లడైందని పరిశోధకులు తెలిపారు.
యూనివర్సిటీ కాలేజ్ లండన్ (యూసీఎల్) పరిశోధకులు చేసిన ఈ అధ్యయనం ఇన్ఫెక్షన్, జెనెటిక్స్ అండ్ ఎవల్యూషన్ జర్నల్‌లో ప్రచురితమైంది. వైరస్ జన్యుక్రమంలోని వైవిధ్య లక్షణాలను బహిర్గతం చేసింది ఈ పరిశోధన.
చిన్న మార్పులు..
మానవుల్లోకి వైరస్ ఎలా ప్రవేశిస్తుంది? ఎలా విస్తరిస్తుంది? అనే అంశాలను తెలుసుకున్నారు పరిశోధకులు. కరోనా వైరస్‌లో 198 జన్యు పరివర్తనలను శాస్త్రవేత్తలు గుర్తించారు.
"అన్ని వైరస్లు సాధారణంగా పరివర్తన చెందుతాయి. ఇదేమీ ప్రమాదకరం కాదు. కరోనా... అనుకున్నదానికి కన్నా వేగంగా పరివర్తన చెందుతోందని చెప్పలేం. ఈ వైరస్ ఎంతవరకు ప్రాణాంతకమైనదనే విషయాన్ని స్పష్టంగా నిర్ధరించలేం. జన్యు క్రమాల్లో చిన్నచిన్న మార్పులు వైరస్ మొత్తాన్ని ప్రభావితం చేయలేవు. "
- ఫ్రాంకాయిస్ బల్లాక్స్, ప్రొఫెసర్
వైరస్‌లోని కొన్ని పరివర్తనల్లో కొన్ని మార్పులు మాత్రమే జరుగుతున్నాయని పరిశోధకులు తెలిపారు. కొన్ని జన్యువుల్లో చాలా తక్కువ మార్పులు ఉన్నందున ఔషధాలు, వ్యాక్సిన్ అభివృద్ధి సులభతరమవుతుందని అన్నారు.
"వైరస్ పరివర్తన చెందితే టీకా లేదా ఔషధం ప్రభావవంతంగా పనిచేయదు. పరివర్తన చెందడానికి తక్కువ అవకాశం ఉన్న వైరస్ భాగాలపై మన ప్రయత్నాలను కేంద్రీకరిస్తే, దీర్ఘకాలంలో ప్రభావవంతంగా ఉండే ఔషధాలను అభివృద్ధి చేయడానికి మాకు మంచి అవకాశం ఉంటుంది. వైరస్ ఛేదించలేని ఔషధాలను మనం అభివృద్ధి చేయాలి."
- ఫ్రాంకాయిస్ బల్లాక్స్, ప్రొఫెసర్