అత్యాచారాలకు పాల్పడేవారికి పలు దేశాల్లో కఠిన శిక్షలు అమలు చేస్తున్నారు. హైదరాబాద్లో పశువైద్యురాలిపై హత్యాచార ఘటనపై దేశవ్యాప్తంగా నిరసనలు మిన్నంటుతున్నాయి. ఈ నేపథ్యంలో ఏయే దేశాల్లో ఎలాంటి శిక్షలు విధిస్తున్నారో ఒకసారి తెలుసుకుందాం..
ఈ దేశాల్లో మరణ దండనే..
ఉత్తర కొరియా:రేపిస్టులకు ఈ దేశంలో మరణ శిక్షలు అమలవుతాయి. నేరస్థులపై ఎలాంటి దయ చూపించరు. నేరానికి పాల్పడిన వ్యక్తి తలపై లేదా సున్నిత అవయవాలపై ఓ ప్రత్యేక బృందం తుపాకీతో కాల్చి చంపుతుంది.
చైనా:ఇక్కడ అత్యాచారం ఘోరమైన నేరం. విచారణ, న్యాయ ప్రక్రియ చాలా వేగంగా పూర్తిచేస్తారు. నేరస్థులను వెనుక నుంచి తుపాకీతో కాల్చి చంపుతారు. ఒక్కోసారి పురుషాంగాన్ని తొలగించే శిక్ష విధిస్తుంటారు. అయితే అత్యాచారాన్ని అవమానంగా భావించి ఎక్కువ సందర్భాల్లో బాధితులు మౌనంగా ఉండిపోతుంటారు.
సౌదీ అరేబియా:విచారణ పూర్తయిన కొన్ని రోజుల్లోనే శిక్ష పడుతుంది. నేరస్థులకు మత్తు ఇచ్చి బహిరంగంగా మరణ శిక్ష (శిరచ్ఛేదం) అమలుచేస్తారు. రాళ్లతోనూ కొట్టి చంపుతారు.
ఇరాన్: నేరస్థులకు బహిరంగ మరణ శిక్ష పడుతుంది. ఉరి తీయడం లేదా తుపాకీతో కాల్చి చంపడం వంటి శిక్షలుంటాయి. బాధితులు అంగీకరిస్తే మాత్రం మరణ శిక్షను నిలుపుచేస్తారు. ఇలాంటి సందర్భాల్లో 100 కొరడా దెబ్బలు, జీవిత ఖైదు విధిస్తారు.
అఫ్గానిస్థాన్:నేరానికి పాల్పడిన 4 రోజుల్లోనే శిక్ష పడుతుంది. తలలో కాల్చి చంపడం లేదా ఉరి తీయడం చేస్తారు. బాధితులే శిక్షను అమలు చేసేందుకు కూడా వీలుంటుంది.
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఈజిప్ట్: ఉరి శిక్ష విధిస్తారు. యూఏఈలో నేరస్థుడికి 7 రోజుల్లోనే శిక్ష పడుతుంది.
పాకిస్థాన్:సామూహిక అత్యాచారం, బాలలపై లైంగిక దాడులు, అత్యాచారం ఈ మూడింటికీ మరణ శిక్ష పడుతుంది. ఓ మహిళ శరీర భాగాలు బహిరంగంగా కనిపించేలా ఆమెపై దాడికి పాల్పడినా ఇదే శిక్ష పడుతుంది.
క్యూబా:గతంలో ఇలాంటి నేరాలకు పాల్పడిన వ్యక్తి, మరోసారి అత్యాచారానికి పాల్పడినా.. లేదా 12 ఏళ్లలోపు బాలికలపై అఘాయిత్యానికి ఒడిగట్టినా మరణ శిక్ష విధిస్తారు.