నేడు జరగనున్న ఏడు ప్రముఖ ప్రజాస్వామ్య దేశాల కూటమి జీ-7 శిఖరాగ్ర సదస్సులో ప్రపంచ ఆర్థిక మాంద్యం, పర్యావరణ మార్పులు ప్రధాన అజెండాగా మారనున్నాయని అంచనా. ప్రపంచ ఆర్థిక వృద్ధి రోజు రోజుకు క్షీణిస్తోంది. పర్యావరణానికి కేంద్ర బిందువుగా ఉన్న అమెజాన్ అడవులు కార్చిచ్చుతో దగ్ధమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ప్రపంచం ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్యలకు పరిష్కారం దిశగా జీ-7 దేశాధినేతలు అడుగులు వేస్తారనే అంచనాలు ఉన్నాయి.
గతేడాది జరిగిన జీ-7 సదస్సు నుంచి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ త్వరగానే నిష్క్రమించారు. అనంతరం ఎయిర్ ఫోర్స్ వన్ నుంచి తుది ప్రకటన చేశారు. ఈసారి అలాంటిది జరగదని ఆతిథ్య దేశ అధ్యక్షుడు ఇమ్మానుయెల్ మెక్రాన్ భావిస్తున్నారు. అయినప్పటికీ.. ఈ సమావేశంలో సమస్యల పరిష్కారానికి అంతర్జాతీయ ఒప్పందాలపై ట్రంప్ పెద్దగా ఆసక్తి కనబరచకపోవచ్చన్నది విశ్లేషకుల మాట.