తెలంగాణ

telangana

ETV Bharat / international

రష్యా వైఖరిపై తీర్మానం.. ఓటింగ్​కు దూరంగా భారత్​, చైనా - రష్యా ఉక్రెయిన్ లేటెస్ట్​ న్యూస్

Live Updates Russia attacks Ukraine
భీకర పోరు- తొలిరోజు 137 మంది బలి

By

Published : Feb 25, 2022, 6:44 AM IST

Updated : Feb 26, 2022, 5:40 AM IST

04:35 February 26

ఓటింగ్​కు దూరంగా భారత్​.. తీర్మానాన్ని తిరస్కరించిన రష్యా

రష్యా వైఖరిని నిరసిస్తూ ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో ప్రవేశపెట్టిన తీర్మానానికి భారత్​ దూరంగా ఉంది. ఈ ఓటింగ్​లో భారత్, చైనా పాల్గొనలేదు. మరోవైపు ఈ తీర్మానాన్ని రష్యా వీటో చేసింది. తీర్మానాన్ని తిరస్కరించింది.

03:49 February 26

నాటోలోని ప్రతి అంగుళాన్ని రక్షించేందుకు అమెరికా సిద్ధంగా ఉంటుందని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ స్పష్టం చేశారు. ఆర్టికల్ 5 ప్రకారం.. నాటో దేశాలకు అండగా ఉండేందుకు అమెరికా బలగాలను పంపనుందని తెలిపారు.

02:35 February 26

ఉక్రెయిన్‌పై రష్యా చేస్తున్న దాడుల నేపథ్యంలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌, ఆ దేశ విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్‌ ఆస్తుల్ని స్తంభింపజేసేందుకు అమెరికా ప్రభుత్వం అంగీకారం తెలిపింది. ఇప్పటికే ఈయూ, బ్రిటన్ అంగీకరించాయి.

22:43 February 25

ఆస్తులు సీజ్​..

ఉక్రెయిన్‌పై రష్యా చేస్తున్న భీకర దాడుల నేపథ్యంలో ఐరోపా సమాఖ్య కీలక నిర్ణయం తీసుకుంది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌, ఆ దేశ విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్‌ ఆస్తుల్ని స్తంభింపజేసేందుకు ఐరోపా సమాఖ్య అంగీకారం తెలిపింది. యూరప్‌ దేశాల్లో ఉన్న వీరిద్దరి ఆస్తుల్ని స్తంభింపజేయాలని నిర్ణయించింది.

అటు బ్రిటన్​ ప్రభుత్వం కూడా పుతిన్​, లావ్రోవ్ ఆస్థులను స్తంభింపజేయాలని ఆదేశించింది.

22:32 February 25

దేశం వీడిన 50వేల మందికి పైగా ఉక్రెయిన్‌ పౌరులు

ఉక్రెయిన్‌లో రష్యా యుద్ధంతో నెలకొన్న భయంకర పరిస్థితుల నేపథ్యంలో ఆ దేశాన్ని అక్కడి పౌరులు వీడిపోతున్నారు. గత 48 గంటల వ్యవధిలో 50 వేల మందికి పైగా ఉక్రెయిన్‌ పౌరులు దేశం వదిలి పారిపోయినట్టు యునైటెడ్‌ నేషన్స్‌ వెల్లడించింది.

22:31 February 25

రష్యా సభ్యత్వం రద్దు చేసిన కౌన్సిల్‌ ఆఫ్‌ యూరప్‌ మానవ హక్కుల సంఘం..

ఉక్రెయిన్‌పై భీకరదాడులు చేసిన రష్యాపై యూరోపియన్‌ యూనియన్‌ మానవ హక్కుల సంఘం కఠిన చర్యలు తీసుకుంటోంది. కౌన్సిల్‌ ఆఫ్‌ యూరప్‌లో రష్యా సభ్యత్వాన్ని రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది. మరోవైపు, రష్యా అధ్యక్షుడు, విదేశాంగ మంత్రి ఆస్తులను స్తంభింపజేసే దిశగా ఇప్పటికే ఈయూ ప్రయత్నాలు చేస్తోంది.

21:44 February 25

నాయకత్వాన్ని కూలదోయండి.. ఉక్రెయిన్‌ సైన్యానికి పుతిన్‌ పిలుపు

ఉక్రెయిన్‌ నాయకత్వాన్ని కూలదోయాలని ఆ దేశ సైన్యానికి రష్యా అధ్యక్షుడు పుతిన్‌ పిలుపునిచ్చారు. ఉక్రెయిన్‌లో అధికారాన్ని తమ చేతుల్లోకి తీసుకోవాలని సూచించారు. అలాగైతే, డ్రగ్స్‌కు బానిసలైన, నియో నాజీల ముఠాతో కంటే సైన్యంతో ఏకీభవించడం తమకు సులభమంటూ జెలెన్‌స్కీని ఉద్దేశించి పరోక్షంగా తీవ్రంగా వ్యాఖ్యానించారు. ఉక్రెయిన్‌ నాయకత్వాన్ని ఉగ్రవాదులు, డ్రగ్స్‌ ముఠా, అభినవ నాజీలుగా అభివర్ణించారు. ఓ టీవీ ఛానల్‌ ద్వారా ఆయన మాట్లాడుతూ.. ''ఉక్రెయిన్‌లోని మిలిటరీ సిబ్బందికి మరోసారి విజ్ఞప్తి చేస్తున్నా.. అభినవ నాజీలకు మానవ కవచాలుగా మీ పిల్లలు, భార్యలు, పెద్దలను ఉండనీయొద్దు. అధికారాన్ని మీరు హస్తగతం చేసుకోండి.'' అని ఉక్రెయిన్‌ సైనికులకు పుతిన్‌ సూచించారు.

21:34 February 25

118 సైనిక స్థావరాలు ధ్వంసం చేసినట్టు రష్యా ప్రకటన

ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం రెండో రోజు మరింత భీకరంగా సాగుతోంది. పలు నగరాలు, సైనికస్థావరాలపై రష్యా వైమానిక దాడులు చేసింది. మూడు వైపుల నుంచి దాడులు చేసేందుకు యుద్ధ ట్యాంకులను పంపింది. రాజధాని కీవ్‌, రెండో పెద్ద నగరమైన ఖార్కివ్‌ తదితర పట్టణాల్లోకి ప్రవేశించిన పుతిన్‌ సేనలు.. ఉక్రెయిన్‌ బలగాల మధ్య ఉద్ధృతంగా పోరు కొనసాగుతోంది. తొలిరోజు దాడుల్లో అనుకున్న లక్ష్యం సాధించినట్టు ప్రకటించిన రష్యా.. ఉక్రెయిన్‌ భూతలంపై ఉన్న 118 మిలిటరీ లక్ష్యాలను ధ్వంసం చేసినట్టు ప్రకటించింది.

21:34 February 25

ఉక్రెయిన్‌ నుంచి బయల్దేరిన భారత విద్యార్థులు

రష్యా యుద్ధంతో భయానక పరిస్థితులతో తీవ్ర భయాందోళనలో ఉన్న అక్కడి భారతీయ పౌరుల్ని తీసుకొచ్చేందుకు కేంద్రం ముమ్మర చర్యలు కొనసాగిస్తోంది. ఇందులో భాగంగా తొలి విడతగా కొందరు భారత విద్యార్థులు ఉక్రెయిన్‌ నుంచి బయలుదేరారు. వీరిని రొమేనియా రాజధాని బుకారెస్ట్‌కు రోడ్డు మార్గంలో తరలిస్తున్నారు. సరిహద్దుకు చేరుకొనేందుకు సుమారు 7 నుంచి 9గంటల సమయం పట్టే అవకాశం ఉన్నట్టు సమాచారం. అక్కడి నుంచి విమానాల్లో స్వదేశానికి తీసుకువచ్చేందుకు భారత్‌ తరఫున విమానాలు ఏర్పాటు చేశారు. శనివారం దిల్లీ చేరుకోనున్న వీరందరినీ కేంద్ర విదేశాంగ శాఖ సహాయమంత్రి మురళీధరన్‌ రిసీవ్‌ చేసుకోనున్నారు.

20:13 February 25

రోమానియాకు 470 మంది భారత విద్యార్థులు..

ఉక్రెయిన్​లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న వేళ సుమారు 470 మంది భారత విద్యార్థులు రోమానియాకు వెళ్లేందుకు శుక్రవారం మధ్యాహ్నం పోరుబ్నే-సిరెట్​ సరిహద్దుకు చెరుకున్నట్లు ఉక్రెయిన్​లోని భారత రాయబార కార్యాలయం తెలిపింది. సరిహద్దులకు చేరుకున్న భారతీయులను పక్క దేశాలకు తరలించి అక్కడి నుంచి స్వదేశానికి పంపనున్నట్లు తెలిపింది. ఆ దిశగా అన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయని పేర్కొంది.

19:24 February 25

చర్చల దిశగా అడుగులు.. రష్యా-ఉక్రెయిన్​ కీలక ప్రకటన

ఉక్రెయిన్​పై రష్యా సైనిక దాడిలో పరిస్థితులు చర్చల దిశగా సానుకూలంగా మారుతున్నట్లు కనిపిస్తోంది. ఇప్పటికే.. ఉక్రెయిన్​తో చర్చలకు సిద్ధమని స్పష్టం చేసింది రష్యా. అయితే.. ఉక్రెయిన్ సైన్యం పోరాటం ఆపితేనే తాము సంప్రదింపులు జరుపుతామని తేల్చిచెప్పారు రష్యా విదేశాంగ మంత్రి సెర్జీ లావ్రొవ్.

ఉక్రెయిన్​ సైతం..

చర్చల విషయంపై రష్యా ప్రకటన చేసిన కొద్ది సేపటికే తాము సైతం చర్చలకు సిద్ధమని ప్రకటించింది ఉక్రెయిన్​. నాటో కూటమిలో చేరకుండా తటస్థంగా ఉండే విషయంలో రష్యాతో చర్చలకు సిద్ధమని తెలిపింది.

18:34 February 25

ఉక్రెయిన్ రాజధాని కీవ్​కు సమీపంలోని కీలకమైన విమానాశ్రయాన్ని హస్తగతం చేసుకున్నట్లు రష్యా సైన్యం ప్రకటించింది. హోస్టోమెల్​లో అతిపెద్ద రన్​వేతో కూడిన ఈ ఎయిర్​పోర్ట్​కు భారీ రవాణా విమానాలు వచ్చే అవకాశముంది. ఫలితంగా కీవ్​ నగర శివార్లలో ఉన్న బలగాల్ని రాజధానికి తరలించడం రష్యాకు మరింత సులువు కానుంది.

మరోవైపు.. ఇప్పటివరకు రష్యాకు చెందిన 1000 మందికిపైగా సైనికులు ఘర్షణల్లో చనిపోయినట్లు ఉక్రెయిన్ రక్షణ శాఖ ప్రకటించింది.

17:31 February 25

పుతిన్​తో చైనా అధ్యక్షుడు జిన్​పింగ్​ చర్చలు

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్​ పుతిన్​తో చైనా అధ్యక్షుడు జిన్​పింగ్ మాట్లాడారు. ఉక్రెయిన్​తో సమస్యను చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని సూచించినట్లు అంతర్జాతీయ మీడియా వెల్లడించింది. ​

ఆందోళన వ్యక్తం చేసిన పోప్​ ఫ్రాన్సిస్​..

ఉక్రెయిన్​పై రష్యా సైనిక చర్యపై ఆందోళన వ్యక్తం చేశారు పోప్​ ఫ్రాన్సిస్​. రోమ్​లోని రష్యన్​ రాయబార కార్యాలయానికి వెళ్లి నిరసన తెలియజేశారు. రష్యా, ఉక్రెయిన్​ సంక్షోభం నేపథ్యంలో పలు కార్యక్రమాలను రద్దు చేస్తున్నట్లు వాటికన్​ సిటీ ప్రకటించిన రోజునే రష్యా ఎంబసీకి వెళ్లి.. ఆవేదనను వ్యక్తం చేశారు పోప్​.

17:15 February 25

కీవ్​కు అతిదగ్గరలో రష్యా సైన్యం.. బంకర్​లోకి ఉక్రెయిన్​ అధ్యక్షుడు

రష్యా సైన్యం వేగంగా ఉక్రెయిన్​ రాజధాని కీవ్​వైపు అడుగులు వేస్తోంది. ఈ నేపథ్యంలో ఆ దేశ అధ్యక్షుడు జెలెన్​స్కీని భద్రతా దళాలు బంకర్​లోకి తరలించాయి.

16:08 February 25

ఉక్రెయిన్​తో చర్చలకు సిద్ధమని స్పష్టం చేసింది రష్యా. అయితే.. ఉక్రెయిన్ సైన్యం పోరాటం ఆపితేనే తాము సంప్రదింపులు జరుపుతామని తేల్చిచెప్పారు రష్యా విదేశాంగ మంత్రి సెర్జీ లావ్రొవ్.

14:45 February 25

రష్యా సేనలు ఉక్రెయిన్​ రాజధానిలోని కీలక ప్రాంతాలకు చేరుకున్నట్లు సమాచారం. కీవ్​లో ప్రభుత్వ భవనాలకు సమీపంలో తుపాకీ కాల్పుల శబ్దం వినిపించినట్లు తెలుస్తోంది.

14:29 February 25

ఉక్రెయిన్​లోకి రష్యా సేనలు దూసుకెళ్తున్నాయి. అయితే ఉక్రెయిన్​ కూడా అదే స్థాయిలో ఎదుర్కొంటోంది. తాజాగా రష్యాకు చెందిన రెండు క్షిపణులు, విమానాన్ని తమ సైన్యం కూల్చివేసినట్లు ఉక్రెయిన్​ తెలిపింది.

13:43 February 25

రష్యా బలగాలతో ఉక్రెయిన్​ సైన్యం భీకర పోరు..

రష్యా సేనలు ఉత్తర కీవ్​ జిల్లాలోకి ప్రవేశించాయి. ఉక్రెయిన్​ బలగాలు వాటిని తీవ్రంగా ప్రతిఘటిస్తున్నాయి. ఇరు వర్గాల మధ్య భీకర పోరు జరుగుతోంది.

13:33 February 25

భారత విద్యార్థుల తరలింపుపై కీలక ప్రకటన

ఉక్రెయిన్‌లో చిక్కుకుపోయిన భారతీయ విద్యార్థులు, పౌరుల తరలింపుపై కేంద్రం కీలక ప్రకటన చేసింది. ప్రస్తుతానికి హంగేరీ, రొమానియా మార్గాల గుండా వారిని స్వదేశానికి తీసుకొచ్చే ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపింది. ఈ మార్గాలు అందుబాటులోకి వచ్చిన తర్వాత.. ఉక్రెయిన్‌లో ఈ రెండు దేశాల సరిహద్దులను దగ్గరగా ఉండేవారు చెక్‌ పాయింట్ల వద్దకు రావాలని సూచించింది.

13:14 February 25

దాడుల్లో 450 మంది రష్యా సైనికులు మృతి: ఉక్రెయిన్​

రష్యా సేనలను ఉక్రెయిన్‌ సైన్యం శక్తిమేరకు ప్రతిఘటిస్తుంది. రాజధాని కీవ్‌ వెలుపల రష్యా బలగాలను ఎదుర్కొంటోంది. ఈ మేరకు ఉక్రెయిన్‌ సైన్యం వెల్లడించింది. తమ దాడుల్లో 450 మంది రష్యా సైనికులు చనిపోయారని ఉక్రెయిన్‌ రక్షణశాఖ వెల్లడించింది.

12:01 February 25

యుద్ధ విమానం కూల్చివేత..

శుక్రవారం తెల్లవారుజామున కీవ్​ నగరంలోకి ప్రవేశిస్తున్న రష్యా యుద్ధవిమానాన్ని ఉక్రెయిన్ బలగాలు కూల్చినట్లు తెలుస్తోంది. అయితే అది అపార్ట్​మెంట్ వైపు దూసుకేళ్లడం వల్ల ఆ భవనంలో మంటలు వ్యాపించాయి. ఈ ఘటనలో పలువురు గాయపడినట్లు సమాచారం. ఇందుకు సంబంధించిన ఫొటోలు సామాజిక మాధ్యామాల్లో వ్యాప్తి చెందాయి.

11:43 February 25

రష్యా మొదటి గురి తానేనని ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలొదిమిర్ జెలెన్ స్కీ సంచలన వ్యాఖ్యలు చేశారు. తర్వాతి లక్ష్యం తన కుటుంబమని ఆందోళన వ్యక్తం చేశారు. అయితే తాము ఈ దేశాన్ని విడిచిపెట్టి వెళ్లే ప్రసక్తే లేదన్నారు. రష్యా తక్షణమే ఆక్రమణలు ఆపి.. చర్చలకు రావాలని కోరారు. దాడులు ఆపేంతవరకు మేం పోరాడుతూనే ఉంటామని చెప్పారు.

11:34 February 25

ఉక్రెయిన్‌పై సైనిక చర్యకు దిగిన రష్యా దూకుడుగా మున్ముందుకు వెళ్తోంది. దేశ సరిహద్దులు దాటి ఉక్రెయిన్‌ భూభాగంలోకి ప్రవేశించిన రష్యా బలగాలు ఇప్పటికే రాజధాని కీవ్‌కు 130 కిలోమీటర్ల దూరంలో ఉన్న చెర్నోబిల్‌ అణు విద్యుత్‌ కర్మగారాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నాయి. ప్రస్తుతం రష్యా సేనలు కీవ్‌ నగరానికి కేవలం 20 మైళ్ల(32 కిలోమీటర్లు) దూరంలోనే ఉన్నట్లు తెలుస్తోంది. రష్యా ప్రధానంగా కీవ్‌ నగరంపైనే గురి పెట్టిందని, అందుకు తగ్గట్లుగానే నలువైపుల నుంచి నగరం వైపునకు దూసుకొస్తున్నాయని అంతర్జాతీయ మీడియా కథనాలు పేర్కొన్నాయి. ఏ క్షణమైనా రాజధానిని హస్తగతం చేసుకుని ఉక్రెయిన్‌ ప్రభుత్వాన్ని కూల్చివేసే ప్రమాదం ఉందని తెలిపాయి.

స్నేక్ ఐల్యాండ్ రష్యా వశం..

ఉక్రెయిన్​పై రష్యా దురాక్రమణ కొనసాగుతోంది. నల్ల సముద్రంలోని ఉక్రెయిన్​కు చెందిన స్నేక్ ద్వీపాన్ని రష్యా దళాలు పూర్తిగా స్వాధీనం చేసుకున్నాయి. ఈ క్రమంలో ద్వీపంలో ఉన్న 13 మంది ఉక్రెయిన్ బోర్డర్ గార్డ్స్ లొంగిపోయేందుకు నిరాకరించారు. దీంతో రష్యా సైనికులు వారిని చంపేసినట్లు అధ్యక్షుడు జెలెన్​స్కీ ప్రకటించారు.

నాటో కూటమి సమావేశం..

మరోవైపు ఉక్రెయిన్‌లోని తాజా ఉద్రిక్త పరిస్థితులపై చర్చించేందుకు నాటో కూటమికి చెందిన 30 మంది నేతలు శుక్రవారం సమావేశం కానున్నారు. రష్య దురాక్రమణను అడ్డుకునేందుకు చేపట్టాల్సిన చర్యలపై ఈ భేటీలో చర్చించనున్నట్లు తెలుస్తోంది. అయితే వర్చువల్‌గా జరిగే ఈ సమావేశానికి అమెరికా, కెనడా, టర్కీ దేశాల నేతలు హాజరుకావట్లేదని సమాచారం.

10:47 February 25

చైనా మాట్లాడాలి..

రష్యా యుద్ధాన్ని ఆపేలా అంతర్జాతీయ సమాజంతో చైనా గొంతు కలపాలని జపాన్​కు ఉక్రెయిన్​ రాయబారి సెర్గియ్​ కోర్సున్​స్కీ విజ్ఞప్తి చేశారు. రష్యాతో ఆ దేశానికి మంచి సంబంధాలున్నాయని, పుతిన్​ మాట్లాడాలని కోరారు. రష్యా యుద్ధం ప్రకటించినా.. చైనా ఇప్పటివరకు ఒక్క మాట కూడా మాట్లాడలేదని, అమెరికా దాని మిత్ర దేశాలపై మాత్రం విమర్శలు గుప్పిస్తోందని పేర్కొన్నారు. పుతిన్​ విషయంలో చైనా కీలక పాత్ర పోషింగలదని, నాగరిక దేశంలా వ్యవహరించాలని ఆశిస్తున్నట్లు చెప్పారు.

10:31 February 25

సుప్రీంలో పిల్​

ఉక్రెయిన్‌లో చిక్కిన భారతీయులను తీసుకురావాలని సుప్రీంలో పిల్‌ దాఖలు చేశారు విశాల్ తివారి అనే న్యాయవాది. కేంద్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేయాలని ఆయన కోరారు. ఉక్రెయిన్‌లో చిక్కుకున్న వారికి వసతి, భోజనం కల్పించాలన్నారు.

08:48 February 25

రష్యా అధీనంలో ఉక్రెయిన్ అణు విద్యుత్ కేంద్రం

ఉక్రెయిన్​పై రష్యా దండయాత్ర కొనసాగుతోంది. యుద్ధం మొదలైన రెండో రోజూ ఉక్రెయిన్ రాజధాని కీవ్​పై బాంబుల వర్షం కురుస్తోంది. భారీ పేలుళ్ళ శబ్దాలతో నగరం అట్టుడుకుతోంది. ఖార్కివ్, ఒడెస్సా, లుహాన్స్‌, సుమీ, ఖార్కివ్‌పై రష్యా దాడులు చేస్తోంది. బెలారస్ వైపు నుంచి ఉక్రెయిన్‌లోకి సైనిక బలగాలను పంపుతోంది. రష్యా సైనికులు ఉక్రెయిన్​ వేర్పాటవాద ప్రాంతాల్లోకి ప్రవేశించారు. సైనిక స్థావరాలు, ఆయుధాగారాలపై క్షిపణులతో దాడులు చేస్తున్నారు. అంతేగాక ఉక్రెయిన్​ చెర్నోబిల్​ అణు విద్యుత్ కేంద్రాన్ని రష్యా తమ అధీనంలోకి తీసుకుంది.

మరోవైపు రష్యా దాడిలో ఇప్పటివరకు 137మంది ఉక్రెయిన్​ పౌరులు మరణించినట్లు అధ్యక్షుడు వొలొదిమిర్​ జెలెన్​స్కీ వెల్లడించారు. వందల మంది గాయపడినట్లు చెప్పారు. రష్యా భీకర దాడులు చేస్తున్న నేపథ్యంలో ఉక్రెయిన్​ బలగాలు, సైనిక సమీకరణకు జెలెన్​స్కీ ఆదేశాలు జారీ చేశారు. రానున్న 90 రోజుల పాటు ఇది అమల్లో ఉండనుంది.

08:34 February 25

'నాటో' దేశాల జోలికి వస్తే రంగంలోకి అమెరికా సేనలు: బైడెన్​

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్​కు అమెరికా అధ్యక్షుడు హెచ్చరించారు. నాటోలో సభ్య దేశాల జోలికి వస్తే సహించేది లేదని తేల్చి చెప్పారు. ఇదే జరిగితే అమెరికా సేనలు రంగంలోకి దిగుతుందని స్పష్టం చేశారు.

రష్యాను ఇప్పుడు అదుపు చేయకపోతే ధైర్యంతో మరింత ముందడుగు వేసే అవకాశం ఉందని అన్నారు బైడెన్. పుతిన్‌తో మరోసారి మాట్లాడే ఆలోచన తనకు లేదని.. అయితే ఇప్పటికే ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలొదిమిర్ జెలెన్​స్కీతో మాట్లాడినట్లు బైడన్​ తెలిపారు. ఉక్రెయిన్​లో ఉన్న ప్రజల కష్టాలను తగ్గించడానికి అమెరికా మానవతా సహాయం అందిస్తుందని బిడెన్ చెప్పారు.

08:22 February 25

రష్యాను అడ్డుకోవాలని శ్వేత సౌధం ఎదుట ఉక్రెయిన్ల ప్రదర్శన

ఉక్రెయిన్​లో రష్యా సైనిక కార్యకలాపాలను అడ్డుకోవాలని ఆ దేశ పౌరులు అమెరికాలో ప్రదర్శన చేపట్టారు. తొలుత రష్యన్ రాయబార కార్యాలయం వద్ద ప్రదర్శన చేపట్టారు. అనంతరం వైట్ హౌస్ వద్ద వందల సంఖ్యలో గుమిగూడారు.

పుతిన్​ను అడ్డుకోవాలని అమెరికా అధ్యక్షుడు బైడెన్‌ను కోరారు. యుద్ధాన్ని ఆపాలని, ఉక్రెయిన్​ను రక్షించాలని ప్లకార్డులు ప్రదర్శించారు.

07:25 February 25

పుతిన్ ఆక్రమణదారు.. మరో 4 బ్యాంకులపై ఆంక్షలు..

ఉక్రెయిన్​పై రష్యా సైనిక చర్య జరపడంపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్​ కీలక వ్యాఖ్యలు చేశారు. పుతిన్​ను ఆక్రమణదారుగా అభివర్ణించారు బైడెన్​. పుతిన్​ యుద్ధాన్ని ఎంచుకున్నాడని.. తదుపరి పరిణామాలకు రష్యా బాధ్యత వహించాలని అన్నారు.పుతిన్‌.. సోవియేట్‌ యూనియన్‌ను తిరిగి స్థాపించాలనుకుంటున్నారని బైడెన్ అన్నారు. ఉక్రెయిన్‌ అంశంపై భారత్‌తో సంప్రదింపులు జరుపుతున్నామని తెలిపారు.

" పుతిన్​ ఆక్రమణదారుడు. ఆయన చర్చలు యుద్ధాన్ని ఎంచుకున్నారు. అమెరికాపై రష్యా ఏమైనా సైబర్ దాడులు జరిపితే స్పందించేందుకు సిద్ధంగా ఉన్నాం. నాటో దేశాలకు అమెరికా సైన్యాన్ని పంపించనున్నాం. యూరోప్ దేశాలకు ఇదొక ప్రమాదకరమైన చర్య. పుతిన్‌.. సోవియేట్‌ యూనియన్‌ను తిరిగి స్థాపించాలనుకుంటున్నారు. అంతర్జాతీయ సమాజానికి పుతిన్‌ ఆలోచనలు విరుద్ధంగా ఉన్నాయి.

-- జో బైడెన్​, అమెరికా అధ్యక్షుడు

రష్యాకు చెందిన మరో 4 బ్యాంకులపై అమెరికా ఆంక్షలు విధించినట్లు చెప్పారు బైడెన్​. పుతిన్​తో మాట్లాడాలన్న ఆలోచన లేదని తెలిపారు.

'స్విఫ్ట్‌'పై ఆంక్షలు

ఉక్రెయిన్‌ అంశంలో రష్యాను కట్టడి చేసేందుకు 'స్విఫ్ట్‌' (సొసైటీ ఫర్‌ వరల్డ్‌వైడ్‌ ఇంటర్‌ బ్యాంక్‌ ఫైనాన్షియల్‌ టెలి కమ్యూనికేషన్‌ సిస్టమ్‌) నుంచి రష్యాను బయటకు పంపాలన్న సూచనలపై అమెరికా స్పందించింది. 'స్విఫ్ట్‌'పై ఆంక్షలు అనే ఆప్షన్ ఎల్లప్పుడూ ఉంటుందని తెలిపింది. యూరోప్ అప్పడే దీనిపై నిర్ణయం తీసుకోదని అభిప్రాయపడింది అమెరికా.'స్విఫ్ట్‌' నుంచి రష్యాను బయటకు పంపిస్తే.. రష్యా అంతర్జాతీయ వాణిజ్యంలో సమస్యలు తలెత్తి ఆర్థిక వ్యవస్థపై పెనుప్రభావం పడే ప్రమాదం ఉంది.

06:45 February 25

రష్యా దాడిలో 137 మంది మృతి..

ఉక్రెయిన్​పై రష్యా దాడిని తిప్పికొట్టేందుకు పూర్తి సన్నద్ధంతో ఉన్నామని ఉక్రెయిన్​ అధ్యక్షుడు జెలెన్​స్కీ తెలిపారు. దేశవ్యాప్తంగా భారీగా బలగాలను మోహరించినట్లు చెప్పారు. మరో 90రోజులపాటు బలగాల మోహరింపు ఉంటుందన్నారు.

మరోవైపు రష్యా దాడిలో ఇప్పటివరకు 137 మంది పౌరులు, సైనికులు మృతి చెందారని పేర్కొన్నారు. దేశ రక్షణలో ప్రాణ త్యాగం చేసిన వీరులను హీరోలుగా అభివర్ణించారు జెలెన్​స్కీ. వందలాది మంది గాయపడ్డారని తెలిపారు.

" రష్యా సైనికులు ఉక్రెయిన్ ప్రజలను చంపేస్తున్నారు. శాంతితో ఉన్న నగరాలను మిలిటరీ లక్ష్యాలుగా మారుస్తున్నాయి. ఇది చాలా దారుణమైనది. ఈ చర్యను వదిలిపెట్టం."

-- జెలెన్​స్కీ, ఉక్రెయిన్​ అధ్యక్షుడు

06:26 February 25

Live Updates: రష్యా యుద్ధం

అనుకున్నంతా అయింది. ఉక్రెయిన్‌పై కత్తిగట్టిన రష్యా.. అదను చూసి సమరశంఖం పూరించింది. ముందస్తు వ్యూహం ప్రకారం గురువారం తెలతెలవారుతూనే బెలారస్‌ వైపు నుంచి సైనిక బలగాలతో ఉక్రెయిన్‌లో ప్రవేశించింది. దూకుడుగా మున్ముందుకు వెళ్తోంది.

కీలకమైన గగనతల రక్షణ వ్యవస్థలు, సైనిక వైమానిక స్థావరాలు, రక్షణ శాఖ ఆయుధాగారాలపై క్షిపణులు, బాంబులతో విరుచుకుపడుతోంది. లక్ష్యాన్ని అత్యంత కచ్చితత్వంతో ఛేదించే ఆయుధాలతో రష్యా దాడులు చేస్తోంది. దీంతో ఉక్రెయిన్‌ ప్రాంతాలు దద్దరిల్లుతున్నాయి. వంద మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. జనం భయంభయంగా ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని తరలిపోతున్నారు. సురక్షిత ప్రాంతాలకు చేరుకునే ప్రయత్నాలు చేస్తుండడంతో రోడ్డు మార్గాలు, రైళ్లు కిక్కిరిసిపోయాయి. విమానాల రాకపోకల్ని నిలిపివేశారు. దీంతో గందరగోళ, ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయి.

యుద్ధం దెబ్బకు ప్రపంచవ్యాప్తంగా స్టాక్‌ మార్కెట్లు పతనమయ్యాయి. ఉక్రెయిన్‌ను కబళించాలన్న ప్రయత్నం తగదని ప్రపంచ దేశాలు పేర్కొన్నాయి. యుద్ధం వల్ల పెద్దఎత్తున ప్రాణనష్టంతో పాటు ఆర్థిక రంగంపై తీవ్రంగా ప్రభావం పడుతుందని ఆందోళన వ్యక్తంచేశాయి. ఉక్రెయిన్‌ను రక్షించడానికి సైనికపరంగా తాము జోక్యం చేసుకోబోమని అమెరికా వంటి దిగ్గజ దేశాలు ప్రకటించాయి.

రష్యాపై కొత్త ఆంక్షలు విధించడం ఖాయమని అమెరికా, ఈయూ తెలిపాయి. ఉక్రెయిన్‌లో ఉన్న భారతీయుల్ని స్వదేశానికి సురక్షితంగా తరలించడంపై భారత ప్రభుత్వం దృష్టి సారించింది. రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో భారత ప్రధాని నరేంద్రమోదీ ఫోన్లో మాట్లాడారు. హింసకు వెంటనే తెరదించాలని కోరారు. భారతీయుల్ని ఉక్రెయిన్‌ నుంచి క్షేమంగా తరలించడం తమ ప్రాధాన్య అంశమని చెప్పారు.రష్యా దాడుల్ని ప్రతిఘటించడానికి ఇప్పటికే సమాయత్తమై ఉన్న ఉక్రెయిన్‌ ఆ మేరకు రంగంలో దిగింది.

కీవ్‌ సమీపంలో 14 మందితో ప్రయాణిస్తున్న సైనిక విమానం ఒకటి కూలిపోయిందని వార్తాసంస్థల సమాచారం. మొత్తంమీద ఉక్రెయిన్‌కు చెందిన 40 మంది, రష్యాకు చెందిన 50 మంది కలిపి 90 మంది వరకు సైనికులు మొదటిరోజే ప్రాణాలు కోల్పోయినట్లు వార్తలు వెలువడ్డాయి. ఒడెసా నగరంలో 18 మంది పౌరులు కూడా చనిపోయినట్లు తెలుస్తోంది. దీనిని ఉక్రెయిన్‌ ఇంకా ధ్రువపరచలేదు. రష్యాకు చెందిన ఐదు విమానాలను, ఒక హెలికాప్టర్‌ను ధ్వంసం చేసినట్లు ఉక్రెయిన్‌ ప్రకటించింది. సాధారణ ప్రజలపై, జనావాసాలపై తాము దాడులు చేయడం లేదని, అది తమ లక్ష్యం కాదని రష్యా సైన్యం తెలిపింది. సైనిక స్థావరాలు, వైమానిక స్థావరాలను ధ్వంసం చేసినట్లు వెల్లడించింది.

ఉక్రెయిన్‌లో సైనిక మౌలిక సదుపాయాలు పూర్తిగా తమ సామర్థ్యాన్ని కోల్పోయాయని పేర్కొంది. 'పూర్తిస్థాయి యుద్ధం'లో తమ సైనిక కమాండ్‌ స్థావరాలపై క్షిపణి దాడులు జరిగాయని ఉక్రెయిన్‌ వెల్లడించింది. కీవ్‌, ఖార్కీవ్‌, ఒడెసా, ద్నిప్రో తదితర 13 నగరాల్లోని స్థావరాలు లక్ష్యంగా రష్యా దాడులు చేసిందని తెలిపింది.

సైనిక చర్య ఎందుకంటే..

"ఉక్రెయిన్‌ను ఆక్రమించాలన్న ఉద్దేశమేమీ మాకు లేదు. అక్కడి నుంచి నిస్సైనికీకరణ జరగాలనేదే మా ప్రయత్నం. అక్కడ నేరాలకు పాల్పడినవారిని చట్టం ముందు నిలబెడతాం. తూర్పు ఉక్రెయిన్‌ పౌరుల్ని రక్షించడానికే సైనిక చర్య అవసరమైంది. దీనిపై ఎవరైనా మా జోలికి వస్తే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి."

- పుతిన్‌

సైన్యం చొరబాటు ఇలా
తొలుత గగనతలం ద్వారా విరుచుకుపడ్డ రష్యా తన సైన్యాన్ని ఉక్రెయిన్‌లోకి పంపించింది. తర్వాత క్రిమియా మీదుగా భూభాగం ద్వారా సైనిక వాహనాల్లో బలగాలను తరలించింది. బెలారస్‌ నుంచి రష్యా దాడి మొదలైందని ఉక్రెయిన్‌ సరిహద్దు భద్రత సంస్థ తెలిపింది. కొన్ని గంటల వ్యవధిలోనే ఉక్రెయిన్‌ గగనతల రక్షణ వ్యవస్థలన్నింటినీ తుడిచిపెట్టేశామని రష్యా సైన్యం ప్రకటించింది. గగనతల దాడులతో ఉక్రెయిన్‌ రాజధాని కీవ్‌పైకి క్షిపణులు దూసుకు రావచ్చనే సంకేతాలనిస్తూ సైరన్లు నిరంతరం మార్మోగుతూనే ఉన్నాయి. ఈ శబ్దం వినబడగానే ప్రజలు భూగర్భ మెట్రో స్టేషన్లు, సురక్షిత ప్రాంతాలకు పరుగులు తీస్తున్నారు. కీవ్‌, సముద్ర తీర నగరమైన మారియూపోల్‌, దేశంలోని అతిపెద్ద నగరాలైన ఒడేసా, ఖార్కీవ్‌లలోనూ పేలుడు శబ్దాలు వినిపించాయి. ఉక్రెయిన్‌ గగనతలాన్ని ‘ఘర్షణల ప్రాంతం’గా ఐరోపా దేశాలు ప్రకటించాయి.

జోక్యం చేసుకున్నారో ఖబడ్దార్‌: రష్యా

రష్యా తమపై పూర్తిస్థాయి యుద్ధానికి దిగిందని ఉక్రెయిన్‌ ఆరోపించగా, దీనిని ‘భారీస్థాయి సైనిక చర్య’గా రష్యా అధ్యక్షుడు పుతిన్‌ అభివర్ణించారు. ప్రపంచ దేశాల ఖండనలు, తమపై విధిస్తున్న ఆంక్షలను తోసిపుచ్చారు. తమకున్న అణ్వాయుధ శక్తిని పరోక్షంగా గుర్తుచేస్తూ ఏ దేశమైనా ఈ వ్యవహారంలో జోక్యం చేసుకునే ప్రయత్నం చేసినా, తమపై నేరుగా దాడికి దిగినా ఎన్నడూ చూడనంత విపరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని గట్టి హెచ్చరిక చేశారు. నాటో కూటమిలో చేరకుండా ఉక్రెయిన్‌ను అడ్డుకోవాలన్న తమ డిమాండును అమెరికా, దాని మిత్రపక్షాలు పట్టించుకోలేదని పుతిన్‌ నిందించారు. ఉక్రెయిన్‌ సైనికులు ఆయుధాలు విడిచిపెట్టి ఇళ్లకు వెళ్లిపోవాలని సూచించారు. తమ పదాతిదళాలు ఉక్రెయిన్‌లో ప్రవేశించినట్లు రష్యా అధికారికంగా ప్రకటించింది. రష్యా సరిహద్దులో నాటో సభ్యదేశమైన లిథువేనియా.. ఎమర్జెన్సీ ప్రకటించింది.

ప్రభుత్వ సైట్లపై సైబర్‌ దాడులు

ఉక్రెయిన్‌ పార్లమెంట్‌, బ్యాంకులు సహా ప్రభుత్వ సంస్థల వెబ్‌సైట్లపై మరోసారి సైబర్‌ దాడులు చోటు చేసుకున్నాయి. దీంతో కొన్ని సేవలు నిలిచిపోయాయి. పెద్ద సంస్థల్ని లక్ష్యంగా చేసుకున్న గుర్తు తెలియని వ్యక్తులు.. విధ్వంసకర మాల్‌వేర్‌ను వందలాది కంప్యూటర్లలోకి చొప్పించారని అధికారులు వెల్లడించారు. లాత్వియా, లిథువేనియా దేశాల్లోని కంప్యూటర్లలోనూ వైరస్‌ దాడులు జరిగాయని చెప్పారు. సైనిక చర్యకు పాల్పడుతున్న రష్యానే.. సైబర్‌ దాడులు చేసిందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. డేటాను పూర్తిగా తుడిచిపెట్టే సామర్థ్యం ఉన్న మాల్‌వేర్‌ను గుర్తించినట్లు ఈఎస్‌ఈటీ రీసెర్చ్‌ ల్యాబ్‌ తెలిపింది. ఎన్ని నెట్‌వర్క్‌లపై దీని ప్రభావం ఉందో ఇంకా తెలియలేదని పేర్కొంది.

ఇళ్లలోనే ఉండండి: జెలెన్‌స్కీ

రష్యాతో దౌత్య సంబంధాలు తెగదెంపులు చేసుకున్నామని ఉక్రెయిన్‌ అధ్యక్షుడు వొలొదిమిర్‌ జెలెన్‌స్కీ ప్రకటించారు. దేశంలో మార్షల్‌ లా అమల్లోకి వచ్చిందని చెప్పారు. ప్రజలంతా ఇళ్లలోనే ఉండాలని, అయితే భయపడవద్దని కోరారు. పుతిన్‌తో మాట్లాడేందుకు బుధవారం రాత్రి కూడా ప్రయత్నించినా క్రెమ్లిన్‌ నుంచి స్పందన రాలేదని చెప్పారు. తాజా పరిణామం ఐరోపా ఖండంలో పెద్ద యుద్ధానికి దారి తీయవచ్చన్నారు. దేశాన్ని రక్షించుకోవాలనుకునేవారికి ఆయుధాలు సమకూరుస్తామని చెప్పారు. దేశ భవిష్యత్తు ప్రతిఒక్క పౌరుడి ‘చేతి’లో ఉందన్నారు.

చెర్నోబిల్‌ స్వాధీనం

కీవ్‌కు 130 కి.మీ. దూరంలోని చెర్నోబిల్‌ అణు విద్యుత్తు కర్మాగారాన్ని రష్యా బలగాలు గుప్పిట్లో తీసుకున్నాయి. ఈ విషయాన్ని గురువారం రాత్రి పొద్దుపోయాక ఉక్రెయిన్‌ కూడా ధ్రువీకరించింది. రష్యా బాంబులు అక్కడి రేడియోధార్మిక వ్యర్థాల నిల్వలపైనా పడ్డాయనీ, దాంతో రేడియో ధార్మికత స్థాయి ఒక్కసారిగా పెరిగిందని ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. గతంలో జరిగిన దుర్ఘటన తర్వాత ఈ కర్మాగారాన్ని సురక్షితంగా మూసి ఉంచారు.

Last Updated : Feb 26, 2022, 5:40 AM IST

ABOUT THE AUTHOR

...view details