ప్రపంచ దేశాల్ని కలవరపెడుతోన్న కరోనా మృతులు అంతకంతకూ పెరుగుతూనే ఉన్నాయి. ఇప్పటివరకు 9,325 మంది ఈ వైరస్ బారిన పడి ప్రాణాలు కోల్పోయారు. 2.4 లక్షల మందికి పైగా ఈ మహమ్మారి సోకింది. ఇటలీలో కరోనా మరణాల సంఖ్య చైనాను అధిగమించింది. చైనాలో ఇప్పటివరకు 3,250 మంది చనిపోగా.. ఇటలీలో 3,400మందికి పైగా మృతిచెందారు. అంతకంతకూ విస్తరిస్తోన్న మహమ్మారి ధాటికి.. ఇటలీలో గురువారం ఒక్కరోజే 427 మంది ప్రాణాలు కోల్పోయారు. కొత్తగా మరో 5,322 కేసులు బయటపడ్డాయి.
ఇటలీ ప్రభుత్వం ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ.. కొవిడ్-19 కేసుల సంఖ్య మాత్రం తగ్గుముఖం పట్టడంలేదు. ఈ ఆకస్మిక విపత్తులో మరణించిన వారికి.. కేవలం 30 నిమిషాల వ్యవధిలో అంత్యక్రియలు నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని కట్టుదిట్టమైన భద్రతల నడుమ జన సమూహమేమీ లేకుండా పూర్తిచేస్తున్నారు.
అగ్రరాజ్యం అమెరికాలో ఇప్పటివరకు కరోనా వైరస్ సోకి 154 మంది మృతి చెందగా.. కేసుల సంఖ్య 10,755 కు పెరిగింది. దీంతో కొవిడ్-19 మరణాల సంఖ్య పరంగా అమెరికా 6వ స్థానానికి చేరింది. ఈ జాబితాలో ఇటలీ, చైనా, ఇరాన్, స్పెయిన్, జర్మనీలు వరుసగా తొలి ఐదుస్థానాల్లో ఉన్నాయి.
ప్రపంచదేశాలపై ఒక్కరోజులో కొవిడ్-19 ప్రభావం:
- ఇటలీలో 427 మందిని పొట్టనపెట్టుకున్న కరోనా.. మరో 5,322 మందికి సోకింది.
- స్పెయిన్‌లో 165 మంది బలవ్వగా.. 2,626 కేసులు నమోదయ్యాయి.
- ఇరాన్లో 149 మంది మృతిచెందగా.. 1,046 కేసులు బయటపడ్డాయి.
- ఫ్రాన్స్‌లో 108 మంది మృత్యువాత పడగా.. 1,861 కేసులు వెలుగుచూశాయి.
- బ్రిటన్‌లో 40 మంది చనిపోగా.. 643 మంది వైరస్ బారినపడ్డారు.
- అమెరికాలో 21 మంది ప్రాణాలుకోల్పోగా.. 2,200కు పైగా కేసులు నమోదయ్యాయి.
- జర్మనీలో 19 మంది మరణించగా.. సుమారు 3000 మందికి వైరస్ సోకింది.