కరోనా వైరస్ ప్రపంచవ్యాప్తంగా మరణమృదంగం మోగిస్తోంది. మహమ్మారి ప్రభావం ఇరాన్లో తీవ్రంగా కనిపిస్తోంది. ఒక్కరోజే వైరస్ బారిన పడి మరో 129 మంది మృతిచెందినట్లు ఆ దేశ అధికారులు సోమవారం వెల్లడించారు. దీంతో అక్కడ మొత్తం మరణాల సంఖ్య 853కు చేరుకుంది. దేశ వ్యాప్తంగా 14, 991 కరోనా కేసులు నమోదైనట్లు తెలిపారు.
ఇరాన్ అసెంబ్లీ సీనియర్ నేత అయతోల్లా హషేమ్ బేతాయ్ (78) వైరస్ సోకి మరణించినట్లు ఆ దేశ మీడియా వెల్లడించింది. అంతేకాకుండా కేబినెట్ మంత్రులు, పార్లమెంట్ సభ్యులు, రెవల్యూషనరీ గార్డ్ మెంబర్స్, ఆరోగ్య మంత్రిత్వ శాఖకు చెందిన అధికారులు వైరస్ బారిన పడినట్లు అధికారులు స్పష్టం చేశారు. వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో ఇరాన్ ప్రభుత్వం మొత్తం లక్షా పదివేల పడకలను సిద్ధం చేసింది.
స్పెయిన్లో జాతీయ విపత్తుగా..
స్పెయిన్లో 24 గంటల వ్యవధిలో దాదాపు వెయ్యి కరోనా కేసులు నమోదైనట్లు ఆ దేశ ఆరోగ్య వర్గాలు వెల్లడించాయి. తాజా కేసులతో ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా వైరస్ బారిన పడిన వారి సంఖ్య 8,744కు చేరింది. ఇందులో దేశ రాజధాని మాడ్రిడ్లో 4,665 కేసులు నమోదుకావడం గమనార్హం.
తాజాగా 9 మంది మృతి చెందగా.. మొత్తం మరణాలు 297కి చేరినట్లు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో స్పెయిన్ ప్రభుత్వం కరోనాను జాతీయ విపత్తుగా ప్రకటించింది. 46 మిలియన్ల మంది గృహ నిర్బంధంలోనే ఉన్నారు.