స్విట్జర్లాండ్‌లో జెనీవా అంతర్జాతీయ కార్ల ప్రదర్శనకు సరికొత్త ఎలక్ట్రిక్ వాహనాలను సిద్ధం చేస్తున్నారు నిర్వాహకులు. కానీ బ్రెగ్జిట్, చైనాలో మందగించిన కొనుగోళ్లు వంటి సవాళ్ల మధ్య ఈ ప్రదర్శనకు ఆదరణ కరవయ్యే ప్రమాదం ఉందని నిపుణుల అంచనా.
యూకేలో సరికొత్త ఎక్స్-ట్రైయిల్ ఎస్యూవీ తయారీని నిలిపివేస్తున్నట్టు నిస్సాన్ సంస్థ ప్రకటించింది. వ్యాపార కారణాల వల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్టు వారు చెబుతున్నా... బ్రెగ్జిట్ ప్రభావమేనన్నది నిపుణుల వాదన.
దాదాపు 4వేల 500 ఉద్యోగులను తొలగించాలని భావిస్తున్నట్టు జాగ్వార్ లాండ్ రోవర్ ప్రకటించింది. చైనాలో డిమాండ్ తగ్గడం, ఐరోపా సమాఖ్య నుంచి యూకే వైదొలగడంపై నెలకొన్న సందిగ్ధతతో వ్యాపారం నష్టపోతోందని వారు ఆవేదన వ్యక్తం చేశారు.
"మేము నమ్మలేకపోతున్నాము. 18-24 నెలల ముందు లాభాల్లో ఉంది జాగ్వార్ లాండ్ రోవర్. కానీ డీజిల్‌కు డిమాండ్ తగ్గడం, చైనాలో కొనుగోళ్లు తగ్గడం ఆ సంస్థపై ఎంతో ప్రభావం చూపించాయి. లాభాల్లో ఉండే జాగ్వార్ ఇప్పుడు రికార్డు నష్టాల్లో ఉంది."
--- జిమ్ హోల్డర్, ఆటోకార్ ఎడిటోరియల్ డైరక్టర్
గతేడాది ఈ ప్రదర్శనలో పాల్గొన్న ఎన్నో లగ్జరీ వాహన సంస్థలు ఈసారి వెనక్కితగ్గాయి.
ప్రదర్శన పూర్తిగా వెలవెలబోకుండా... మెక్లారెన్, ఫెరారీ, లాంబోర్ఘిని, ఆస్టన్ మార్టిన్ వంటి సంస్థలు విలాసవంతమైన కార్లను ప్రదర్శనకు ఉంచుతున్నాయి.
విద్యుత్ వాహనాలే ఈ ఏడాది ప్రదర్శనలో ప్రత్యేకం. భూతాపం నుంచి బయట పడేందుకు ఇంధన వాహనాల స్థానంలో విద్యుత్ వాహనాలు అధికంగా ఉపయోగించాలన్నది నిపుణుల సూచన. కానీ విద్యుత్ వాహనాలకున్న ప్రతికూల అంశాల వల్ల వాటిని కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపించట్లేదు.
ఈ నెల 7 నుంచి 17 వరకు ప్రజలు ఈ ప్రదర్శనను సందర్శించడానికి నిర్వాహకులు ఏర్పాట్లు చేశారు.