తెలంగాణ

telangana

ETV Bharat / international

కరోనా: 53 దేశాలకు పాకిన బీ.1.617 రకం వైరస్​

బీ.1.617 రకం కరోనా వైరస్​పై ప్రపంచ ఆరోగ్య సంస్థ కీలక ప్రకటన చేసింది. భారత్​లో గుర్తించిన ఈ వైరస్​ ఇప్పుడు 53 దేశాలకు పాకిందని వెల్లడించింది. ఈ కొత్తరకం వైరస్​ బారిన పడినవారిలో తీవ్రత ఏవిధంగా ఉంటుందనేదానిపై పరిశీలన జరుగుతోందని సంస్థ తెలిపింది.

WHO on indian variant, భారత్​ రకం వైరస్​పై డబ్ల్యూహెచ్​ఓ
కరోనా వేరియంట్​

By

Published : May 26, 2021, 5:03 PM IST

భారత్‌లో గుర్తించిన కరోనా రకం (బీ.1.617) ఇప్పుడు 53 దేశాలకు పాకిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌ఓ) వెల్లడించింది. ఆరోగ్య సంస్థకు అనధికారికంగా అందిన సమాచారం ప్రకారం.. మరో ఏడు దేశాలకు కూడా ఆ వైరస్ రకం విస్తరించింది. దీంతో బీ.1.617 రకం బయటపడిన దేశాల సంఖ్య 60కి చేరినట్లు తెలుస్తోంది. ఈ కొత్త రకం వేగంగా సంక్రమిస్తోందని, అయితే దీని బారిన పడినవారిలో తీవ్రత ఏవిధంగా ఉంటుందనేదానిపై పరిశీలన జరుగుతోందని సంస్థ తెలిపింది.

బ్రిటన్‌ (బీ.1.1.7), దక్షిణాఫ్రికా (బీ.1.351), బ్రెజిల్‌ (పీ.1), భారత్‌ (బీ.1.617)లో మొదట గుర్తించిన కరోనా కొత్త రకాలను ఆరోగ్య సంస్థ ఆందోళన కలిగించే రకాలుగా వర్గీకరించింది. ఈ రకాలన్ని ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలకు విస్తరించి వైరస్ వ్యాప్తిని మరింత పెంచాయి. 149 దేశాల్లో బీ.1.1.7 రకం, 102 దేశాల్లో బీ.1.351, 59 దేశాల్లో పీ.1 రకాన్ని గుర్తించినట్లు తెలిపింది. అలాగే బీ.1.617 రకాన్ని మూడుగా విభజించింది. అవి.. బీ.1.617.1, బీ.1.617.2, బీ.1.617.3. వీటిలో మొదటిది 41 దేశాలకు, రెండవది 54 దేశాలకు, మూడవది ఆరు దేశాలకు విస్తరించింది. మొత్తంగా ఈ రకాన్ని 53 దేశాల్లో గుర్తించినట్లు పేర్కొంది. అనధికారిక సమాచారం ప్రకారం ఆ సంఖ్య 60గా ఉంది.

'వైరస్‌లో కొత్తరకాలు ఊహించిందే. కరోనా వైరస్ ఎంతగా విస్తరిస్తే.. అన్ని కొత్త రకాలు వెలుగుచూసే అవకాశం ఉంది' అని డబ్ల్యూహెచ్‌ఓ ఆందోళన వ్యక్తం చేసింది. అందుబాటులో ఉన్న చర్యల ద్వారా వ్యాప్తిని అరికట్టాలని ప్రపంచ దేశాలకు సూచించింది. వరల్డో మీటర్ గణాంకాల ప్రకారం.. ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటివరకు 16కోట్ల మందికి పైగా కరోనా బారిన పడగా.. 35లక్షలకు పైగా మరణాలు సంభవించాయి.

ఇదీ చదవండి :వారిలో దీర్ఘకాలం పాటు యాంటీబాడీలు!

ABOUT THE AUTHOR

...view details