మేకల అందాల పోటీల్లో విజేత 'మార్తా' ఉక్రెయిన్‌లోని కొజోవా పట్టణంలో అందాల పోటీలు జరిగాయి. పాల్గొన్నది ఎవరో తెలుసా...? మేకలు. వెలుగుజిలుగుల ఎంబ్రాయిడరీ చొక్కాలు, స్కర్టులు, రకరకాల అలంకరణలతో హొయలొలుకుతూ పోటీలో పాల్గొన్నాయి మేకలు. కొజోవా అంటే మేకల పట్టణం. ఇక్కడ నివాసం ఉండే 10 వేల మంది... మేకలను గౌరవప్రదంగా చూస్తారు. వాటి కోసం సంవత్సరంలో ఒకరోజు ఇలా పండుగ నిర్వహిస్తారు.
ఇక్కడ జరిగే అందాల పోటీలకు ఇతర ప్రాంతాల నుంచి ప్రజలు వారి మేకలను తీసుకొస్తారు.
మేము గత ఏడాది ఈ కార్యక్రమంలో పాల్గొన్నాము. ఈ సారి కూడా అందరూ వెళ్తుండటం చూసి మా మేకను తీసుకుని వెళ్లాలనుకున్నాను. మేము కొజోవా పట్టణ శివార్లలో నివాసం ఉంటాము. ఇక్కడకు రావాలంటే చాలా సమయం పడుతుంది. అయినా మేము వచ్చాము.
-వైరా పాంచ్కో, మేక యజమాని
ఏటా చాలామంది ఔత్సాహికులు ఈ కార్యక్రమాన్ని వీక్షించేందుకు వస్తుంటారు. పోటీలు అయిపోయాక అందాల విజేత ఎవరో నిర్ణయిస్తారు. ఈ సారి మార్తా అనే మేక అందాల రాణిగా నిలిచి పూల కిరీటం, 40 డాలర్లు సొంతం చేసుకుంది. ఆ తర్వాత దర్జాగా కారులో ఎక్కి ఇంటికెళ్లిపోయింది.
రన్నరప్‌గా నిలిచిన మార్తా తల్లి, ఇతర మేకలు 20 డాలర్లు బహుమానం, క్యారెట్లతో చేసిన నెక్లెస్‌ను గెలుచుకున్నాయి.
ఇదీ చూడండి:గజరాజులకు బఫెట్ విందు.. అతిథులకు కనువిందు..!