తెలంగాణ

telangana

ETV Bharat / international

'కొత్త' వైరస్ వేళ..​ 'క్రిస్మస్'పై ఆంక్షలు ఏ దేశంలో ఎలా? - బ్రిటన్​లో మళ్లీ ఆంక్షలు

ప్రతిఏటా ప్రపంచవ్యాప్తంగా క్రిస్మస్​ వేడుకలు ఘనంగా జరుగుతాయి. అయితే ఈ సారి ఒకప్పటి లాగా ఉండవు సంబరాలు. పెరులో క్రిస్మస్​ రోజున కారులో వెళ్లలేరు. లెబనన్​లో నైట్​ క్లబ్​కు వెళ్లినా డ్యాన్స్​ చేయలేరు. ఫ్రాన్స్​లో క్రిస్మస్​ విందులో ఆరుగురికన్నా ఎక్కువ మంది పాల్గొనలేరు. కొత్త రకం వైరస్​ స్ట్రేయిన్​ ప్రబలుతున్న నేపథ్యంలో ప్రపంచ దేశాలు క్రిస్మస్​ వేడుకలపై ఆంక్షలు విధించాయి. అయితే ఏ దేశంలో ఎలాంటి ఆంక్షలు ఉన్నాయో ఓసారి పరిశీలిద్దాం.

Global virus rules for Christmas
క్రిస్మస్​ ఆంక్షలు

By

Published : Dec 23, 2020, 9:52 PM IST

Updated : Dec 23, 2020, 10:15 PM IST

బ్రిటన్​లో వెలుగుచూసిన కొత్త రకం కరోనా వైరస్​ ఇప్పుడు ప్రపంచాన్ని కలవర పెడుతోంది. ఈ క్రమంలో ఇప్పటికే పలు దేశాలు బ్రిటన్​ విమానాలను నిషేధంచటం, లాక్​డౌన్, రాత్రి కర్ఫ్యూ అమలు చేస్తున్నాయి. క్రిస్మస్​ సందర్భంగా వైరస్​ విజృంభించే ప్రమాదమూ లేకపోలేదు. ఈ క్రమంలో కొత్త రకం వైరస్​ నుంచి ప్రజలను కాపాడేందుకు పరిష్కార మార్గాలను వెతుకుతున్నాయి పలు దేశాలు. అయితే.. కొన్ని దేశాలు ఆంక్షల వైపు అడుగులు వేస్తుంటే, కొన్ని దేశాలు సడలింపులు ఇస్తున్నాయి.

బ్రిటన్​..

కొద్ది రోజుల క్రితం వరకు కరోనా ఉన్నప్పటికీ సాధారణంగానే క్రిస్మస్​ను జరుపుకొనేందుకు అనుమతిచ్చింది బ్రిటన్​ ప్రభుత్వం. అందుకు ఆంక్షలను సడలించేందుకు అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు. క్రిస్మస్​ ఉత్సవాల్లో భాగంగా మూడు కుటుంబాలు కలిసి ఒకచోటికి వచ్చేందుకు అనుమతించారు. అయితే.. కొత్త రకం వైరస్​ కారణంగా ఆ ఆదేశాల్లో మార్పులు చేశారు. యూకే లోని ఇంగ్లాడ్​, స్కాట్​లాండ్​, వేల్స్​, ఉత్తర ఐర్లాండ్​లో వివిధ రకాల ఆంక్షలను అమలు చేస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో లాక్​డౌన్​ అమలవుతుండటం వల్ల క్రిస్మస్​ ప్రణాళికలను ఉపసంహరించుకున్నారు. లండన్​, ఈశాన్య ఇంగ్లాండ్​లో ఎవరి ఇంట్లో వారే క్రిస్మస్​ చేసుకోవాలని ఆదేశించారు.

అమెరికా..

అగ్రరాజ్యంలో కరోనా ఉద్ధృతి అధికంగా ఉన్నప్పటికీ దేశవ్యాప్తంగా ప్రయాణాలపై ఆంక్షలు విధించలేదు. అయితే.. ఆంక్షలు విధించటంపై రాష్ట్ర ప్రభుత్వాలకే అధికారాలు ఇచ్చింది ట్రంప్​ ప్రభుత్వం. ఈ క్రమంలో ప్రజలు ఇళ్లల్లోనే ఉండాలని సూచించాయి ఫెడరల్​ ఏజెన్సీలు.

" నా తండ్రికి దూరంగా జరుగుతోన్న తొలి క్రిస్మస్​ ఇది. ఆయన వర్జీనియాలో ఉంటున్నారు. ఇది చాలా బాధాకరం. "

- మిచెల్​ డలేయిర్​, మిచిగాన్​ అటార్నీ

హంగ్​కాంగ్​..

హాంగ్​కాంగ్​లో వైరస్​కు అడ్డుకట్ట వేసేందుకు ప్రయాణ, క్వారంటన్​కు కొత్త నిబంధనలు అమలు చేశారు. ఈ క్రమంలో క్రిస్మస్​కు స్వదేశానికి వెళ్లాలనుకునే వారు నిరాశకు గురవుతున్నారు. హాంగ్​కాంగ్​ ఆర్థిక శాఖలో పని చేసే జేమ్స్​ వ్రెన్​.. క్రిస్మస్​కు తన స్వదేశం ఐర్లాండ్​ వెళ్లాలనుకున్నారు. కానీ హాంగ్​కాంగ్​ సహా విదేశాల్లో అనిశ్చితి నెలకొనటం వల్ల తన ప్రయాణాన్ని రద్దు చేసుకోవాల్సి వచ్చింది.

" చాలా ఏళ్లుగా ఐర్లాండ్​కు బయట నివసిస్తున్నప్పటికీ... తొలిసారి నా కుటుంబంతో లేకుండా క్రిస్మస్​ చేసుకోవాల్సి వచ్చింది. ఇది నాకు చాలా బాధకలిగించే విషయం."

- జేమ్స్​ వ్రెన్​

దక్షిణాఫ్రికా..

కొత్త కేసుల సంఖ్య భారీగా పెరుగుతున్న నేపథ్యంలో ఈ క్రిస్మస్​కు ప్రధానంగా బీచ్​లు, బార్లపై ఆంక్షలు విధించింది దక్షిణాఫ్రికా. కేవలం సోమవారం నుంచి గురువారం వరకే మద్యం అమ్మకాలకు అనుమతించింది. రాత్రి కర్ఫ్యూ అమలు చేస్తోంది. క్రిస్మస్​ ఈవ్​, క్రిస్మస్​ డే సహా కొత్త సంవత్సరం రోజున బీచ్​లను మూసివేయనున్నారు. పెద్ద సంఖ్యలో గుమిగూడి ఉత్సవాలు చేసుకోకూడదని ప్రజలను కోరింది ప్రభుత్వం. అయితే.. ఇండోర్​లో 100 మంది, బహిరంగ ప్రదేశాల్లో 250 మంది వరకు అనుమతించారు.

కొత్త రకం వైరస్​ వ్యాప్తి నేపథ్యంలో అప్రమత్తమయ్యారు పోలీసులు. పలు కీలక రహదారులను మూసివేసి ప్రయాణాలపై ఆంక్షలు విధించారు. గత రెండు వారాల నుంచి కొత్త కేసులు, మరణాల్లో భారీగా పెరుగుదల వల్ల దక్షిణాఫ్రికా నుంచి విమానాలపై నిషేధం విధించాయి పలు దేశాలు.

చిలీ..

చిలీలో క్రిస్మస్​కు కొత్త ఆంక్షలను అమలు చేస్తోంది అక్కడి ప్రభుత్వం. క్రిస్మస్​ విందులో గరిష్ఠంగా 15 మందికి మాత్రమే అనుమతించింది.

ఇటలీ..

ఐరోపా దేశాల్లోనే అత్యధికంగా కరోనా మరణాలు ఇటలీలోనే సంభవించాయి. లాక్​డౌన్​ కారణంగా చాలా మంది పేదరికంలోకి జారుకున్నారు. అయినప్పటికీ.. కొత్త రకం వైరస్​ భయంతో మరిన్ని ఆంక్షలు విధించింది అక్కడి ప్రభుత్వం. ఈ నియమాలు రోజువారీగా మారనున్నాయి.

సడలింపు దిశగా​..

ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలు క్రిస్మస్​కు కొత్త ఆంక్షలు విధిస్తున్నప్పటికీ.. లెబనన్​ మాత్రం సడలింపు దిశగా అడుగులు వేస్తోంది. పర్యటకులు, లెబనన్ సంతతులను ఆకర్షించి విదేశీ మారకాన్ని పెంచుకోవాలని యోచిస్తోంది. ఇప్పటికే.. వేల మంది విదేశాల్లోని లెబనన్లు క్రిస్మస్​ కోసం స్వదేశానికి చేరుకున్నారు. దాంతో వైరస్​ విజృంభించే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు నిపుణులు.

లెబనన్​లో గత వారం నైట్​క్లబ్​లు తిరిగి తెరిచేందుకు అనుమతించారు. కానీ, నృత్యాలపై నిషేధం విధించారు. దీనిపై సామాజిక మాధ్యమాల్లో పెద్దఎత్తున చర్చ జరిగింది.

బ్రెజిల్​లోనూ క్రిస్మస్​ విందుపై ఎలాంటి ఆంక్షలు లేవు. ఎంతమందినైనా ఈ విందుకు ఆహ్వానించేందుకు అనుమతించారు.

ఇదీ చూడండి: సరికొత్త కానుకలతో శాంతాక్లాజ్​ సిద్ధం

Last Updated : Dec 23, 2020, 10:15 PM IST

ABOUT THE AUTHOR

...view details