భారతదేశ ప్రయాణికులపై విధించిన ఆంక్షలను జర్మనీ సడలించింది. అత్యంత ప్రమాదకరమైన వైరస్ వేరియంట్ కేసులున్న దేశాల జాబితా నుంచి భారత్‌ను తొలగించనున్నట్లు తెలిపింది. బుధవారం నుంచి ఈ నిర్ణయం అమలులోకి వస్తుందని ఆ దేశ జాతీయ అంటువ్యాధుల నియంత్రణ కేంద్రం రాబర్ట్ కూచ్ ఇన్స్టిట్యూట్ స్పష్టం చేసింది.
భారత్‌తో పాటు, నేపాల్, రష్యా, పోర్చుగల్, బ్రిటన్ దేశాలను సైతం ఈ జాబితా నుంచి తొలగించనున్నట్లు రాబర్ట్ కూచ్ సంస్థ తెలిపింది. ఈ దేశాలన్నింటిని వైరస్ తీవ్రత జాబితాలోని రెండో కేటగిరీలోకి చేర్చనున్నట్లు వెల్లడించింది.
ఈ జాబితాలో ఉన్న దేశాల ప్రయాణికులు రెండు డోసులు తీసుకున్నట్లైతే.. జర్మనీ వెళ్లిన తర్వాత క్వారంటైన్లో ఉండాల్సిన అవసరం లేదు. మిగిలినవారు పది రోజుల పాటు క్వారంటైన్లో ఉండాలి. ఐదు రోజుల తర్వాత నెగటివ్‌గా తేలితే.. క్వారంటైన్ నుంచి బయటకు వచ్చే అవకాశం ఉంది.