Flying car Slovakia: మీరు ప్రయాణిస్తున్న కారు 2 నిమిషాల్లో విమానంగా మారిపోతే.. గంటకు 300 కిలోమీటర్ల వేగంతో 8 వేల అడుగుల ఎత్తున దూసుకుపోతే.. గగనంలో ఆగకుండా వెయ్యి కిలోమీటర్లు ప్రయాణించి గమ్యం చేరిస్తే.. ఇదేదో హాలీవుడ్ సినిమా అనుకుంటున్నారా.. కాదు సాకారమవుతోన్న నిజం.
స్లోవేకియా రాజధాని బ్రాటిస్లావాలోని అంతర్జాతీయ విమానాశ్రయంలో ఎగిరే కారు విషయంలో కీలక ముందడుగు పడింది. గంటకు 300 కిలోమీటర్ల వేగంతో 8వేల అడుగుల కంటే ఎక్కువ ఎత్తులో దూసుకెళ్లే సామర్థ్యం గల ఎగిరే కారుకు ఎయిర్ వర్తీనెస్ సర్టిఫికెట్ జారీ చేస్తూ స్లొవేకియా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 70 గంటల పాటు టెస్టు ఫ్లైట్, 200 సార్లకుపైగా ల్యాండింగ్, టేకాఫ్‌ల తర్వాత ఈ ఎయిర్‌కార్‌కు ఎయిర్ వర్తీనెస్ సర్టిఫికెట్ జారీ చేశారు. 160 హార్స్ పవర్ బీఎండబ్ల్యూ ఇంజిన్ బిగించిన ఈ ఎగిరే కారు సాధారణ పెట్రోల్‌తోనే నడుస్తుంది. యూరోపియన్ ఏవియేషన్ సేఫ్టీ ఏజెన్సీ ఈఏఎస్ఏ ప్రమాణాలను ఈ ఎగిరే కారు అందుకున్నట్లు తయారీదారులు తెలిపారు. ఈ ఎయిర్ కారు 8,200 అడుగుల ఎత్తులో 1000 కిలోమీటర్లు ప్రయాణించగలదని వివరించారు. కారు నుంచి విమానంగా రూపాంతరం చెందడానికి ఈ కారుకు 2.15 నిమిషాలు అవసరం అవుతుంది.
ధర రూ.5.5 కోట్లు!
ఈ ఎగిరే కారు 500 కిలోమీటర్లు ప్రయాణించేందుకు 28 లీటర్ల ఇంధనం ఖర్చవుతుందని.. దీని ధర రూ. 4.5కోట్ల నుంచి రూ.5.5 కోట్ల వరకు ఉంటుందని ఎగిరే కారును తయారు చేసిన క్లెయిన్ విజన్ సంస్థ తెలిపింది. కారుకు ఇరువైపులా చిన్న చిన్న రెక్కలు అమర్చి ఉండగా.. ఎగిరే ముందు ఈ రెక్కలు విచ్చుకుని పక్షిలా మారిపోతుంది. ఇద్దరు ప్రయాణించే వీలుకున్న ఈ కారు గరిష్టంగా 200 కిలోల బరువు మోయగలదని ఆ సంస్థ సహ వ్యవస్థాపకుడు అంటోన్ జాజాక్ తెలిపారు. డ్రోన్‌ల మాదిరిగా ఈ ఎగిరే కారు ఎక్కడి నుంచి ఎక్కడికైనా ఎగరలేదని విమానంలానే టేకాఫ్, ల్యాండింగ్ చేయడానికి రన్‌వే అవసరం అవుతుందని తయారీదారులు వెల్లడించారు.