రాజకీయ నాయకులు, జర్నలిస్ట్‌లు, మానవహక్కుల పరిరక్షకులపై నిఘా వేసేందుకు ప్రభుత్వాలు పెగాసస్(Pegasus spyware) స్పైవేర్‌ను ఉపయోగించడం పట్ల ఐక్యరాజ్య సమితి ఆందోళన వ్యక్తం చేసింది. గోప్యతను ఉల్లంఘిస్తూ ఇలాంటి దాడులు జరగకుండా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాలను.. ఐరాస మానవ హక్కుల హైకమిషనర్ మిచెల్ బాచ్లెట్(Michelle Bachelet) కోరారు. మానవహక్కులకు భంగం కలిగించే విధంగా ప్రభుత్వాలు స్వయంగా ఇలాంటి నిఘా సాంకేతికతను ఉపయోగించడం మానుకోవాలని అన్నారు.
"రాజకీయ నాయకులు, జర్నలిస్టులు, మానవ హక్కుల పరిరక్షకులపై పెగాసస్ సాఫ్ట్‌వేర్‌ను ఉపయోగించినట్లు బయటకు రావడం ఆందోళకరం. ప్రజల మానవహక్కులను తక్కువ అంచనా వేస్తూ నిఘా సాంకేతికతలను దుర్వినియోగం చేస్తున్నారన్న విషయాన్ని ఇది స్పష్టం చేస్తోంది. నిఘా పరికరాలను అధికార యంత్రాంగాలు ఉపయోగించడం వల్ల తలెత్తే ప్రమాదాల గురించి ఐరాస మానవహక్కుల సంఘం వివిధ వేదికలపై ఆందోళన వ్యక్తం చేస్తూనే ఉంది. తాజాగా వచ్చిన ఆరోపణలు పాక్షికంగా నిజమని తేలినా.. ఎర్రగీత దాటినట్లే."