భారత్, బంగ్లాదేశ్, నేపాల్ సహా దక్షిణాసియాలో వరదల ప్రభావానికి గురైన దేశాలకు ఐరోపా సమాఖ్య అండగా నిలిచింది. విపత్తుతో దెబ్బతిన్న ప్రాంతాలకు సహాయం చేసేందుకు 1.65మిలియన్ యూరోల(రూ.14.51కోట్లు)ను అందిస్తున్నట్టు ప్రకటించింది.
"దక్షిణాసియాలో వర్షాకాలం బీభత్సం సృష్టిస్తోంది. ముఖ్యంగా ఈ ఏడాది వరదల తీవ్రత ఎక్కువగా ఉంది. ఈ అత్యవసర సహాయం.. క్షేత్రస్థాయిలో ఉండి సేవలందిస్తున్న మా భాగస్వాములకు ఉపయోగపడుతుంది. తిండి, గూడు, నీడ, జీవనాధారం కోల్పోయిన వారికి ఈ సహాయం అందుతుంది."
--తహీని థమ్మన్నగోడ, ఈయూ హ్యుమానిటేరియన్ ప్రోగ్రామ్స్ ఇన్ ఏషియా అండ్ పసిఫిక్ విభాగం.
అయితే అంపన్ తుపానుతో పాటు ఇతర వ్యాధులను ఎదుర్కొనేందుకు ఇప్పటికే 1.8మిలియన్ యూరోలను ప్రకటించింది ఈయూ. దీంతో.. ఈ ఏడాది దక్షిణాసియాకు ఇప్పటివరకు మొత్తం మీద 3.45మిలియన్ యూరోల సహాయాన్ని అందించింది.
తాజాగా ప్రకటించిన 1.65మిలియన్ యూరోల్లో.. 1 మిలియన్ నిధులు బంగ్లాదేశ్‌లోని అత్యవసర పనులకు వినియోగించినట్టు ఈయూ వెల్లడించింది. ఆ దేశంలోని 20లక్షలకు మందిపైగా నీరు, నీడ కోసం ఎదురుచూస్తున్నట్టు పేర్కొంది. మరో 0.500మిలియన్ యూరోలు.. నీరు, తిండి, సహాయక చర్యల కోసం భారత్‌కు అందించనున్నట్టు స్పష్టం చేసింది. మిగిలిన 0.150మిలియన్ యూరోలను నేపాల్‌కు ఇవ్వనున్నట్లు వెల్లడించింది.
ఇదీ చూడండి:-భారత్-ఈయూ మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం కుదిరేనా?