తెలంగాణ

telangana

కరోనా మహమ్మారి వల్ల మరో 'గడ్డ' కాలం

కరోనా వైరస్‌ ముదిరిన వారిలో న్యుమోనియా, అకస్మాత్తుగా శ్వాసకు విఘాతం కలగడం, అవయవాలు విఫలమవడం వంటి సమస్యలు తలెత్తుతున్నాయి. వీటికితోడు రక్తనాళాల్లోనూ గడ్డలు పుట్టుకొచ్చి, పక్షవాతంతోపాటు మరణాలకూ దారితీస్తున్నట్లు కొత్తగా బయటపడుతోంది. ఇంతకీ ఏమిటీ సమస్య? ఎందుకిలా అవుతోంది?

By

Published : May 23, 2020, 6:50 AM IST

Published : May 23, 2020, 6:50 AM IST

Effect of corona virus on blood cells
కరోనా మహమ్మారి వల్ల మరో 'గడ్డ' కాలం

కరోనా బాధితుల శరీరంపై గులాబీ దద్దుర్లు, కాళ్ల వాపులు, గుండెకు అమర్చిన గొట్టాలు పూడుకుపోవడంతోపాటు హఠాన్మరణమూ చోటు చేసుకుంటోంది. రక్తనాళాల్లో గడ్డల కారణంగానే ఇలా జరుగుతోందని పరిశోధకులు చెబుతున్నారు. దీన్ని ‘రక్తపు గడ్డల ఉప్పెన’గానూ వర్ణిస్తున్నారు. కొవిడ్‌ తీవ్రత పెరిగి, ముఖ్యంగా ఆసుపత్రుల్లో చేరిన వారికి అధిక ప్రమాదం పొంచి ఉంటోంది. ఆరోగ్యం విషమించిన వారిలో 20-30% మందికి ఈ ముప్పు ఉంటున్నట్లు నెదర్లాండ్స్‌, ఫ్రాన్స్‌ అధ్యయనాలు పేర్కొంటున్నాయి. సాధారణంగా రక్తపు గడ్డలు కరిగే సమయంలో డి-డైమర్‌ అనే ప్రొటీన్‌ విడుదలవుతుంది. ఆసుపత్రుల్లో చేరిన చాలామందిలోని రక్తంలో ఈ ప్రోటీన్‌ మోతాదులు అధికంగా ఉంటున్నాయి. దీని ఆధారంగా కొవిడ్‌తో మరణించే అవకాశమున్న వారినీ ముందుగానే గుర్తించొచ్చు. మరోవైపు రక్త కేశనాళికల్లోనూ సూక్ష్మమైన గడ్డలు బయటపడుతుండటం గమనార్హం. ఇది చాలా చాలా కొత్త విషయమంటున్న శాస్త్రవేత్తలు... కారణాల విశ్లేషణపై నిశితంగా దృష్టి సారించారు. అదే సమయంలో గడ్డలను కరిగించే మందులపైనా ప్రయోగ పరీక్షలు ప్రారంభించారు.

కొత్త చికిత్సలపై దృష్టి

కరోనా బాధితులను రక్షించడానికి నూతన చికిత్సల వైపు పరిశోధకులు దృష్టి సారించారు. రక్తాన్ని పలుచగా చేసే మందులు ఇందుకు బాగా ఉపయోగపడతాయి. అయితే మోతాదు విషయంలోనే భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పలు ఆసుపత్రుల్లో వెంటిలేటర్‌ మీదున్న కొందరికి ఈ మందులు ఇవ్వగా... మరణించే ముప్పు తగ్గినప్పటికీ పెద్ద మోతాదులో ఇస్తే దుష్ప్రభావాలు తలెత్తుతాయని కొందరు వైద్యుల భావన. మరికొన్నిచోట్ల గడ్డలను కరిగించే శక్తిమంతమైన టీపీఏ మందుపైనా ప్రయోగాలు చేస్తున్నారు. వీటి ఫలితాలు మున్ముందు చికిత్సల తీరుతెన్నులను నిర్దేశించగలవని పరిశోధకులు ఆశిస్తున్నారు.

రెండు అంశాలు దోహదం?

బాధితుల్లో రక్తపు గడ్డలు ఎందుకు ఏర్పడుతున్నాయన్నది ఇప్పటికీ అంతు చిక్కలేదు. అయితే.. ఇందుకు 2 అంశాలు దోహదం చేస్తుండొచ్చని భావిస్తున్నారు.
1 కరోనా వైరస్‌ రక్తనాళాల లోపలి గోడల్లోని కణాల మీద నేరుగా దాడి చేయడం. సాధారణంగా రక్తనాళాలు నున్నగా, మృదువుగా ఉంటాయి. వీటి లోపలి గోడలు రక్తాన్ని గడ్డకట్టించే కారకాలు బయటకు రాకుండా నిలువరిస్తుంటాయి. ఒకవేళ ఇన్‌ఫెక్షన్‌కు గురైతే గోడల కణాలు దెబ్బతిని, రక్తం గడ్డకట్టే ప్రక్రియ పుంజుకుంటుంది. కొవిడ్‌లోనూ ఇలాగే జరుగుతుండొచ్చని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఎందుకంటే కరోనా వైరస్‌ ఊపిరితిత్తుల్లోకి ప్రవేశించడానికి దోహదం చేసే ఏసీఈ2 గ్రాహకాలు రక్తనాళాల గోడల కణాల్లోనూ ఉంటాయి. ఇవి ఇన్‌ఫెక్షన్‌కు గురయ్యే అవకాశం లేకపోలేదని కొన్ని అధ్యయనాలు వివరిస్తున్నాయి.

2..రోగ నిరోధక వ్యవస్థ ప్రతిస్పందనలు. కొవిడ్‌ బాధితుల్లో రోగ నిరోధక కణాలు... వాపు ప్రక్రియను(ఇన్‌ఫ్లమేషన్‌) ప్రేరేపిస్తున్నట్లు ఇప్పటికే బయటపడింది. ఇది రకరకాల మార్గాల్లో రక్తం గడ్డకట్టేందుకూ ప్రేరేపిస్తుంది. ఇవేకాకుండా.. వృద్ధాప్యం, అధిక బరువు, మధుమేహం, అధిక బీపీ వంటి సమస్యలతోనూ రక్తంలో గడ్డలు ఏర్పడే ప్రమాదముంది. ప్రస్తుతం కొవిడ్‌తో ఆసుపత్రుల్లో చేరుతున్న చాలామంది వీటితో బాధపడుతున్నవారే ఉంటున్నారు.

ABOUT THE AUTHOR

...view details