కరోనా బారినపడి కోలుకున్నవారిలో చాలా మందిని ఈ వైరస్ లక్షణాలు వెంటాడుతున్నాయని ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ తాజా అధ్యయనం ఒకటి వెల్లడించింది. కొవిడ్ సోకి డిశ్చార్జి అయిన రెండు, మూడు నెలల తర్వాత కూడా వారిలో ఆ ప్రభావం ఉన్నట్టు బ్రిటన్‌లోని ఆక్స్‌ఫర్డ్ వర్సిటీ శాస్త్రవేత్తలు గుర్తించారు. 58 మందిపై అధ్యయనం చేసిన శాస్త్రవేత్తలు పలు విషయాలను వెల్లడించారు. ఆస్పత్రుల్లో చికిత్స అనంతరం ఇంటికి చేరుకున్న వారిలో సగం మందిలో శ్వాస సంబంధమైన ఇబ్బందులతో పాటు అలసట, మానసిక ఆందోళన, ఒత్తిడి తదితర సమస్యలు తలెత్తినట్టు అధ్యయనంలో తేలిందన్నారు.
కరోనా నుంచి కోలుకున్న వారిలో 64 శాతం మంది శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు పడుతున్నారని ఆక్స్‌ఫర్డ్ వర్సిటీ సోమవారం వెల్లడించిన అధ్యయనం తెలిపింది. 55 శాతం మంది అలసటకు గురవుతున్నారని పేర్కొంది. దీంతో పాటు 60శాతం మందిలో ఊపిరితిత్తుల సమస్యలు, 29 శాతం మందిలో హృద్రోగ, 10 శాతం మందిలో కిడ్నీ సంబందిత సమస్యలు తలెత్తుతున్నాయని వివరించింది.