తరచూ ఉత్పరివర్తనం చెందుతూ రూపు(Covid Variant News) మార్చుకొంటున్న కరోనా వైరస్ ప్రపంచ దేశాలను మరోసారి వణికిస్తోంది. తాజాగా ఐరోపా(Coronavirus In Europe), మధ్య ఆసియాల్లోని సుమారు 53 దేశాల్లో(Coronavirus In World) మహమ్మారి విలయతాండవం తీవ్రంగా కలవరపెడుతోంది. వరసగా అయిదు వారాలుగా క్రమేపీ పెరుగుతూ వస్తున్న కేసులు ప్రమాద ఘంటికలు మోగిస్తున్నాయంటూ డబ్ల్యూహెచ్‌ఓ(Who On Covid 19) ఆందోళన వ్యక్తం చేసింది. వ్యాక్సినేషన్(Vaccination In World) ప్రక్రియను వేగవంతం చేయాలంటూ ఆయా దేశాలు అధికార యంత్రాంగాలను పరుగులెత్తిస్తున్నాయి. భారత్‌లోనూ పలు రాష్ట్రాల్లో పరిస్థితి తీవ్రంగా ఉంది. కేరళ, మహారాష్ట్ర, కర్ణాటకలలో ఉవ్వెత్తున పెరిగిన కేసులు కొన్ని రోజులుగా నెమ్మదించినా... తాజాగా బంగాల్, అసోంలలో మళ్ళీ అలజడి చెలరేగుతోంది. బంగాల్‌లో కొవిడ్ పాజిటివిటీ రేటు గత నెలరోజుల్లో 1.93 నుంచి 2.39కి, అసోంలో అది 1.89 నుంచి 2.22కు పెరిగింది. వ్యాక్సినేషన్‌లో వంద కోట్ల మైలురాయిని అధిగమించినప్పటికీ- తొలుత పంపిణీలో నెలకొన్న ప్రతిష్టంభనవల్ల దేశంలో ఆ కార్యక్రమం నెమ్మదించింది. తాజాగా ప్రధాని నరేంద్ర మోదీ టీకా ప్రక్రియ మందకొడిగా ఉన్న 40 జిల్లాల కలెక్టర్లతో దూర దృశ్య మాధ్యమ సమావేశం నిర్వహించి వేగం పెంచాల్సిందిగా కోరారు. భారత్‌లో ఇంటింటికీ టీకా అందాలంటూ జిల్లాల పాలనాధికారులను ఆదేశించారు.
ఇలాగే కొనసాగితే...
ఐరోపా దేశాల్లో(Coronavirus In Europe) వారంరోజుల వ్యవధిలో 18 లక్షల కొవిడ్ కేసులు వెలుగుచూశాయి. 24 వేల మరణాలు సంభవించాయి. అంతకుముందు వారంతో పోలిస్తే కేసుల్లో ఆరుశాతం, మరణాల్లో 12శాతం చొప్పున పెరుగుదల నెలకొన్నట్లు అంచనా. 'కరోనాపై మానవాళి సాగిస్తున్న పోరుబాటలో ఇది మరో సంక్లిష్టమైన దశ. ఏడాది క్రితం ఐరోపా దేశాలకు ఎదురైన సవాళ్లు... మరోసారి అంతే తీవ్రతతో కోరసాచాయి. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే వచ్చే ఏడాది ఫిబ్రవరికల్లా మరో అయిదు లక్షలమంది కొవిడ్ మహమ్మారికి బలయ్యే ప్రమాదం ఉంది' అని రెండు రోజుల క్రితం డబ్ల్యూహెచ్‌ఓ(Who On Covid 19) ఐరోపా ప్రాంతీయ సంచాలకుడు హ్యాన్ క్లూజ్ వెల్లడించడం పరిస్థితి తీవ్రతను కళ్లకు కడుతోంది. ఐరోపా దేశాలైన ఆస్ట్రియా, గ్రీస్, స్వీడన్, ఇటలీ, ఫ్రాన్స్, కొసావో, క్రొయేషియా తదితర దేశాల్లోని పలు నగరాల్లో ఇటీవల మళ్ళీ కర్ఫ్యూ అమలులోకి వచ్చింది. మహమ్మారి ధాటికి యూకే, రష్యా, జర్మనీ అధికంగా ప్రభావితమవుతున్నాయి. ఇటీవల రష్యాలో కేసులు అనూహ్యంగా పెరగడంతో నవంబరు ఏడో తేదీవరకు పౌరులు ఇళ్లలోనే ఉండాలంటూ ఆ దేశ అధ్యక్షుడు పుతిన్ సూచించారు.