ప్రపంచవ్యాప్తంగా కరోనా బాధితుల సంఖ్య అంతకంతకూ పెరుగుతూనే ఉంది. కరోనా ధాటికి అగ్రరాజ్యాలు కూడా చిగురుటాకులా వణికిపోతున్నాయి. ఇప్పటివరకు 22.75 లక్షల మందికి వైరస్ సోకగా.. 1,56,104 మంది మృతి చెందారు. 5.82 లక్షల మంది కోలుకున్నారు.
దేశాలన్నింటిలో కన్నా అమెరికాపై వైరస్ ప్రభావం అధికంగా ఉంది. ఇప్పటివరకు 7.1 లక్షల కేసులు నమోదు కాగా 37,175 మంది మృతి చెందారు. వైరస్ వ్యాప్తి మొదలైన చైనాలో 82,719 కేసులు ఉండగా.. 4,632 మంది మరణించారు.
ఐరోపా దేశాల్లో..
అమెరికా తర్వాత ఐరోపా దేశాల్లో కరోనా ప్రళయం కొనసాగుతోంది. ఐరోపాలో మొత్తం కేసుల సంఖ్య 11.11 లక్షలు నమోదు కాగా.. మృతుల సంఖ్య లక్షకు పెరిగింది. ఐరోపా దేశాల్లో ప్రధానంగా స్పెయిన్‌ను కరోనా రక్కసి కాటేస్తోంది.
స్పెయిన్‌లో కేసులు 1.91 లక్షలకు చేరగా.. 20 వేలకుపైనే ప్రాణాలు విడిచారు. ఆ తర్వాత ఇటలీ, ఫ్రాన్స్‌లో కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. బ్రిటన్‌లో ఇవాళ ఒక్కరోజే 888 మంది మృత్యువాత పడ్డారు. జర్మనీలో కేసులు, మరణాల సంఖ్య కాస్త తగ్గుముఖం పట్టాయి.
ప్రాంతాలవారీగా..
ఇరాన్, టర్కీ, బెల్జియం, బ్రెజిల్, రష్యా, మెక్సికో దేశాల్లోనూ కరోనా ప్రకంపనలు సృష్టిస్తోంది. బెల్జియంలో కరోనా వైరస్ వ్యాప్తి అంతకంతకూ పెరిగిపోతోంది. ఇవాళ ఒక్కరోజే వెయ్యి కేసులు నమోదయ్యాయి. ఆసియాలో 1.5 లక్షలు, పశ్చిమాసియాలో 1.19 లక్షలు, లాటిన్ అమెరికా, కరీబియన్ దేశాల్లో 91,699 కేసులు నమోదయ్యాయి.
పొరుగుదేశం పాకిస్థాన్‌లోనూ కరోనా వైరస్ విజృంభిస్తోంది. ఇవాళ కొత్తగా 456 కేసులు నమోదు కాగా.. మొత్తం పాజిటివ్ కేసులు 7,500కు చేరువయ్యాయి. సింగపూర్‌లో ఒక్కరోజులో 942 మందికి వైరస్ సోకగా.. మొత్తం కేసులు 6 వేలకు పెరిగాయి.
ఇదీ చూడండి:ల్యాబ్ నుంచే వైరస్! వుహాన్‌లో ఏం జరిగింది?