ప్రపంచవ్యాప్తంగా 190 దేశాలకు విస్తరించిన కరోనా పలు దేశాల్లో మృత్యు ఘంటికలు మోగిస్తూనే ఉంది. ఇప్పటివరకు 14,436 మందిని బలితీసుకుంది. కేసుల సంఖ్య కూడా అమాంతం పెరిగి.. ఏకంగా 3.32 లక్షలకు చేరింది. ఇటలీపై తీవ్ర ప్రభావం చూపిస్తోన్న ఈ మహమ్మారి ధాటికి.. ఒక్కరోజులో 651 మంది బలయ్యారు. ఆ దేశంలో మొత్తం మృతుల సంఖ్య రికార్డు స్థాయిలో 5,476కు చేరింది. కొత్తగా 5,560 కేసులు నమోదవ్వగా.. ఇప్పటివరకు మొత్తం 59,138 మంది వైరస్ బారినపడ్డారు.
ఇటలీ తర్వాత స్పెయిన్‌లో..
ఇటలీ తర్వాత స్పెయిన్‌లో కరోనా తీవ్రత అధికంగా ఉంది. ఆ దేశంలో ఒక్కరోజే 375 మంది చనిపోగా.. 3,107 కొత్త కేసులు నమోదయ్యాయి. మొత్తం కరోనా బాధితుల సంఖ్య 28,603కు చేరింది.
అమెరికాను కొవిడ్-19 తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. ఒక్కరోజులోనే అక్కడ 120 మందికిపైగా మృత్యువాతపడ్డారు. మరో 8,500 మందికిపైగా కరోనా పాజిటివ్‌గా నిర్ధరణ అయింది.
ఒక్కరోజు వ్యవధిలో ఆయా దేశాలపై కరోనా ప్రభావం:
- ఇరాన్లో కరోనా మరణాల సంఖ్య భారీగా పెరుగుతోంది. ఒక్కరోజులో 129 మంది చనిపోయారు. సుమారు 1,000కి పైగా కొత్త కేసులు బయటపడ్డాయి.
- ఫ్రాన్స్‌లో 112 మంది ప్రాణాలు కోల్పోయారు. 1,559 మంది వైరస్ బారినపడ్డారు.
- బ్రిటన్‌లో 48 మంది, నెదర్లాండ్స్‌లో 43 మంది వైరస్ సోకి మృత్యువాతపడ్డారు.
- స్విట్జర్లాండ్, ఇండోనేషియా, జర్మనీ దేశాలలో మృతుల సంఖ్య తక్కువగా ఉన్నప్పటికీ.. కొత్తకేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి.