Corona Booster Dose: కరోనా టీకా మూడో డోసు యాంటీబాడీల స్థాయిని పెంచుతోందని, తద్వారా కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్‌ను తటస్థీకరించడంలో ప్రభావవంతంగా పని చేస్తోందని మరో అధ్యయనంలో తేలింది. బ్రిటన్‌లోని ఫ్రాన్సిస్ క్రిక్ ఇన్‌స్టిట్యూట్, నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ హెల్త్ రీసర్చ్ పరిశోధకులు చేసిన అధ్యయనంలో ఈ విషయం స్పష్టమైంది. లాన్సెట్ జర్నల్‌లో ఈ అధ్యయనం ప్రచురితమైంది.
Omicron News: ఫైజర్ లేదా అస్ట్రాజెనెకా టీకా రెండు డోసులు అందుకున్న వారిలో ఉత్పత్తి అయిన ప్రతిరక్షకాలు అల్ఫా, డెల్టా వేరియంట్లతో పోలిస్తే ఒమిక్రాన్‌పై అంతగా ప్రభావం చూపడం లేదని ఈ అధ్యయనంలో తేలింది. రెండో డోసు తీసుకున్న తర్వాత మూడు నెలల్లో యాంటీబాడీ స్థాయిలు తగ్గుతున్నట్లు స్పష్టమైంది. బూస్టర్ డోసు తీసుకోవడం వల్ల యాంటీబాడీలు పెరిగి ఒమిక్రాన్‌ను ఎదుర్కొవడంలో సమర్థంగా పని చేస్తున్నట్లు పరిశోధకులు గుర్తించారు. ఒమిక్రాన్‌పై టీకా రెండు డోసులు తీసుకున్న వారి కంటే మూడు డోసులు తీసుకున్న వారిలో యాంటీబాడీలు 2.5 రెట్లు ఎక్కువగా ఉన్నట్లు నిర్ధరించారు. గతంలో కొవిడ్ సోకి, రెండు డోసుల టీకా తీసుకున్న వారిలో కూడా యాంటీబాడీలు ఎక్కువగా ఉన్నట్లు తేల్చారు. యాంటీబాడీల స్థాయి పెరిగి కొవిడ్ కారణంగా తీవ్ర అనారోగ్యం పాలవకుండా లేదా ఆస్పత్రిలో చేరకుండా ఉండాలంటే మూడో డోసు అవసరమని పరిశోధకులు సూచిస్తున్నారు.