ఏదైనా వాసనను గ్రహించాలంటే ఏం చెయ్యాలని ఎవరైనా మనల్ని అడిగితే.. ముందుగా పీల్చాలి అనే సమాధానం టక్కున చెప్పేస్తాం. వాస్తవానికి మనం దానిని ఆస్వాదించాలనేది నిజం. ఒక్కో వాసన ఒక్కో అనుభూతినిస్తుంది. అయితే మన పూర్వీకుల కాలంలోని వాసనలను నేడు మనం ఆస్వాదించగలిగితే?? అలాగే భిన్న వాసనలను భవిష్యత్ తరాలకు అందించగలిగితే? ఐడియా అదిరింది కదా.! కానీ గతంలోని వాసనలను ఇప్పుడెలా సేకరిస్తాం?? అసలింతకీ వాసనలను నిల్వ చేయడమెలా? చేసినా అవి ఎక్కువ రోజులు ఉండగలవా? ఇలాంటి ప్రశ్నలన్నింటికీ బ్రిటన్లో ఏర్పాటుకానున్న 'వాసనల మ్యూజియం' రూపంలో చక్కని జవాబు లభించనుంది.
"వాసనలు మన సాంస్క్రతిక నేపథ్యాన్ని, వారసత్వాన్ని, జన్యు నిర్మాణాన్ని ప్రతిబింబిస్తాయి. మనం ఇప్పుడు భద్రపరచే వాసనలకు తోడు.. వీటికి సంబంధించిన విలువైన సమాచారాన్ని భవిష్యత్ తరాలు పూర్తిస్థాయిలో తెలుసుకోవడానికి వీలవుతుంది. . అందుకే గతకాలపు వాసనలను తెలుసుకోవడం ముఖ్యం. ఫలితంగా నాటి అనుభవాలు, భావోద్వేగాలను అర్థంచేసుకోగలుగుతాం. ఇతరులతో పంచుకోగలుగుతాం."
--సిసీలియా బెంబోర్, యూసీఎల్లో వారసత్వ శాస్త్ర అధ్యయనవేత్త
అంతరించిపోయిన పరిమళ ద్రవ్యాలు, కొన్ని చారిత్రక సువాసనలను తిరిగి తీసుకురావాలనే ఉద్దేశంతో బెంబోర్ తన సహచరులతో కలసి పనిచేస్తున్నారు. ఇందులో భాగంగా కృత్రిమ మేధను ఉపయోగించి గత సువాసనలను తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. అంతేగాక చారిత్రక గ్రంథాలలోని సమాచారాన్ని విశ్లేషించాలని భావిస్తున్నారు. సుగంధ పరిమళాలు, పొగాకు వాసనల్లో మార్పులు, పారిశ్రామిక విప్లవంతో వచ్చిన మార్పులను గ్రహించేందుకు కృత్రిమ మేధ ఉపయోగపడనుంది.