తెలంగాణ

telangana

ETV Bharat / international

మూడోసారీ నిరాశే... మే రాజీనామా తప్పదా? - TERESA MAY

బ్రిటన్​ ప్రధాని థెరిసా మే బ్రెగ్జిట్​ ప్రతిపాదనను మూడోసారీ చట్ట సభ్యులు తిరస్కరించారు. తాజా ఓటమితో థెరిసా మే పదవికి గండం ఏర్పడింది. ఆమె రాజీనామా చేయాలని సొంత పార్టీ నుంచే ఒత్తిడి పెరుగుతోంది.

బ్రెగ్జిట్​కు ముచ్చటగా మూడో'సారీ'..!

By

Published : Mar 30, 2019, 7:11 AM IST

బ్రెగ్జిట్​కు మరోసారి తిరస్కరణ
బ్రిటన్​ ప్రధాని థెరిసా మేకి మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. ఆమె బ్రెగ్జిట్ ప్రతిపాదనను చట్ట సభ్యులు మూడోసారీ తిరస్కరించారు. బ్రిటన్​ పార్లమెంటు దిగువ సభలో ఈ బిల్లును 344 మంది వ్యతిరేకించారు. 286 మంది అనుకూలంగా ఓటేశారు. 58 ఓట్ల తేడాతో బిల్లు వీగిపోయింది. ఫలితంగా ఈయూ నుంచి బ్రిటన్​ ఎటువంటి ఒప్పందం చేసుకోకుండానే వైదొలిగే పరిస్థితి ఏర్పడింది.

బ్రెగ్జిట్ గడువు ఏప్రిల్​ 12తో ముగియనుంది. ఆ గడువు మే 22 వరకు పొడిగించడానికి ఈయూ అంగీకరించింది. అయితే దానికి బ్రిటన్​ పార్లమెంటు​ ఆమోదం తెలపాలని షరతు విధించింది. తాజాగా థెరిసా మే ప్రతిపాదన మూడోసారీ వీగిపోయింది. ఫలితంగా ఏప్రిల్​ 12లోపు మరో కొత్త ప్రణాళికతో సమస్యను అధిగమించాల్సి ఉంటుంది. ఇందుకు 14 రోజులు మాత్రమే సమయం ఉంది.

ప్రధాని పదవి నుంచి వైదొలగాలి..

"థెరిసా మే బ్రెగ్జిట్​ ప్రతిపాదనను పార్లమెంటు తిరస్కరించింది. మరో సరికొత్త ఒప్పందం చేసుకోవాల్సిన అవసరం ఉంది" అని ప్రతిపక్ష లేబర్​ పార్టీ నేత జెర్మీ కార్బియాన్​ అభిప్రాయపడ్డారు. ఈ ప్రతిపాదనకు థెరిసా మే అంగీకరించకపోతే ప్రధాని పదవికి వెంటనే రాజీనామా చేయాలని ఆయన డిమాండ్​ చేశారు.

ఓడినా ఆదరణ పెరిగింది..

థెరిసా మే ప్రతిపాదన మూడోసారి వీగిపోయినప్పటికీ గతంతో పోల్చితే ఓట్ల శాతంలో తేడా కనిపించింది. ఇప్పుడు కేవలం 58 ఓట్ల తేడాతో బ్రెగ్జిట్​ తిరస్కరణకు గురైంది. ఇంతకుముందు ఈ తేడా 149 ఓట్లుగా ఉండటం గమనార్హం. జనవరిలో ఈ తేడా 230 ఓట్లుగా ఉంది.

సొంత గూటి నుంచే ఎసరు..

సొంత కన్జర్వేటివ్​ పార్టీ నుంచే థెరిసా మే వ్యతిరేకత ఎదుర్కొంటున్నారు. ఆమె ప్రధాని పదవి నుంచి వైదొలగాలని 28 సభ్యుల కూటమి ఒత్తిడి తెస్తోంది.

బ్రెగ్జిట్​ ప్రతిపాదనలను మరోసారి బ్రిటన్ పార్లమెంటు తిరస్కరించడంపై యూరోపియన్​ కౌన్సిల్​ అధ్యక్షుడు డొనాల్డ్​ టస్క్ స్పందించారు. ఏప్రిల్​ 10న ఈ విషయంపై మండలిని సమావేశపరుస్తామన్నారు.

బ్రెగ్జిట్​ తిరస్కరణపై డొనాల్డ్​ టస్క్​ స్పందన

ABOUT THE AUTHOR

...view details