తెలంగాణ

telangana

ETV Bharat / international

ఇది విన్నారా..? వైరస్‌ను 'ఢీ' కొట్టే విటమిన్‌ - vitamin-D in body

కరోనాను ఎదుర్కొనేలా రోగనిరోధక వ్యవస్థకు విటమిన్​-డి ఊతమిస్తోందని ఓ అధ్యయనం వెల్లడించింది. విటమిన్​-డి పుష్కలంగా ఉండే వారిలో ఈ వైరస్​ను ఎదుర్కొనే శక్తి ఉంటుందని తెలిపింది.

vitamin-D
వైరస్‌ను 'ఢీ' కొట్టే విటమిన్‌

By

Published : May 14, 2020, 10:01 AM IST

'విటమిన్‌-డి' పుష్కలంగా ఉండే ప్రజల్లో కరోనా వైరస్‌ వ్యాప్తి, మరణాలు తక్కువగా ఉంటున్నాయని ఐర్లాండ్‌లోని ట్రినిటీ కాలేజ్‌ అధ్యయనం వెల్లడించింది. ఐరోపాలోని వయోజన జనాభాలో విటమిన్‌-డి స్థాయిల్ని అందులో విశ్లేషించారు. చర్మంపై సూర్యరశ్మి పడటం ద్వారా విటమిన్‌-డి సహజంగానే తయారవుతుంది. తొలుత కాలేయానికి, ఆ తర్వాత మూత్రపిండాలకు వెళ్లి చురుకైన హార్మోన్‌గా మారుతుంది. ఇదే ఆహారం నుంచి కాల్షియాన్ని గ్రహించి శరీర వ్యాప్తంగా రవాణా చేస్తుంది. ఎముకల పటుత్వంతోపాటు కండరాల ఆరోగ్యానికి ఈ ప్రక్రియే ముఖ్యం.

వైరల్‌ ఇన్‌ఫెక్షన్లను ఎదుర్కోవడంలోనూ విటమిన్‌-డి కీలకమని ఇప్పటికే పలు పరిశోధనల్లో తేలింది. ప్రస్తుతం కరోనాను సైతం ఎదుర్కొనేలా రోగనిరోధక వ్యవస్థకు ఊతమిస్తోందని గుర్తించారు. ఈ అధ్యయనంలో దిగువ అక్షాంశంలో ఉండే స్పెయిన్‌, ఉత్తర ఇటలీలలో పరిస్థితిని ఉదహరించారు. ఇవి ఎండ దేశాలే అయినా ప్రజల్లో విటమిన్‌ డి లోపం ఎక్కువ. ఐరోపాలో వైరస్‌ వ్యాప్తి, మరణాలు ఇక్కడే ఎక్కువగా నమోదయ్యాయి. వీటితో పోలిస్తే ఉత్తర అక్షాంశ దేశాలైన నార్వే, ఫిన్లాండ్‌, స్వీడన్‌ ప్రజల్లో విటమిన్‌-డి పాళ్లు ఎక్కువ. ఇక్కడ సూర్యరశ్మి తక్కువే అయినా ఆహారంలో విటమిన్‌ సమృద్ధిగా ఉండేలా చూసుకుంటారు. ఈ దేశాల్లో కొవిడ్‌ ఇన్‌ఫెక్షన్లు, మరణాలు తక్కువగా ఉన్నాయి.

ABOUT THE AUTHOR

...view details