బ్రిటన్ రాజధాని లండన్ సమీపంలో ఓ ట్రక్ కలకలం సృష్టించింది. ఆగ్నేయ ఇంగ్లండ్‌లోని ఎస్సెక్స్ గుండా వెళ్తున్న ఓ లారీ కంటైనర్‌లో 39 శవాలను పోలీసులు గుర్తించారు. ఇందులో 38 మంది వయోజనులు కాగా ఓ టీనేజర్ ఉన్నాడని ఎస్సెక్స్ పోలీసులు తెలిపారు.
బల్గేరియా నుంచి వస్తున్న ఈ ట్రక్కు ఎస్సెక్స్‌లోని వాటర్‌గ్లేడ్ పార్క్ వద్ద అర్ధరాత్రి 1.40 గంటలకు పోలీసులు తనిఖీలు చేస్తుండగా పట్టుబడింది. వెంటనే ఆంబులెన్స్‌కు సమాచారమందించారు పోలీసులు. ట్రక్కులో ఉన్న అందరూ చనిపోయినట్లు వైద్యులు ధ్రువీకరించారు.
లారీని నడుపుతున్న వ్యక్తిని ఉత్తర ఐర్లాండ్‌కు చెందినవాడిగా గుర్తించారు పోలీసులు. అతడిపై హత్య కేసు నమోదు చేసి, విచారిస్తున్నారు.
"మృతదేహాలతో ఉన్న లారీ బల్గేరియా నుంచి వస్తున్నట్లు అనుమానిస్తున్నాం. శనివారం ఇంగ్లండ్‌లోని హోలీహెడ్ నుంచి బ్రిటన్‌లోకి ప్రవేశించిందని భావిస్తున్నాం. అత్యవసర సేవల విభాగం వచ్చి లారీలో ఉన్నవారు మరణించినట్లు ప్రకటించింది. ప్రాథమిక సమాచారం ప్రకారం ఇందులో ఒకరు టీనేజర్ కాగా మిగిలిన వారు వయోజనులు.
కేసుపై దర్యాప్తు ప్రారంభించాం. లారీ డ్రైవర్‌ను ఉత్తర ఐర్లాండ్‌కు చెందిన 25 ఏళ్ల యువకుడిగా గుర్తించాం. అతడినే మొదటి అనుమానితుడిగా భావించి అదుపులోకి తీసుకుని విచారిస్తున్నాం. బాధితులెవరన్నదీ ఇంకా గుర్తించలేదు. ఇది సుదీర్ఘమైన ప్రక్రియ."
-పిప్పా మిల్స్, ఎస్సెక్స్ పోలీస్ అధికారి