న్యూజిలాండ్‌లోని క్రైస్ట్‌చర్చ్, లిన్మోర్ మసీదులపై జరిగిన ఉగ్రదాడిని ప్రపంచ దేశాలు మూకుమ్మడిగా ఖండించాయి. ముస్లిం వ్యతిరేక భావనలను నిర్మూలించేందుకు దేశాలన్ని ముందుకురావాలని ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్ పిలుపునిచ్చారు.
"ఈ విచారకర సంఘటనను తీవ్రంగా ఖండిస్తున్నాను. మసీదుల్లో శాంతియుతంగా ప్రార్థనలు చేస్తున్న అమాయక ప్రజలపై కాల్పులు జరపటం అత్యంత హేయమైన చర్య. మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి. ముస్లిం వ్యతిరేక భావనలకు నిర్మూలించేందుకు ప్రపంచ దేశాలన్ని కృషి చేయాలి."
- ఆంటోనియో గుటెరస్, ఐరాస ప్రధాన కార్యదర్శి
ప్రపంచ వ్యాప్తంగా ఇస్లాం అంటే భయం(ఇస్లామోఫోబియా)కు వ్యతిరేకంగా తక్షణమే ఉద్యమించాలని అన్ని దేశాలను గుటెరస్ కోరారు. అసహనం, తీవ్రవాదం ఏ రూపంలో ఉన్నా అణచివేయాలని సూచించారు.
కొందరి పని మాత్రమే: ట్రంప్
న్యూజిలాండ్ మద్దతుగా నిలబడతామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హామీ ఇచ్చారు. సాయం చేసేందుకు కట్టుబడి ఉంటామని తెలిపారు. ఉగ్రదాడికి కారణం శ్వేత జాతీయ వాదమేనని వస్తోన్న ఆరోపణలను అమెరికా అధ్యక్షుడు కొట్టిపారేశారు.
"ఇది శ్వేత జాతీయ వాదంతో జరిగిందని నేను అనుకోవట్లేదు. కేవలం కొంతమంది దుశ్చర్య అంతే."
-డొనాల్డ్ ట్రంప్, అమెరికా అధ్యక్షుడు
ప్రపంచ సమస్య: జెసిండా
మసీదులపై జరిగిన ఉగ్రదాడుల బాధితుల్లో ప్రపంచంలోని ముస్లిం దేశాలకు చెందినవారున్నారని న్యూజిలాండ్ ప్రధాన మంత్రి జెసిండా ఆర్డెర్న్ తెలిపారు. ప్రపంచ దేశాలన్నింటిపైనా దాడి ప్రభావం ఉందని చెప్పారు.మృతుల్లో పాకిస్థాన్, టర్కీ, సౌదీ అరేబియా, బంగ్లాదేశ్, ఇండోనేసియా, మలేసియా దేశాల ప్రజలు ఉన్నారని, వారి దౌత్య కార్యాలయాలకు ఎప్పటికప్పుడు సమాచారం అందిస్తున్నామని వెల్లడించారు.
విచారణ చేపడతాం: టర్కీ