New Year 2022: నూతన సంవత్సర వేడుకలను ప్రపంచ దేశాలు ఘనంగా జరుపుకున్నాయి. కళ్లుచెదిరే లైటింగ్, బాణసంచా మధ్య దుబాయ్ కొత్త సంవత్సరానికి స్వాగతం పలికింది. ఇందుకు ప్రపంచంలో ఎత్తైన భవనం బుర్జ్ ఖలీఫా వేదికైంది.
ఆస్ట్రేలియాలోనూ కొత్త సంవత్సర వేడుకలు అట్టహాసంగా జరిగాయి. ప్రపంచ ప్రఖ్యాత సిడ్నీహార్బర్ వద్ద జరిగిన వేడుకలకు భారీగా తరలివచ్చిన ప్రజలు నూతన సంవత్సరానికి ఘనంగా ఆహ్వానం పలికారు. వేడుకల్లో భాగంగా ఏర్పాటుచేసిన సంగీతానికి తోడు బాణసంచా మోతలతో సిడ్నీ నగరం మారుమోగింది.
కరోనా వ్యాప్తి తీవ్రంగా ఉన్న రష్యాలో కూడా నూతన సంవత్సర వేడుకలు అట్టహాసంగా జరిగాయి. మాస్కోలోని రెడ్ స్క్వేర్ జనంతో కిక్కరిసింది. బాణసంచాతో ప్రజలు కొత్త ఏడాదికి స్వాగతం పలికారు.
ఉత్తర కొరియాలో.. కొత్త ఏడాది వేడుకలు ఘనంగా జరిగాయి. కిమ్ జోంగ్ ఉన్ అధికారం చేపట్టి పదేళ్లు పూర్తి కావటం వల్ల పెద్దఎత్తున వేడుకలు నిర్వహించారు. రాజధాని పాంగ్ యాంగ్‌లోని కిమ్-II సంగ్ స్క్వేర్ వద్ద జరిగిన వేడుకల్లో ప్రజలు మాస్క్లు ధరించి పెద్దసంఖ్యలో వేడుకల్లో పాల్గొన్నారు. అ ప్రాంతమంతా రంగురంగుల లేజర్ లైటింగ్, బాణసంచా మోతలతో దద్ధరిల్లింది.