తెలంగాణ

telangana

ETV Bharat / international

తేనెటీగలపై విషం చిమ్ముతున్న కాలుష్య కోరలు - పుష్పాలు

మే 20 - అంతర్జాతీయ తేనెటీగల దినోత్సవం. వాతావరణ మార్పులు, కాలుష్యానికి తోడు సరైన యాజమాన్య పద్ధతులు అనుసరించకపోవడం వల్ల ప్రస్తుతం వాటి మనుగడకే ముప్పు వాటిల్లుతోంది.

తేనెటీగలపై విషం చిమ్ముతున్న కాలుష్య కోరలు

By

Published : May 20, 2019, 8:33 AM IST

తేనెటీగలపై విషం చిమ్ముతున్న కాలుష్య కోరలు

పూల మకరందాన్ని సేకరించి మధురమైన తేనెను మనకు అందించే 'మధుమక్షికలు' రేపు (మే 20) అంతర్జాతీయ తేనెటీగల దినోత్సవాన్ని జరుపుకుంటున్నాయి. అయితే వీటినే జీవనాధారంగా చేసుకుని బతుకుతున్న బోస్నియా తేనెటీగల పెంపకందారులు మాత్రం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

"ప్రత్యక్షంగానో, పరోక్షంగానో మనం తింటున్న ప్రతి మూడు అన్నం ముద్దల్లో ఒకటి కచ్చితంగా తీనెటీగల వల్లే లభ్యమవుతోంది. నేను కేవలం తేనె గురించి మాత్రమే మాట్లాడడంలేదు. వ్యవసాయ పంటల ఫలదీకరణానికి అవే మూలాధారం. జీవవైవిధ్యం పెంపొందించి, ప్రపంచం మనుగడకు అవి ఎంతో సహకరిస్తున్నాయి. మనం అందరం వాటిపైన ఆధారపడి ఉన్నాం."- స్మజ్​లోవిక్​, తేనెటీగల పెంపకందారు, బోస్నియా

కాలుష్యమే ప్రధాన శత్రువు

తేనె ఉత్పత్తి వర్షాకాలం, ఎండాకాలంల్లో తక్కువగా ఉంటుంది. ఇది ప్రకృతి సహజమే. అయితే నానాటికీ పెరిగిపోతున్న గాలి, భూమి కాలుష్యం, వాతావరణ మార్పుల వల్ల ఇప్పుడు తేనెటీగ మనుగడకే ముప్పు ఏర్పడుతోంది.

దీనికి తోడు తేనెటీగల పెంపకంలో సరైన యజమాన్య పద్ధతులు అవలంబించకపోవడమూ ఓ కారణమే. అనుభవం లేని కొందరు పెంపకందారులు అతిగా తేనెను సేకరించడం సమస్యను జఠిలం చేస్తోంది.

ఆహార ఉత్పత్తికీ మూలం..

తేనెటీగలు, సీతాకోక చిలుకలు, కీటకాలు ఆహార ఉత్పత్తి పెరగడంలోనూ కీలకపాత్ర పోషిస్తున్నాయి. ముఖ్యంగా మొక్కల్లో పూల ద్వారా పరాగసంపర్కం జరగడానికి ఇవే మూలకారణం. ఫలితంగా ఆహార గింజలు, విత్తనాలు మనకు లభ్యమవుతున్నాయి.

ఫలదీకరణ కర్తలు

ఐక్యరాజ్యసమితి వ్యవసాయ ఆహార సంస్థ (ఎఫ్​ఏవో) ప్రకారం తేనెటీగలు, కీటకాలు, సీతాకోక చిలుకలే... వ్యవసాయ పంటల ఫలదీకరణానికి ప్రధాన ఆధారాలని తెలిపింది.

ఉదాహరణకు కాఫీ, చాకోలెట్, సూర్యకాంతం పూలు, నువ్వులు. టీ మొక్కలు వీటి ద్వారానే ఫలదీకరణం చెంది మనుగడ సాగిస్తున్నాయని వివరించింది. ప్రపంచవ్యాప్తంగా ఏడాదికి 235 నుంచి 577 బిలియన్​ డాలర్ల విలువైన ఆహార ధాన్యాలు వీటి వల్లనే ఉత్పత్తి అవుతున్నాయని స్పష్టం చేసింది.

మనుగడకే ముప్పు

ఐక్యరాజ్యసమితి పర్యావరణ కార్యక్రమం (యూఎన్​ఈపీ) 2016 నివేదిక ప్రకారం ప్రపంచవ్యాప్తంగా సుమారు 16 శాతం తేనెటీగలు,కీటకాలు అంతరించే దశలో ఉన్నాయని తెలిపింది.

పర్యావరణ మార్పులు, కాలుష్యానికి తోడు తేనెటీగల ఆవాసాలు నాశనం చేస్తుండడం, విస్తృతంగా వ్యవసాయం చేయడం, విపరీతంగా పురుగుల మందులు వాడడం, వ్యాధులు ప్రబలడం, పట్టణీకరణ కారణంగా ఈ జీవుల మనుగడకు తీవ్రమైన ముప్పు వాటిల్లుతోందని వివరించింది.

కాపాడుకోవాల్సిన బాధ్యత మనదే..

తేనెటీగలు జీవవైవిధ్యానికీ మూలం. అవి సులభంగా పరిస్థితులకు తగ్గట్టుగా తమను తాము మలుచుకుంటాయి. అయితే మానవులు చేస్తున్న తప్పిదాల వల్ల ప్రస్తుతం వాటి మనుగడకే ప్రమాదం వాటిల్లుతుండడం విషాధకరం. ఈ పరిస్థితిని మార్చాలంటే ముఖ్యంగా తేనెటీగల రైతులకు సరైన యాజమాన్య పద్ధతులు నేర్పాలి. పురుగుమందుల వాడకం తగ్గించాలి. పర్యావరణ కాలుష్యాన్నీ నియంత్రించాలి.

ఇదీ చూడండి: పసిబిడ్డ హత్యకు తల్లి యత్నం- కాపాడిన శునకం

ABOUT THE AUTHOR

...view details