తెలంగాణ

telangana

ETV Bharat / international

సాహసమే శ్వాసగా... - world

సాహసమే శ్వాసగా సాగిపోదాం అంటున్నారు నేటి తరం మహిళలు. 2017లో ఒంటరి  మహిళా యాత్రికుల సంఖ్య 9శాతం పెరగడమే ఇందుకు నిదర్శనం. మెట్రో నగరాలకు చెందిన మహిళలే వీరిలో అధికం.

మహిళా సాహస యాత్రలు

By

Published : Mar 8, 2019, 6:16 AM IST

Updated : Mar 8, 2019, 11:47 AM IST

"మహిళలు .. వీళ్లు ఎక్కడికీ వెళ్లలేరు.. స్వేచ్ఛగా తిరగలేరు.. ఒకవేళ వెళ్లినా భద్రత లేదు"... ఇవి ఒకప్పటి మాటలు. నేడు భారత మహిళ ప్రపంచంలో ఎక్కడికైనా ఒంటరిగా వెళ్తోంది. ట్రెక్కింగ్, సాహసయాత్రలు లాంటివి చేస్తోంది. ఇలా ప్రపంచ యాత్రలు చేసేవాళ్ల సంఖ్య ఏడాదికి 32 శాతం పెరుగుతోందని ఓ అంతర్జాతీయ సంస్థ సర్వేలో తేలింది.

బుకింగ్స్, ప్రయాణ వివరాల ఆధారంగా 2000 మంది మహిళా యాత్రికులపై సర్వే చేశారు. 2017లో ఒంటరిగా విదేశీ యాత్రలు చేసే మహిళలు 9శాతం పెరిగారని వెల్లడించారు. ప్రయాణికులలో 70 శాతం మిలీనియల్స్​(1980,90లో జన్మించిన వారు) ఉన్నారు. వీరిలో ఎక్కువ మంది మెట్రో నగరాలకు చెందినవారే.

మహిళా అక్షరాస్యత పెరిగి ఆర్థిక స్వాతంత్ర్యం రాకతో... ఎక్కువ మంది పర్యటక యాత్రలపై మొగ్గుచూపుతున్నారు. వీరిలో న్యాయవాదులు, వైద్యులు, కార్పొరేట్ మేనేజర్లు, డిజైనర్లు, రచయితలు లాంటి వివిధ రంగాలలో పనిచేసే మహిళలు ఉన్నారు.

మహిళలు సైక్లింగ్, బైకింగ్, రాఫ్టింగ్, సెయిలింగ్ లాంటి సాహసాలు చేయడానికి ఇష్టపడుతున్నారు. ఒంటరిగా వెళ్లే మహిళల్లో ఎక్కువ మంది డైవింగ్, ట్రెక్కింగ్ లాంటి వాటిపై మొగ్గు చూపుతున్నారు. వారు వెళ్లే ప్రదేశం బట్టి ఏం చేయాలో నిర్ణయించుకుంటున్నారు.

"ఎక్కువగా స్నేహితులు, ఇతర మహిళా గ్రూపులతో కలిసి ట్రెక్కింగ్​కి వెళ్తున్నారు. తల్లీకూతుళ్లు కలిసి ప్రయాణించడం ఈ మధ్య ట్రెండ్​​గా మారింది. ఇలాంటి యాత్రల వల్ల కుటుంబ సభ్యుల మధ్య బంధం బలపడుతుంది. ప్రస్తుతం మహిళలు ప్రపంచంలో ఎక్కడికైనా ఒంటరిగా వెళ్తూ.. ప్రకృతి అందాలను వీక్షిస్తున్నారు. ఎలాంటి ఆటంకాన్నైనా అధిగమించి మహిళా సాధికరతను నిరూపిస్తున్నారు" --కరణ్ ఆనంద్, సర్వే నిర్వాహకుడు

సామజిక మాధ్యమాల ప్రభావం వీరిపై ఎక్కువగా ఉంది. అందువల్ల ఎక్కువ మంది మహిళలు సాహసయాత్రలపై ఆసక్తి చూపిస్తున్నారు. ఇందులో భద్రత ముఖ్య భూమిక పోషిస్తుంది. అందుకే ముందుగానే వీటి గురించి మహిళలు సమగ్రంగా తెలుసుకుంటున్నారని సర్వేలో కనుగొన్నారు.

సాహస కార్యకలాపాల్లో కఠినమైనవి, సులభంగా చేసేవి, ఒక మాదిరి కష్టంతో కూడుకున్నవి ఉన్నాయి. వీటిలో వారి అభిరుచి మేరకు ఎంచుకంటున్నారు. కొంచెం కష్టంగా ఉన్న సాహసాలు చేసే వారి సంఖ్య పెరుగుతోంది. ఇందులో కిలిమంజారో పర్వతారోహణం, మంచు పర్వతాలు ఎక్కడం లాంటి సాహస యాత్రలు ఉన్నాయి.

మన దేశంలో హంపి, పుదుచ్చెరి, లద్దాఖ్, స్పిటి, రిషికేష్, గోకర్ణ, మేఘాలయ, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ లాంటి ప్రదేశాలను చుట్టేస్తున్నారు. నేపాల్, భూటాన్, కెన్యా, టాంజానియా, థాయ్​లాండ్, మాల్దీవులు, ఐస్​లాండ్, ఆస్ట్రేలియా, వియత్నాం, శ్రీలంక, బాలి లాంటి అంతర్జాతీయ పర్యటక ప్రాంతాలవైపు భారతీయ మహిళా యాత్రికులు మొగ్గుచూపుతున్నారు.

Last Updated : Mar 8, 2019, 11:47 AM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details