అఫ్గానిస్థాన్‌ను తాలిబన్లు ఆక్రమించడంతో అమెరికా అప్రమత్తమైంది. ఈ ఉగ్రమూక ఒక్కసారిగా ఆర్థికంగా బలపడకుండా జాగ్రత్తలు తీసుకొంది. దీనికి తోడు అమెరికాలో ఉన్న దాదాపు రూ.70,500 కోట్లు విలువైన అఫ్గాన్ ఆస్తులను తాలిబన్ల అధీనంలోకి వెళ్లకుండా ఫ్రీజ్ చేసింది. దీంతో భవిష్యత్తులో అఫ్గానిస్థాన్‌లోని తాలిబన్లు ఆర్థికంగా కటకటలాడే పరిస్థితి నెలకొంది.
అమెరికా వద్ద ఎంత సంపద ఉంది..!
ద అఫ్గాన్ బ్యాంక్ (డీఏబీ) దాదాపు 10 బిలియన్ డాలర్లు విలువైన సంపదను అమెరికాలో ఫెడరల్ రిజర్వ్ సహా వివిధ బ్యాంకుల్లో భద్రపర్చింది. ఈ సంపద మొత్తం నగదు రూపంలో లేదు. అతి తక్కువ మొత్తం మాత్రం క్యాష్ రూపంలో ఉంది. ఈ విషయాన్ని డీఏబీ గవర్నర్ అజ్మల్ అహ్మదీ వెల్లడించారు. ఆయన ప్రస్తుతం దేశం విడిచి పారిపోయారు.
అత్యధికంగా ఫెడరల్ రిజర్వులో ఏడు బిలియన్ డాలర్లు ఉన్నాయి. అమెరికా బిల్స్ రూపంలో 3.1 బిలియన్లు, డబ్ల్యూబీ ఆర్‌ఏఎంపీ ఆస్తుల రూపంలో 2.4 బిలియన్లు, బంగారం రూపంలో 1.2 బిలియన్ డాలర్లు, కేవలం 0.3 బిలియన్ డాలర్లు మాత్రమే నగదు రూపంలో ఉన్నాయి. ఇక మిగిలిన అంతర్జాతీయ ఖాతాల్లో 1.3 బిలియన్ డాలర్లు ఉన్నాయి. బ్యాంక్ ఫర్ ఇంటర్నేషనల్ సెటిల్మెంట్ వద్ద 0.7 బిలియన్ డాలర్లు పడిఉన్నాయి.
డాలర్ల సరఫరా నిలిపివేసిన అమెరికా..
అఫ్గానిస్థాన్‌లో పరిస్థితి దిగజారుతుండటాన్ని గమనించిన అమెరికా డాలర్ల సరఫరాను కొన్ని వారాల ముందే నిలిపివేసిందని అహ్మదీ వెల్లడించారు. వాస్తవానికి ఇక్కడికి ప్రతివారం అవసరాల కోసం అమెరికా నగదును భౌతిక రూపంలో పంపిస్తుంది. అమెరికాతో పాటు పలు దేశాలు కూడా డాలర్లను అఫ్గానిస్థాన్‌కు ఇవ్వడం ఆపేశాయి. ఈ క్రమంలో అమెరికా ట్రజరీ సెక్రటరీ జానెట్ ఎల్ అలెన్ అఫ్గాన్ రిజర్వులను ఫ్రీజ్ చేశారు. అఫ్గానిస్థాన్లో డాలర్ల చెల్లుబాటు చాలా ఎక్కువ. ప్రస్తుతం అక్కడ డాలర్లు అతి తక్కువ మాత్రమే ఉన్నాయి.
ఎస్డీఆర్ నిధులు ఆపేసిన అంతర్జాతీయ ద్రవ్యనిధి..!
అఫ్గాన్‌లో ప్రస్తుత పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని అంతర్జాతీయ ద్రవ్యనిధి 440 మిలియన్ డాలర్ల మానిటరీ నిధిని అఫ్గాన్‌కు అందించడం నిలిపివేసింది. అమెరికా ట్రజరీ నుంచి ఒత్తిడి రావడంతో ఈ నిర్ణయం తీసుకొంది. ‘‘అంతర్జాతీయ సమాజం గుర్తింపు విషయంలో స్ఫష్టత లేకపోవడంతో కొత్త అఫ్గాన్ ప్రభుత్వం అంతర్జాతీయ ద్రవ్యనిధి వనరులను వాడుకోలేదు’’ అని ఐఎంఎఫ్ ప్రతినిధి ఒక ప్రకటనలో తెలిపారు. తాలిబన్లు ఇంకా అంతర్జాతీయ ఆంక్షల జాబితాలో ఉండటంతో వీరు ఇటువంటి నిధులను అందుకోలేరని డీఏబీ గవర్నర్ అహ్మదీ వెల్లడించారు. అఫ్గానిస్థాన్‌కు ప్రపంచ దేశాల వద్ద ఉన్న ఆస్తుల్లో అత్యధికంగా 0.2శాతం మాత్రమే తాలిబన్ల చేతిలో పడే అవకాశం ఉందని ఆయన వివరించారు.