చైనాలోని హుబే రాష్ట్రంలో నివాసముంటున్న విదేశీయులను తరలించేందుకు తాము సిఫార్సు చేయలేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ) చీఫ్ టెడ్రోస్ ఘెబ్రేయేసుస్ తెలిపారు. చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీతో సమావేశం అనంతరం టెడ్రోస్ ఈ వ్యాఖ్యలు చేశారు.
చైనాలో కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో భారత్, అమెరికా సహా ఇతర దేశాలు తమ పౌరులను హుబే రాష్ట్రం నుంచి తరలించేందుకు సన్నాహాలు చేస్తున్నాయి. దాదాపు 250కిపైగా భారతీయుల్లో ఎక్కువగా విద్యార్థులు హూబీ రాష్ట్రంలోని భారతీయ, అంతర్జాతీయ సంస్థల్లో పని చేస్తున్నారు. ఇప్పటికే వుహాన్లో తమ దేశ పౌరులను తరలించేందుకు విదేశాలకు అనుమతినిచ్చింది చైనా.
చైనా కృషి అభినందనీయం..
వైరస్ సమస్యలపై చైనా అధికారులతో చర్చలు జరిపేందుకు వచ్చిన డబ్ల్యూహెచ్ఓ చీఫ్.. వైరస్ను అరికట్టడంలో చైనా చేస్తున్న కృషిని ప్రశంసించారు. చైనాకు మరింత సహకారాన్ని అందించాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ భావిస్తోందని, అవసరమైన సాయం అందించడానికి సిద్ధంగా ఉన్నట్లు స్పష్టం చేశారు.