కరోనా కొత్త రకం వైరస్‌ను చైనా అధ్యక్షుడు షి జిన్‌పింగ్ పిశాచంతో పోల్చారు. దీన్ని నియంత్రణలోకి తెచ్చే విషయమై చర్చించేందుకు మంగళవారం ఆయన ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) డైరెక్టర్ జనరల్ టేడ్రోస్ అధనామ్‌తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా టేడ్రోస్ మాట్లాడుతూ.. వుహాన్ నగరం నుంచి వివిధ దేశాల పౌరులను తరలించాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచించడం లేదని, ఈ విషయంలో అంతర్జాతీయ సమాజం అతిగా స్పందించకుండా ప్రశాంతంగా ఉండాలని కోరారు.
విజృంభిస్తున్న కరోనా
చైనాలో ఇప్పటివరకు 4,515 మంది ఈ వైరస్ బారిన పడ్డారు. ఒక్క మంగళవారమే 24 మంది మరణించగా.. తాజాగా మరో 25 మంది ప్రాణాలు కోల్పోయారు. ఫలితంగా చైనాలో కరోనా సోకి మరణించిన వారి సంఖ్య 131కి చేరింది. కరోనా కేసులు తమ దగ్గర నమోదైనట్లు టిబెట్ తప్ప చైనాలోని అన్ని ప్రావిన్స్‌లు వెల్లడించాయి.
‘‘ఈ అంటువ్యాధి పిశాచం లాంటిది. మేం దీనిని దాక్కోనివ్వం’’ అని టేడ్రోస్‌తో భేటీ సందర్భంగా జిన్‌పింగ్ వ్యాఖ్యనించారు. మరోవైపు, థాయ్‌లాండ్(7), జపాన్(3), దక్షిణకొరియా(3), అమెరికా(3), వియత్నాం(2), సింగపూర్(4), మలేసియా(3), నేపాల్(1), ఆస్ట్రేలియా(4), శ్రీలంక(1)ల్లో కరోనా కేసులు నమోదయ్యాయి.
20 విమానాశ్రయాల్లో థర్మల్ స్క్రీనింగ్
దిల్లీ, తిరువనంతపురం: విమాన ప్రయాణికులు కరోనా వైరస్ బారిన పడ్డారా? లేదా? అనే విషయాన్ని గుర్తించేందుకు చేపట్టే థర్మల్ స్క్రీనింగ్ సదుపాయాన్ని ప్రస్తుతం ఉన్న ఏడు విమానాశ్రయాల నుంచి 20 విమానాశ్రయాలకు పెంచనున్నట్లు కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్ తెలిపారు.