అఫ్గానిస్థాన్‌లో తొలి మహిళ మేయర్ ఆమె.. పిన్న వయస్సులోనే బాధ్యతలు చేపట్టారు. ఈ క్రమంలో ఎన్నో బెదిరింపులు.. అవమానాలు.. హత్యాయత్నాలు. తన తండ్రినీ చంపేశారు. అయినా వెరవలేదు. విద్యావంతురాలైన ఆమె.. తన ప్రాంతం అభివృద్ధి దిశగా కలలు కన్నారు. ఈ దిశగా పాలనలో సంస్కరణలు తీసుకొచ్చారు. కానీ.. నేడు పరిస్థితులన్నీ తలకిందులయ్యాయి! కారణం తాలిబన్లు. రెండు దశాబ్దాల క్రితం ఆంక్షల సంకెళ్లలో బందీగా కొట్టుమిట్టాడిన తన దేశం.. తాజాగా మరోసారి వారి చేతికి వెళ్లిపోవడం వల్ల ఆమె నిస్సహాయంగా మిగిలారు. మళ్లీ తన బాల్యం నాటి.. ఆటవిక తరహా పాలన ఎక్కడ వస్తుందోనని కలవరానికి గురవుతున్నారు. ఆమే.. 29 ఏళ్ల జరిఫా గఫారీ.
అఫ్గాన్‌లో మహిళల హక్కుల సాధికారతకు చేసిన కృషికిగానూ జరిఫాకు మంచి గుర్తింపు ఉంది. స్థానిక మహిళలకు ఆమె ఒక రోల్‌మోడల్. 2019లో బీబీసీ రూపొందించిన 'ప్రపంచవ్యాప్తంగా వంద మంది స్ఫూర్తిదాయక, ప్రభావవంత మహిళలు' జాబితాలో చోటు దక్కించుకోవడం విశేషం. 2020లో అమెరికా విదేశాంగ కార్యదర్శి ఆమెను ఇంటర్నేషనల్ వుమెన్ ఆఫ్ కరేజ్ (ధైర్యానికి ప్రతీకగా నిలిచిన మహిళ)గా ఎంపిక చేశారు. ప్రస్తుతం ఆమె తన మాతృభూమిలో సంక్షోభ పరిస్థితులను గమనిస్తూ.. తల్లడిల్లుతున్నారు.
ఇదీ చూడండి:అఫ్గాన్ ప్రజల కళ్లముందు మెదులుతున్న క్రూర పాలన
భారత్‌లోనే ఉన్నత విద్య..
అఫ్గాన్‌లోని పక్తియా ప్రావిన్స్‌లో 1992లో జన్మించిన గఫారీ.. స్థానికంగా ప్రాథమిక విద్యనభ్యసించారు. మన దేశం చండీగఢ్‌లోని పంజాబ్ యూనివర్సిటీలో ఉన్నత చదువులు పూర్తిచేశారు. న్యాయవాది అయిన ఆమె.. హక్కుల కార్యకర్త, రాజకీయవేత్త, వ్యాపారవేత్తగానూ రాణించారు. ఆమె ప్రతిభను చూసి 2018 జులైలో వార్దాక్ ప్రావీన్స్‌లోని మైదాన్ శెహర్కు మేయర్‌గా ఎంపిక చేశారు.