కమ్యూనిస్ట్ రాజ్యం అవతరణ రోజే డ్రాగన్‌కు తలవంపులు! జాతీయ దినోత్సవం జరుపుకొన్న డ్రాగన్ దేశం చైనాకు అనుకోని సెగ తగిలింది. డ్రాగన్ విధానాలకు నిరసనగా ఉయ్గర్స్, టిబెట్, హాంకాంగ్ పౌరులు ఆందోళన చేశారు. ప్రపంచ ఉయ్గర్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో బెల్జియం రాజధాని బ్రస్సెల్స్‌లో నిరసన వ్యక్తం చేశారు.
ఐరోపా సమాఖ్య పార్లమెంట్‌కు చెందిన పలువురు సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. డ్రాగన్ దేశం మానవ హక్కులను హరిస్తోందని ఆరోపించారు.
హింసాత్మకంగా హాంకాంగ్..
చైనా జాతీయ దినోత్సవాలను నిరసిస్తూ హాంకాంగ్ వాసులు చేసిన నిరసన ప్రదర్శన హింసాత్మకంగా మారింది. లక్ష మంది పౌరులు వీధుల్లోకి వచ్చి ఆందోళనకు దిగగా, వారిని నియంత్రించేందుకు పోలీసులు బాష్పవాయు గోళాలు, జల ఫిరంగులు ప్రయోగించారు.
సిటీ యూనివర్శిటీ విద్యార్థులు పోలీసులపైకి రాళ్లు రువ్వగా ఒక పోలీసు అధికారి ఆందోళనకారుడిపై కాల్పులు జరిపాడు. తూటా గాయంతో కుప్పకూలిన 17 ఏళ్ల విద్యార్థి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. విద్యార్థిని పోలీసు కాల్చడం క్షణాల్లోనే..సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. తర్వాత మరింత రెచ్చిపోయిన నిరసనకారులు గ్యాసోలీన్ బాంబులతో దాడులు చేశారు. అనేక వాహనాలకు నిప్పంటించారు.
పోలీసుల నిషేధాజ్ఞలు ఉల్లంఘించి చైనా వ్యతిరేక నినాదాలు చేస్తూ ప్రజాస్వామ్య వాదులు భారీ నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. దాదాపు లక్ష మంది చైనా వ్యతిరేక నిరసన ప్రదర్శనల్లో పాల్గొన్నట్లు ఆందోళనకారులు ప్రకటించారు. నిరసనకారులకు, పోలీసులకు మధ్య జరిగిన ఘర్షణల్లో మొత్తం 51 మంది తీవ్రంగా గాయపడ్డారు.
బ్రిటన్ ఖండన
హాంకాంగ్‌లో ప్రజాస్వామ్య అనుకూల నిరసనకారులపై పోలీసుల దాడులను బ్రిటన్ తీవ్రంగా ఖండించింది. ఆందోళనకారులపైకి నిజమైన బుల్లెట్లను వాడడంపై ఆందోళన వ్యక్తం చేసింది. ఇది ఉద్రిక్తతలను మరింత పెంచుతుందని బ్రిటన్ విదేశాంగ కార్యదర్శి డొమినిక్ రాబ్ హెచ్చరించారు.
ఇదీ చూడండి: వెంకయ్యనాయుడుతో ప్రధాని మోదీ సమావేశం