కరోనా కేసులు, మరణాల్లో ప్రపంచంలోనే అగ్రస్థానంలో ఉన్న అమెరికాలో ఒక్కరోజే 3,054 మంది కొవిడ్‌తో మృతి చెందారు. ఇప్పటివరకు రోజువారీ నమోదవుతున్న కొవిడ్ మరణాల్లో ఇవే అత్యధికం. ఈ ఏడాది మే 7న ఇదే స్థాయిలో 2,769 మంది మరణించారు. అగ్రరాజ్యంలో మొత్తం మరణాల సంఖ్య 2 లక్షల 96 వేలు దాటింది. రెండు వ్యాక్సిన్లు దాదాపు అందుబాటులోకి వచ్చేలా కనిపిస్తున్నా.. ఈ స్థాయిలో వైరస్ మరణాలు సంభవించడం వల్ల ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.
అమెరికాలో బుధవారం ఒక్కరోజే 18 లక్షల కరోనా పరీక్షలు నిర్వహించగా... 2 లక్షల 10 వేల కేసులు వెలుగుచూశాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య కోటి 58 లక్షలు దాటింది.
ఈ నేపథ్యంలో ఫైజర్ టీకా అత్యవసర వినియోగంపై అమెరికా ఆహార, ఔషధ పరిపాలనా సంస్ధ (ఎఫ్‌డీఏ) సహా సంబంధిత అధికారులు సమావేశం ఏర్పాటు చేశారు. వచ్చే ఏడాది తొలి త్రైమాసికం చివరినాటికి 10 కోట్ల మందికి వ్యాక్సిన్ అందించాలని భావిస్తున్నారు.