చైనాలోని జిన్‌జియాంగ్ రాష్ట్రంలో ముస్లిం మైనారిటీల పట్ల మానవ హక్కుల ఉల్లంఘనకు పాల్పడ్డారన్న ఆరోపణతో ఆ దేశానికి చెందిన కొందరు రాజకీయ నాయకులపై అమెరికా ఆంక్షలు విధించింది. వీగర్ ముస్లింలు, మరికొన్ని వర్గాలను సామూహికంగా నిర్బంధించి.. వారిపై మతపరమైన హింసకు పాల్పడటం సహా బలవంతంగా సంతాన నిరోధక ఆపరేషన్లు చేయిస్తోందని చైనాపై ఆరోపణలున్నాయి.
రీజనల్ కమ్యూనిస్ట్ పార్టీ అధినేత చెన్ క్యుయాంగో, మరో ముగ్గురు అధికారులను లక్ష్యంగా చేసుకుని ఈ ఆంక్షలు విధించారు. ఐతే జిన్‌జియాంగ్‌లో వీగర్ల పట్ల అలాంటి దుశ్చర్యలకు పాల్పడలేదంటూ చైనా ఆ ఆరోపణలను తోసిపుచ్చింది. ఇటీవల కొన్ని సంవత్సరాలుగా జిన్‌జియాంగ్‌లో విద్యా శిబిరాల పేరుతో సుమారు 10 లక్షల మందిని అధికారులు నిర్బంధించినట్లు ఆరోపణలున్నాయి.