పారిశ్రామిక రంగంలో అద్భుత ప్రగతి సాధించి 'ప్రపంచ ఫ్యాక్టరీ'గా గుర్తింపు తెచ్చుకున్న చైనాలో(China Power Shortage), ఇప్పుడు పరిశ్రమలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అక్కడ పదుల సంఖ్యలో బొగ్గు సంస్థలు ఉత్పత్తి తగ్గించడంతో సరఫరా పడిపోయి విద్యుదుత్పత్తికి ఒక్కసారిగా ఆటంకాలు ఏర్పడ్డాయి. దీంతో పరిశ్రమలకు ఇక్కట్లు మొదలయ్యాయి.
కొవిడ్ తర్వాత ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కోలుకుంటూ చైనా(China Power Crisis) సరకులకు గిరాకీ పెరుగుతున్నా, కరెంటు కొరత వల్ల అక్కడి పరిశ్రమలు ఆ స్థాయిలో ఉత్పత్తి చేయలేకపోతున్నాయి. అర్ధాంతరంగా విద్యుత్తు సరఫరాను నిలిపివేయడంతో తమకు తీవ్ర నష్టం వాటిల్లిందని చైనాలోని అమెరికా పరిశ్రమల యాజమన్యాలు పేర్కొన్నాయి. మరోవైపు గృహావసరాలకు సరిపడా విద్యుత్తును అందించడంలోనూ చైనా విద్యుత్తు సరఫరా సంస్థలు విఫలమవుతున్నాయి. ఫలితంగా పలు ప్రావిన్సుల్లో ప్రజలు చీకట్లో మగ్గుతున్నారు. వీధి దీపాలు, ట్రాఫిక్ సిగ్నళ్లపైనా కరెంటు కొరత ప్రభావం పడినట్లు తెలుస్తోంది. భూతాపాన్ని అడ్డుకోవడానికి కార్బర్ ఉద్గారాల వ్యాప్తిని నివారించడంలో భాగంగా.. బొగ్గు తదితర శిలాజ ఇంధనాల వినియోగాన్ని తగ్గించి, పునరుత్పాదక ఇంధనాల వైపు మొగ్గుచూపడమూ ప్రస్తుత విద్యుత్ కొరతకు ఓ కారణంగా విశ్లేషకులు చెబుతున్నారు.