తెలంగాణ

telangana

ETV Bharat / international

US Drone Attack: మా ప్రాణాలంటే లెక్క లేదా? - కాబుల్‌ విమానాశ్రయం పరిస్థితి

తాలిబన్ల ఆక్రమణతో(Afghan Crisis) సంక్షోభంలో కూరుకుపోయిన అఫ్గాన్​పై అమెరికన్ డ్రోన్‌ దాడి(US Drone Attack) ప్రస్తుతం కలకలం రేపుతోంది. ఈ ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన 10 మంది మరణించారు. దీనిపై ఆధారాలు చూపించాలని ఓ అఫ్గాన్‌ వాసి డిమాండ్‌ చేస్తుండగా.. అగ్రరాజ్యం మాత్రం నాటి దాడిని సమర్థించుకుంటోంది.

Afghan Taliban
Afghan Taliban

By

Published : Sep 4, 2021, 7:17 AM IST

అఫ్గానిస్థాన్‌లో(Afghan Crisis) గత నెల 29న అమెరికా బలగాలు జరిపిన డ్రోన్‌ దాడి(US Drone Attack) చుట్టూ ఇంకా వివాదం చెలరేగుతూనే ఉంది. కాబుల్‌ విమానాశ్రయం(kabul airport news) వద్ద ఆత్మాహుతి పేలుళ్లకు పాల్పడేందుకు వాహనంలో దూసుకొస్తున్న ఉగ్రవాదిని తాము డ్రోన్‌ సహాయంతో మట్టుబెట్టినట్లు నాడు అగ్రరాజ్యం ప్రకటించింది. అయితే అమాయకులైన పలువురు స్థానికులు ఆ దాడిలో ప్రాణాలు కోల్పోయినట్లు వార్తలొచ్చాయి. కాబుల్‌లోని ఖోజా బోఘ్రా ప్రాంతానికి చెందిన రమాల్‌ అహ్మదీ ఈ వ్యవహారంపై తాజాగా స్పందించారు. అమెరికా జరిపిన డ్రోన్‌ దాడి(US drone strike)లో తమ కుటుంబ సభ్యులు 10 మంది దుర్మరణం పాలయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. ‘‘మేం నలుగురం అన్నదమ్ములం. అందరం కలిసి ఒకే ఇంట్లో ఉండేవాళ్లం. మా కుటుంబ సభ్యుల మొత్తం సంఖ్య 25. గత నెల 29న అమెరికా బలగాలు చేపట్టిన డ్రోన్‌ దాడి మాకు తీరని వేదన మిగిల్చింది. మా ఇంటి పెరడు ప్రాంతంలో నిలిపి ఉంచిన కారుపై ఆ దాడి చోటుచేసుకుంది. దీంతో మా కుటుంబ సభ్యులు 10 మంది కన్నుమూశారు. మృతుల్లో ఆరుగురు చిన్నారులున్నారు’’ అని అహ్మదీ పేర్కొన్నారు.

కారులో పేలుడు పదార్థాలున్నాయంటూ అమెరికా వినిపించిన వాదన పూర్తిగా అవాస్తవమని అహ్మదీ అన్నారు. అందుకు ఆధారాలేమైనా ఉంటే చూపించాలని డిమాండ్‌ చేశారు.

"పేలుడు చోటుచేసుకున్నప్పుడు మా పెరడులో రెండు గ్యాస్‌ సిలిండర్లు ఉన్నాయి. అమెరికా చెప్తున్నట్లు కారులో పేలుడు పదార్థాలు ఉండి ఉంటే.. సిలిండర్లు ఎందుకు పేలిపోలేదు? పక్కనే ఉన్న నాసిరకం గోడ ఎందుకు కూలిపోలేదు? ఈ ప్రశ్నలకు అమెరికా సమాధానమివ్వాలి. మా ప్రాణాలు అంత లెక్కలేనివా? అగ్రరాజ్య సైనికుల వద్ద అత్యాధునిక సాంకేతికతలున్నాయి. భూమిపై పాకే చీమను సైతం వారు గుర్తించగలరు. అలాంటివారు.. చిన్నారులతో నిండి ఉన్న పెరడును చూడలేకపోయారా?"

-అహ్మదీ రమాల్

అహ్మదీ మూడేళ్ల కుమార్తె మలైకా కూడా దాడిలో మృత్యువాతపడటం గమనార్హం. మరోవైపు నాటి డ్రోన్‌ దాడిని అమెరికా సమర్థించుకుంది. కారులో పేలుడు పదార్థాలు నింపుతుండటాన్ని బలగాలు స్పష్టంగా చూశాయని, అందుకే డ్రోన్‌ దాడి చేపట్టాయని ఆ దేశ అధికారులు చెప్పారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details