ప్రధాని నరేంద్రమోదీని ప్రతిష్టాత్మక 'జాయెద్ మెడల్'తో సత్కరించనున్నట్లు యూఏఈ ప్రభుత్వం ప్రకటించింది. ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు మరింత బలపడేలా చొరవ చూపినందుకే మోదీకి జాయెద్ అవార్డును ప్రదానం చేస్తున్నామని యూఏఈ అధ్యక్షుడు 'షేఖ్ ఖలీఫా బిన్ జాయెద్ అల్ నహ్యాన్' తెలిపారు. రాజులు, దేశాధ్యక్షులకు అందించే యూఏఈ అత్యున్నత అవార్డును ప్రధానికి కూడా అందించటం విశేషం.
మోదీకి యూఏఈ 'జాయెద్ మెడల్' ప్రకటనపై అబుదాబి యువరాజు ట్విట్టర్లో స్పందించారు.
" భారతదేశంతో యూఏఈ చరిత్రాత్మక ద్వైపాక్షిక ఒప్పందాలు కుదుర్చుకుంది. ఇరుదేశాల మధ్య వ్యూహాత్మక ఒప్పందాల్లో నా మిత్రుడు, ప్రధాని నరేంద్రమోదీ కీలకపాత్ర పోషించారు. మోదీ చొరవకు గౌరవ సూచకంగా యూఏఈ అధ్యక్షుడు 'జాయెద్ మెడల్'ను ప్రకటించారు"
-మహమ్మద్ బిన్ జాయెద్, అబుదాబి యువరాజు
ప్రధాని స్పందన
"యూఏఈ అధ్యక్షుడు 'షేక్ ఖలీఫా బిన్ జాయెద్ అల్ నహ్యాన్' కు కృతజ్ఞతలు, ఈ గౌరవ పురస్కారాన్నిఎంతో వినయంతో స్వీకరిస్తున్నా. మీ అత్యద్భుతమైన నాయకత్వంలో ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు ఉన్నత స్థాయికి చేరాయి. మన సఖ్యత ఇరు దేశాల ప్రజలకు, ప్రపంచానికి శాంతిని, శ్రేయస్సును అందిస్తుంది"
- నరేంద్ర మోదీ, భారత ప్రధాని