బంగ్లాదేశ్ రాజధాని ఢాకా శివార్లలోని ఓ కర్మాగారంలో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. ఈ దుర్ఘటనలో 52 మంది కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. మరో 50 మందికి గాయాలైనట్లు స్థానిక మీడియా తెలిపింది. చాలా మంది ప్రాణాలు కాపాడుకోవడానికి భవంతి పైనుంచి కిందికి దూకినట్లు పేర్కొంది.
ఫ్యాక్టరీలో ఘోర ప్రమాదం- 52 మంది మృతి - హషీమ్ ఫుడ్స్‌లో అగ్ని ప్రమాదం
13:56 July 09
బంగ్లాదేశ్‌లో అగ్ని ప్రమాదం
రూప్‌గంజ్‌లోని హషీమ్ ఫుడ్స్ అనే జ్యూస్ కర్మాగారంలో గురువారం రాత్రి ఈ ప్రమాదం జరిగింది. ఆరు అంతస్తుల భవనంలో మంటలు చెలరేగాయి. దీంతో క్షణాల్లోనే భారీ నష్టం జరిగింది. భవనం కింది భాగంలో తొలుత మంటలు చెలరేగాయిని ప్రాథమిక దర్యాప్తులో తెలింది. అయితే ఫ్యాక్టరీలో రసాయనాలు, ప్లాస్టిక్ సీసాలు ఎక్కువగా ఉండడం కారణంగా చాలా వేగంగా మంటలు వ్యాప్తి చెందినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు.
సమాచారం అందుకున్న అధికారులు.. యుద్ధప్రాతిపదికన సహాయ చర్యలు చేపట్టారు. సుమారు 18 ఫైర్ ఇంజన్లు మంటలు ఆర్పడంలో పాల్గొన్నట్లు అధికారులు తెలిపారు. తగలబడుతున్న కర్మాగారం నుంచి 52 మృతదేహాలు వెలికితీశారు. ఇప్పటికీ కొంతమంది ఆచూకీ తెలియకపోవడం వల్ల బంధువులు కర్మాగారం ఎదుట వేచిచుస్తున్నారు. ఇప్పటివరకు కేవలం 44 మందిని గుర్తించినట్లు ఓ పత్రిక తెలిపింది.
ప్రమాదం జరిగేటప్పుడు ఫ్యాక్టరీ ముందు, వెనుక గేట్లు మాత్రమే తెరిచి ఉంచడం వల్ల ఎక్కువమంది మంటల్లో చిక్కుకుపోయినట్లు బాధితులు ఆరోపిస్తున్నారు. అంతేగాకుండా ఆ భవనం సరైన భద్రతా ప్రమాణాలు పాటించలేదని అంటున్నారు. ఇందుకు సంబంధించి పూర్తిస్థాయి సమాచారం కోసం జిల్లా యంత్రాంగం ఐదుగురు సభ్యులతో కూడిన కమిటీని వేసింది.
ఇదీ చూడండి:'లామ్డా' వైరస్ దెబ్బ- ఆ దేశాలు గజగజ!