చైనాలో కరోనా వైరస్ ప్రబలగానే అక్కడి ప్రభుత్వం వెంటనే తగిన చర్యలు తీసుకొని కరోనా వ్యాప్తిని కట్టడి చేసిన విషయం తెలిసిందే. కరోనా కేసులు నమోదు అవుతున్న ప్రాంతాల్లో లాక్‌డౌన్ అమలు చేసి, ప్రజలను బలవంతంగానైనా క్వారంటైన్ చేసి నిత్యవసర సరుకులు కూడా ప్రభుత్వ సిబ్బందే తెచ్చిపెట్టేలా ఏర్పాట్లు చేసింది. ఈ విధంగానే తాజాగా దక్షిణ చైనాలో 10వేల పందులను 13 అంతస్తుల హాగ్ హోటల్‌లో (hog hotel) క్వారంటైన్‌లో ఉంచి.. కట్టుదిట్టమైన భద్రత కల్పిస్తోంది. పోషకాహారం పెట్టి పెంచుతోంది. సీసీ కెమెరాలు పెట్టి.. పశువైద్యులను అందబాటులో ఉంచింది. ఇదంతా చేసింది పందులను ఆఫ్రికన్ స్వైన్‌ఫ్లూ బారి నుంచి కాపాడుకోవడం కోసమే.
కరోనా వైరస్ కంటే ముందు 2018లో చైనాలో పందులకు ఆఫ్రికన్ స్వైన్‌ఫ్లూ సోకింది. ఎబోలా వైరస్ మనుషుల ప్రాణాలు ఏ విధంగా తీస్తుందో.. ఆఫ్రికన్ స్వైన్‌ఫ్లూ కూడా పందుల్ని అలాగే చంపేస్తుంది. ఈ నేపథ్యంలో ఈ వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండేందుకు చైనా ప్రభుత్వం అనేక ప్రయత్నాలు చేసింది. ఇందులో భాగంగా ఏడాదిలో దేశ వ్యాప్తంగా 40కోట్ల పందులను వధించారు. వైరస్ జాడ కనుమరుగైనా.. అప్పుడప్పుడు ఈ వైరస్ ఉనికిపై అనుమానాలు వ్యక్తం అయ్యేవి. ఈ ఏడాదిలోనూ స్వైన్‌ఫ్లూ సోకిందన్న అనుమానంతో 2వేలకు పైగా పందుల్ని చంపేశారు.