కాబుల్ విమానాశ్రయం(kabul airport news)లో తాలిబన్ల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. కాబుల్ ఆక్రమణ అనంతరం ఎయిర్పోర్ట్లో నెలకొన్న పరిస్థితులను అదుపు చేసేందుకు.. అక్కడే ఉన్న అమెరికా, బ్రిటన్ సైనికులకు వీరు సహాయం అందిస్తున్నారు. ఓవైపు శరణార్థులకు సంబంధించిన పత్రాలను సైనికులు సరిచూస్తుంటే.. మరోవైపు ఎయిర్పోర్టు బయట ఏర్పాటు చేసిన స్క్రీనింగ్ పరీక్షలను తాలిబన్ ఫైటర్లు నిశితంగా పరిశీలిస్తున్నారు.
అయితే తాలిబన్ల(taliban news) చూపులు అక్కడి ప్రజలను వణికిస్తున్నాయి. ఎప్పుడు ఎవరిని అనుమతిస్తారో, ఏ సమయంలో ఎవరిని అడ్డుకుంటారోనని భయపడిపోతున్నారు. ఒక్కోసారి.. తాలిబన్ ఫైటర్లు తుపాకులతో కొడుతుండటం, చేతికందిన దానిని విసురుతుండటం చూసి ఆందోళన చెందుతున్నారు. ముఖ్యంగా కొన్నేళ్లుగా అధ్యక్షుడు ఘనీ ప్రభుత్వానికి మద్దతిచ్చిన వారు.. తాలిబన్లను చూసి గడగడలాడుతున్నారు.