మహిళల హక్కులకు తాము గౌరవమిస్తామని తాలిబన్లు పునరుద్ఘాటించారు. అయితే అవి ఇస్లామిక్ చట్టాలకు కట్టుబడి ఉండాలని తేల్చిచెప్పారు. అఫ్గాన్‌ను తమ వశం చేసుకున్న అనంతరం తొలిసారి మీడియా ముందుకు వచ్చిన తాలిబన్ల ప్రతినిధి జబిహుల్లా ముజాహిద్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలో దేశ ప్రజలు, ఇతర దేశాధినేతల్లో విశ్వాసం నింపే ప్రయత్నం చేశారు.
ప్రైవేటు మీడియాపైనా ఆంక్షలు ఉండవని.. అవి స్వతంత్రంగానే పనిచేయాలని తాము కోరుకుంటున్నట్టు స్పష్టం చేశారు ముజాహిద్. అయితే ఆయా సంస్థలు దేశ ప్రయోజనాలు, విలువలకు కట్టుబడి విధులు నిర్వర్తించాలని నొక్కిచెప్పారు.
ఇతర దేశాలపై తాము దాడులకు పాల్పడమని ముజాహిద్ వెల్లడించారు. తాము ఎవరిపైనా ప్రతీకారం తీర్చుకోవాలని అనుకోవడం లేదన్నారు.
"1990 నాటి తాలిబన్లకు ఇప్పుడున్న తాలిబన్లకు సిద్ధాంతాలు, విశ్వాసం పరంగా ఎలాంటి మార్పులు లేవు. అప్పుడూ మేము ముస్లింలమే, ఇప్పుడూ ముస్లింలమే. కానీ మాకు అనుభవం పెరిగింది. మా దృష్టికోణం మారింది. పొరుగు దేశాలకు ఒక విషయం స్పష్టం చేస్తున్నాము.. మమ్మల్ని పావుగా ఉపయోగించుకునేందుకు ఏ దేశం ప్రయత్నించినా మేము ఊరుకోము. మా తరఫున ఏ దేశానికి హాని కలిగించం. ఈ విషయంపై అంతర్జాతీయ సమాజానికి హామీనిస్తున్నాము."