తెలంగాణ

telangana

ETV Bharat / international

Afghan crisis: పంజ్​షీర్​పై తాలిబన్ల కన్ను- కోట కూలేనా? - తాలిబన్​

అఫ్గాన్​ మొత్తాన్ని తాలిబన్లు తమ వశం చేసుకున్నా.. పంజ్​షీర్​ ప్రాంతం మాత్రం చెక్కుచెదరకుండా నిలిచింది. ఇప్పటికి ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలించలేదు. కానీ ఈసారి తాలిబన్లు ధైర్యం చేశారు. అక్కడి ప్రజలకు అల్టిమేటం జారీచేశారు. తక్షణమే లొంగిపోవాలని లేకపోతే విధ్వంసం తప్పదని హెచ్చరించారు.

panjshir-fortress
అఫ్గాన్​

By

Published : Aug 22, 2021, 7:52 PM IST

అఫ్గాన్​ సంక్షోభంలోనూ చెక్కుచెదరకుండా ఉన్న పంజ్​షీర్​ ప్రాంతంపై తాలిబన్లు కన్నేశారు. రాజధాని కాబుల్​ను తమ వశం చేసుకున్న వారం రోజులకు.. పంజ్​షీర్​వైపు కదిలేందుకు సాహసం చేశారు. లొంగిపోవాలని ఆ ప్రాంత ప్రజలుకు ఇప్పటికే డెడ్​​లైన్​ విధించారు. తాలిబన్లు కొందరు ఇప్పటికే శక్తిమంతమైన ఆయుధాలతో పంజ్​షీర్​ వైపు కదులుతున్నట్లు సమాచారం.

కోట కూలుతుందా?

పంజ్​షీర్​ అంటే.. తాలిబన్లకు ఎప్పటి నుంచే వణుకే. 1990లో ఆ ప్రాంతాన్ని ఆక్రమించుకునేందుకు విశ్వప్రయత్నాలు చేశారు. కానీ అవేవీ ఫలించలేదు. అందుకు కారణం.. అహ్మద్‌ షా మసూద్‌‌. తాలిబన్లపై గెరిల్లా పోరాటంలో కీలకంగా వ్యవహరించారు మసూద్​.

మసూద్​

అయితే.. తాలిబన్లు ఇప్పుడు రెట్టింపు ఉత్సాహంతో ఉన్నారు. అమెరికా దళాలు పూర్తిగా వెనుదిరగకుండానే కాబుల్​ను మెరుపువేగంతో ఆక్రమించుకున్నారు. దీనితో ఆత్వవిశ్వాసం పెరిగింది. ఈ నేపథ్యంలో.. పంజ్​షీర్​ను దక్కించుకునేందుకు దూసుకెళుతున్నారు. ఇప్పటికే అల్టిమేటం​ జారీ చేశారు. తక్షణమే లొంగిపోవాలని.. లేకపోతే ఆ ప్రాంతంలో విధ్వంసం సృష్టిస్తామని హెచ్చరించారు. ఈ విషయాన్ని అఫ్గాన్​ రాజకీయ, సామాజిక కార్యకర్త నాసిర్​ అహ్మద్​ షేర్జాయ్​ వెల్లడించారు.

అయితే ఈసారి కూడా తాలిబన్ల ప్రయత్నం ఫలించదని షేర్జాయ్​ ధీమా వ్యక్తం చేశారు. ఎన్నో ప్రతికూల పరిస్థితులు వారికి స్వాగతం పలుకుతాయని తెలిపారు.

ఏంటీ పంజ్​షీర్​...?

హిందూకుష్‌ పర్వత శ్రేణులకు సమీపంలో కాబుల్‌కు ఉత్తరాన 150 కి.మీల దూరంలో పంజ్‌షిర్‌ ప్రావిన్స్‌ ఉంది. దాదాపు లక్షకు పైగా జనాభా కలిగిన ఈ ప్రాంతంలో తజిక్‌ జాతికి చెందిన ప్రజలే అత్యధికం. పంజ్‌షిర్‌ అంటే సంస్కృతంలో ఐదు సింహాలు అని అర్థం.

కొన్ని శతాబ్దాల కాలంగా పంజ్‌షిర్‌ ఓ ప్రతిఘటన ప్రాంతంగా ఉండటం వల్ల అటు విదేశీ బలగాలు గానీ, ఇటు తాలిబన్లు గానీ కాలుపెట్టలేకపోతున్నాయి. పంజ్‌షిర్‌ పేరుకు తగ్గట్టే అక్కడి ప్రజల్లో తెగింపు చాలా ఎక్కువ. అనేక తిరుగుబాట్లకు ఈ ప్రాంతమే వేదికగా నిలిచింది. గతంలో తాలిబన్ల పాలనను తుదముట్టించడంలోనూ ఈ ప్రాంతానిదే కీలక పాత్ర. అక్కడి ప్రజల్లో ఉన్న ఉద్యమ స్ఫూర్తిని మరింతగా రగిలించి వారిని మార్గదర్శకత్వం చేసిన వారిలో తాలిబన్‌ వ్యతిరేక నాయకుడు అహ్మద్‌ షా మసూద్‌. ఆయన తాలిబన్ల అంతానికి అహర్నిశలు కృషిచేశారు.

తాలిబన్​ ఫైటర్స్​

అయితే తాలిబన్లు, ఆల్‌ఖైదాలు కలిసి నకిలీ విలేకరుల వేషాల్లో మీడియా ఇంటర్వ్యూ చేస్తూ 2001 సెప్టెంబర్‌ 9న జరిపిన ఆత్మాహుతి దాడిలో మసూద్​ ప్రాణాలు కోల్పోయారు. ఆ తర్వాత రెండు రోజులకే అమెరికాపై ఆల్‌ఖైదా దాడులు చేయడం యావత్‌ ప్రపంచాన్నిఆందోళనకు గురిచేసింది. ఇదే చివరకు నాటో దళాలు అఫ్గాన్‌పై దాడి చేయడం, మసూద్‌ దళాలతో ఆ బలగాల స్నేహానికి దారితీసింది. ఆ తర్వాత ఉత్తర కూటమి తాలిబన్ల రాక్షస పాలనకు వ్యతిరేకంగా రెండు నెలల పాటు సుదీర్ఘ పోరాటం జరిపింది. డిసెంబర్‌ 2001 డిసెంబర్‌ నాటికి తాలిబన్ల పాలనను అంతం చేసి విజయం సాధించింది.

ఇదీ చూడండి:-Afghan crisis: ఆకలి మరచి.. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని..

ABOUT THE AUTHOR

...view details