తెలంగాణ

telangana

ETV Bharat / international

'కళ్ల ముందే ఉన్నా.. అమెరికా నన్ను పట్టుకోలేకపోయింది!'

తాలిబన్ల ప్రతినిధి జబిహుల్లా ముజాహిద్​.. ఇటీవలే ఓ ఆంగ్ల పత్రికకు ఇంటర్వ్యూ ఇచ్చారు. అందులో.. తనను పట్టుకునేందుకు అమెరికా సైన్యం ఎన్నో ఏళ్లు ప్రయత్నించిందని వెల్లడించారు. కానీ తనను పట్టుకోలేకపోయిందన్నారు. వాస్తవానికి తాను కాబుల్​లోనే, ప్రత్యర్థి కళ్ల ముందే తిరిగినట్టు చెప్పారు ముజాహిద్​. జబిహుల్లా అంటే.. మనిషి కాదని, తాలిబన్లు సృష్టించిన ఓ కల్పిత పాత్రని సైనికులు అనుకునే స్థితికి పరిస్థితి వెళ్లిందన్నారు.

Zabiullah Mujahid
జబిహుల్లా ముజాహిద్

By

Published : Sep 13, 2021, 7:11 AM IST

"జబిహుల్లా ముజాహిద్.." తాలిబన్ల ప్రతినిధిగా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన పేరు ఇది. వాస్తవానికి దశాబ్ద కాలం పాటు ఆయన్ని పట్టుకునేందుకు అమెరికా సైన్యం చేయని ప్రయత్నం అంటూ లేదు! కానీ సైనికుల దాడుల నుంచి ఎంతో చాకచక్యంగా తప్పించుకునే వారు ముజాహిద్​. ఆయన కాబుల్​ నడిబొడ్డులోనే ఉన్నా సైనికులు పట్టుకోలేకపోయారు. ఓ ఆంగ్ల వార్తాపత్రికకు ముజాహిద్​ ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాలు బయటపడ్డాయి.

'ముజాహిద్​.. అసలు మనిషేనా?'

ఆగస్టులో తాలిబన్లు కాబుల్​ను​ ఆక్రమించుకున్న అనంతరం మీడియా ముందుకు వచ్చి ప్రత్యక్షంగా మాట్లాడుతున్న ముజాహిద్​.. గతంలో ఎన్నో ఏళ్ల పాటు చీకట్లోనే పని చేశారు. బయటి ప్రపంచానికి కనపడకుండా.. కేవలం తన గొంతుతోనే తాలిబన్ల సందేశాన్ని ప్రపంచానికి తెలియజేశారు. ఆయన అలా బయటకు రాకపోవడానికి ముఖ్య కారణం అమెరికా సైన్యం.

అఫ్గాన్​ యుద్ధం సమయంలో అగ్రరాజ్య సైనికులు ముజాహిద్​ను పట్టుకునేందుకు ఏళ్ల పాటు ప్రయత్నించారు. ముజాహిద్​ మాత్రం వారి నుంచి ప్రతిసారి తప్పించుకునే వారు. వాస్తవానికి కాబుల్​ నడిబొడ్డులోనే, ప్రత్యర్థుల కళ్ల ముందే ఇన్నేళ్లు తాను జీవనం సాగించినట్టు వెల్లడించారు ఈ తాలిబన్ల ప్రతినిధి.

"యుద్ధం సమయంలో కాబుల్​లోనే ఉన్నాను. అమెరికా- అఫ్గాన్​ సైనికులు నా కోసం చాలా వెతికారు. వాళ్ల దాడుల నుంచి నేను చాలాసార్లు తప్పించుకున్నాను. స్వేచ్ఛగా అఫ్గాన్​ మొత్తం తిరిగాను. తాలిబన్ల కోసం పనిచేశాను. తాలిబన్ల కార్యకలాపాలు నాకు తెలుసు.అఫ్గాన్​ దళాల గురించి కూడా ఎప్పటికప్పుడు సమాచారం అందేది. ఇవన్నీ నేను ఎలా చేస్తున్నానో ప్రత్యర్థులకు అస్సలు అర్థమయ్యేదే కాదు. ఇక నన్ను పట్టుకోలేకపోయారు. చివరికి అసలు 'జబిహుల్లా' అనే మనిషే లేడని.. తాలిబన్లే ఓ కల్పిత పాత్రను రూపొందించారని వాళ్లు అనుకున్నారు. కానీ నేను ఎప్పుడూ వాళ్ల కళ్ల ముందే తిరిగాను."

-- జబిహుల్లా ముజాహిద్​, తాలిబన్ ప్రతినిధి

తన గురించి తెలుసుకునేందుకు అమెరికా అధికారులు స్థానికులకు డబ్బులు కూడా ఇచ్చేవారని పేర్కొన్నారు ముజాహిద్​. వాటి ఆధారంగానే అనేకమార్లు వారు దాడులు చేశారని, కానీ తాను తప్పించుకున్నానని చెప్పారు. ఎన్ని దాడులు జరిపినా.. అసలు అఫ్గాన్​ను విడిచే ఆలోచనే తనకు ఎప్పుడూ రాలేదన్నారు.

1978 సెప్టెంబర్​లో పక్తియా రాష్ట్రంలో జన్మించారు ముజాహిద్​. వాయువ్య పాకిస్థాన్​లోని హక్కానియా సెమినరీలో చదువుకున్నారు. దీనికి అంతర్జాతీయంగా 'యూనివర్సిటీ ఆఫ్​ జిహాద్​', 'తాలిబన్​ యూనివర్సిటీ' అని పేరుంది.

యూఎన్​ బ్లాక్​ లిస్ట్​లో ఉన్న తాలిబన్లలో దాదాపు అందరు ఇదే హక్కానియా సెమినరీలో చదువుకున్నారు. ఈ సెమినరీకి పాక్​ ప్రభుత్వం నుంచి ఎప్పటికప్పుడు నిధులు అందుతాయి.

ఇదీ చదవండి:చనిపోయాడనుకున్న అల్​ఖైదా చీఫ్​ ప్రత్యక్షం.. ఎలా?

ABOUT THE AUTHOR

...view details