తాలిబన్లకు(Afghanistan Taliban) వ్యతిరేకంగా అఫ్గాన్‌లో ఆదివారం తొలి సాయుధ తిరుగుబాటు చోటుచేసుకుంది. కాబుల్‌కు ఉత్తరాన దాదాపు 120 కిలోమీటర్ల దూరంలోని బగ్లాన్ ప్రావిన్సులో స్థానిక సాయుధ ప్రజలు ఎదురుతిరిగారు. అక్కడి అంద్రాబ్ లోయలోని బానో, దేహ్ సలాహ్, పుల్ ఎ-హెసార్ జిల్లాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ పరిణామంతో తాలిబన్లు ఉలిక్కిపడ్డా.. వెంటనే తేరుకున్నారు. అంద్రాబ్‌కు అదనంగా ఫైటర్లను(Taliban Fighters) పంపించారు. కోల్పోయిన మూడు జిల్లాలను తిరిగి తమ వశం చేసుకున్నారు. అయితే తిరుగుబాటుదారులు సోమవారం జరిపిన మెరుపుదాడుల్లో 50 మందికి పైగా ఫైటర్లు హతమవడం తాలిబన్లకు గట్టి ఎదురుదెబ్బ. మృతుల్లో బను జిల్లా తాలిబన్ చీఫ్ కూడా ఉన్నట్లు తెలుస్తోంది.
పంజ్‌షేర్‌ను చుట్టుముట్టి..
అఫ్గాన్‌లో ఇప్పటికీ తమ అధీనంలోకి రాని పంజ్‌షేర్‌ను(Panjshir valley) ఆక్రమించుకునే ప్రయత్నాలను తాలిబన్లు ముమ్మరం చేశారు. వందల మంది ఫైటర్లు ఆ ప్రావిన్సును చుట్టుముట్టారు. ప్రస్తుతం అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. నేరుగా ఆక్రమణకు పాల్పడకుండా తాలిబన్లు పంజ్‌షేర్‌లోని అఫ్గాన్ ఉపాధ్యక్షుడు అమ్రుల్లా సలేహ్ (దేశాధ్యక్షుడిగా తనను తాను ప్రకటించుకున్నారు), దివంగత దిగ్గజ మిలటరీ కమాండర్ అహ్మద్ షా మసూద్ తనయుడు అహ్మద్ మసూద్ తదితరులతో చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. మరోవైపు- 300 మంది తాలిబన్లను ఇప్పటికే హతమార్చినట్లు పంజ్‌షేర్ సైన్యం ప్రకటించిందని అంతర్జాతీయ మీడియాలో వార్తలు వస్తుండటం గమనార్హం.
విమానాశ్రయం వద్ద ఉద్రిక్తతలే..
దేశం వీడి వెళ్లడమే లక్ష్యంగా అఫ్గాన్ పౌరులు భారీగా తరలివస్తుండటంతో కాబుల్ విమానాశ్రయం(Kabul International Airport) వద్ద ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. విమానాశ్రయంలోకి ప్రవేశించే ఓ ద్వారానికి సమీపంలో.. గుర్తుతెలియని దుండగులు సోమవారం కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటనలో అఫ్గాన్ సైనికుడొకరు ప్రాణాలు కోల్పోయారు. మరో ముగ్గురు గాయపడ్డారు. జర్మనీ సైన్యం ఈ వివరాలను వెల్లడించింది. కాల్పుల్లో ఆరుగురు గాయపడ్డారని కూడా వార్తలొస్తున్నాయి. జర్మనీ రక్షణ మంత్రి అనెగ్రెట్ క్రాంప్-కారెన్‌బ్యూర్ ఓ వార్తాసంస్థతో మాట్లాడుతూ.. కాబుల్ నుంచి విదేశీయుల తరలింపును తాలిబన్లు అడ్డుకోవడం లేదన్నారు. మరోవైపు- కాబుల్ విమానాశ్రయం వద్ద గుమిగూడుతున్న జనాన్ని లక్ష్యంగా చేసుకొని ఇస్లామిక్ స్టేట్ (ఐఎస్) ఉగ్ర సంస్థ ఆత్మాహుతి దాడులకు తెగబడే ముప్పుందని ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. అమెరికా విమానాలపై ఆ సంస్థ క్షిపణి దాడులకు తెగబడే అవకాశాలనూ కొట్టిపారేయలేమని విశ్లేషకులు చెబుతున్నారు.
భారత్‌కు మరో 146 మంది
అఫ్గాన్ నుంచి భారత పౌరుల తరలింపు కొనసాగుతోంది. నాటో, అమెరికా విమానాల ద్వారా తొలుత కతార్‌కు చేరుకున్న 146 మంది భారతీయులను అక్కడి నుంచి నాలుగు విమానాల్లో భారత విదేశీ వ్యవహారాల శాఖ సోమవారం స్వదేశానికి తీసుకొచ్చింది. విమానాశ్రయంలో దిగిన తర్వాత అందరికీ పరీక్షలు నిర్వహించామని, అందులో ఇద్దరికి కరోనా ఉన్నట్లు తేలిందని దిల్లీ ప్రభుత్వ నోడల్ అధికారి రాజేందర్ కుమార్ తెలిపారు. రెండో విడతలో స్వదేశానికి చేరుకున్నవారిలో ఎక్కువ మంది అఫ్గాన్‌లో విదేశీ కంపెనీల్లో పనిచేస్తున్నవారే. మరో 46 మంది అఫ్గాన్ సిక్కులు, హిందువులు సహా 75 మందిని అఫ్గాన్ నుంచి భారత వాయుసేన విమానంలో తీసుకువచ్చారు. సిక్కుల పవిత్ర గ్రంథమైన 'గురు గ్రంథ్ సాహిబ్' ప్రతులు మూడింటిని కూడా కాబుల్ నుంచి తీసుకువస్తున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.