అంతకంతకూ విజృంభిస్తున్న తాలిబన్లు... కనీసం ప్రతిఘటించని సైన్యం... తూటా పేలకుండానే తాలిబన్ల చేతుల్లోకి కీలక నగరాలు... భయంతో ఇతర దేశాలకు పారిపోతున్న వేలాది మంది ప్రజలు... 'ఆపరేషన్ అఫ్గానిస్థాన్'లో అమెరికా దిద్దుబాటు చర్యలు... హడావుడిగా కాబుల్‌కు అదనపు బలగాలు... అఫ్గానిస్థాన్‌లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు ఇవి.
అఫ్గాన్‌లోని తాజా పరిణామాలు ఇలా..
- అఫ్గాన్‌లోని కీలక నగరం జలాలాబాద్‌ను ఆదివారం తెల్లవారు జామున ఆక్రమించారు తాలిబన్లు. దీంతో తూర్పు ప్రాంతానికి, దేశ రాజధాని కాబుల్‌కు మధ్య సంబంధాలు తెగిపోయాయి. జలాలాబాద్ నగరంలోని గవర్నర్ కార్యాలయాన్ని స్వాధీనం చేసుకున్న వీడియోలను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశారు తాలిబన్లు. వారితో ఎలాంటి ఘర్షణకు దిగకుండానే.. భద్రతా దళాలు లొంగిపోయినట్లు ఓ అధికారి తెలిపారు.
- ఖోస్ట్ ప్రావిన్స్ రాజధానిని స్వాధీనం చేసుకున్నట్లు ఆదివారం మధ్యాహ్నం ప్రకటించారు. ఈ విషయాన్ని అఫ్గాన్ అధికారులు ధ్రువీకరించారు. అలాగే.. మెయిడన్ వార్డక్ రాష్ట్ర రాజధాని మెయిడన్ వార్డక్ను తమ అధీనంలోకి తీసుకున్నట్లు తాలిబన్లు తెలిపారు. ఇది కాబుల్‌కు కేవలం 90 కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది. మరోవైపు.. అంతర్జాతీయ సరిహద్దు పోస్టులు అన్నింటిని తమ అధీనంలోకి తీసుకున్నట్లు ప్రకటించారు. తొర్ఖమ్ సరిహద్దు ప్రాంతాన్ని తాలిబన్లు స్వాధీనం చేసుకున్నారని పాకిస్థాన్ అంతర్గత వ్యవహారాల మంత్రి షేక్ రషీద్ అహ్మద్ తెలిపారు. దీంతో సరిహద్దులను మూసివేసినట్లు చెప్పారు.
- ఉత్తర అఫ్గాన్‌లోని నాలుగో అతిపెద్ద, భద్రతా వలయంలోని నగరం, బల్ఖ్ రాష్ట్రం, మెజర్-ఏ- షరీఫ్‌ను శనివారం ఆక్రమించారు తాలిబన్లు. అది ప్రభుత్వానికి అతిపెద్ద ఎదురుదెబ్బ. దీంతో ఉత్తర అఫ్గాన్ పూర్తిగా వారి చేతుల్లోకి వెళ్లినట్లయింది. ముందుగా సైన్యం వారికి లొంగిపోయిందని, ఆ తర్వాత ప్రభుత్వ అనుకూల సంస్థలు, ఇతర దళాల్లో నైతిక దెబ్బతిని వారూ లొంగిపోయినట్లు రాష్ట్ర చట్టసభ్యుడు అబ్బాస్ ఎబ్రహిమ్జాదా తెలిపారు.
- కొద్ది రోజుల క్రితం దేశంలోని రెండు, మూడో అతిపెద్ద నగరాలైన హెరత్, కాందహార్ నగరాలను తమ వశం చేసుకున్నారు తాలిబన్లు. అఫ్గాన్‌లోని మొత్తం 34 రాష్ట్రాల్లోని 24 రాష్ట్రాలు వారి అధీనంలోకి వెళ్లాయి.
- అఫ్గాన్ నుంచి బలగాల ఉపసంహరణ నేపథ్యంలో బైడెన్ ప్రభుత్వంపై అంతర్జాతీయంగా విమర్శలు ఎదురవుతున్నాయి. తాజాగా అగ్రరాజ్య మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. బైడెన్ తీరును తప్పుబట్టారు. అధ్యక్షుడి వైఫల్యం వల్లే తాలిబన్లు రెచ్చిపోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.
- అఫ్గాన్‌లో తాలిబన్లు దురాక్రమణలకు పాల్పడుతున్న క్రమంలో తమ దేశ పౌరులను సురక్షితంగా వెనక్కి తీసుకొచ్చేందుకు బైడెన్ సర్కార్ చర్యలు చేపట్టింది. అదనంగా మరో 1000 మంది సైన్యాన్ని పంపాలని ఆదేశించారు. దీంతో మొత్తం 5000 మంది బలగాలను అఫ్గాన్‌కు తరలిస్తోంది అమెరికా.
- కాబుల్‌కు దక్షిణాన ఉన్న లోగర్ రాష్ట్రాన్ని శనివారం ఆక్రమించారు తాలిబన్లు. స్థానిక అధికారులను నిర్బంధించారు. కాబుల్‌కు 11 కిలోమీటర్ల దూరంలోని చార్ అస్యాద్ జిల్లాకు చేరుకున్నట్లు ఓ చట్టసభ్యురాలు తెలిపారు. ఆ తర్వాత లాఘ్మ్యాన్ రాష్ట్రాన్ని ఎలాంటి ఘర్షణ లేకుండానే స్వాధీనం చేసుకున్నారు.
- తాలిబన్ల అరాచకాలు మొదలైన తర్వాత శనివారం తొలిసారి ప్రజల ముందుకు వచ్చి మాట్లాడారు అఫ్గాన్ అధ్యక్షుడు అష్రాఫ్ ఘనీ. గత 20 ఏళ్లలో సాధించిన విజయాలను వదులుకోవద్దని సూచించారు.
- దేశంలో తాలిబన్ల ఆగడాలు తట్టుకోలేని ప్రజలు ఇతర దేశాలకు పారిపోతున్నారు. అమెరికా, యూకే, భారత్ సహా శరణార్థ వీసా సౌకర్యం కల్పిస్తోన్న దేశాలకు వలస వెళ్తున్నారు.
- అఫ్గాన్ ప్రజలు ఇతర దేశాలకు పారిపోతున్న క్రమంలో కాబుల్‌లోని భారత ఎంబసీకి ఒక్కసారిగా వీసాల దరఖాస్తులు పెరిగిపోయాయి. వీసాల జారీ కోసం ఎక్కువ సమయం పనిచేస్తున్నట్లు ఓ అధికారి తెలిపారు. వీసాలో కోటాను సైతం పెంచినట్లు చెప్పారు. ఆ దేశంలోని కాన్సులేట్లను మూసివేసిన భారత్.. కాబుల్‌లోని ఎంబసీ నుంచే వీసాలు జారీ చేస్తోంది.