'స్పైడర్‌మ్యాన్' స్టంట్ హాంగ్‌కాంగ్.... కొద్ది నెలలుగా రోజూ వార్తల్లో నిలుస్తోంది. అందుకు కారణం... అక్కడ జరుగుతున్న ప్రభుత్వ వ్యతిరేక ఆందోళనలే. హింసాయుత నిరసనలు, చర్చల ప్రతిపాదనలు, అగ్ర దేశాల మాటల యుద్ధాల మధ్య... హాంగ్‌కాంగ్‌లో జరిగిన ఓ సంఘటన అందరి దృష్టిని ఆకర్షించింది.
57 ఏళ్ల వయస్సున్న ఓ వ్యక్తి... నగరంలోని 62 అంతస్తుల భవనంపైకి చకచకా ఎక్కేశాడు. అది కూడా ఎలాంటి తాళ్ల సాయం లేకుండానే. ఈ దృశ్యాన్ని చూసినవారు ఆశ్చర్యపోయారు. ఏం జరుగుతుందోనన్న ఉత్కంఠతో అలానే ఉండిపోయారు. చివరకు అతడు... పై అంతస్తుకు చేరుకుని ఓ బ్యానర్ ప్రదర్శించాడు. దానిపై చైనా, హాంగ్‌కాంగ్ జెండాలు ఉన్నాయి.
ఆకాశ హర్మ్యాన్ని ఎక్కిన వ్యక్తిని వెంటనే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతడిని ఫ్రాన్స్‌కు చెందిన అలైన్ రాబర్ట్‌గా గుర్తించారు. హాంగ్‌కాంగ్‌లో శాంతి నెలకొనాలని ఆకాంక్షిస్తూ రాబర్ట్ ఈ పనిచేశాడని చెప్పారు పోలీసులు.
రాబర్ట్... ఇలా భవనాలు ఎక్కడం కొత్త కాదు. ఆయన్ను అంతా స్పైడర్‌మ్యాన్ అని పిలుస్తుంటారు. 2017లో హాంగ్‌కాంగ్‌లో ఇలానే ఓ ఆకాశ హర్మ్యాన్ని అధిరోహించాడు . ఆ తర్వాత రాబర్ట్ తమ దేశానికి రాకుండా నిషేధించింది హాంగ్‌కాంగ్. ఇప్పుడు మరోమారు అక్కడకు వెళ్లి... ఇలా శాంతి సందేశం ఇచ్చాడు రాబర్ట్.
ఇదీ చూడండి:శ్రుతిమించితే... ఉద్యమాన్ని అణగదొక్కుతాం: చైనా