అదిగో తాలిబన్లు వచ్చేస్తున్నారు! ఇదిగో బద్రీ313 ఫోర్స్..! అమెరికా సైన్యం పరార్..! తోకముడిచిన సంకీర్ణ సేనలు..!ఇలా తాలిబన్లు(Afghanistan Taliban) చేసిన ప్రచార యుద్ధానికి అఫ్గాన్ అధ్యక్షుడు అష్రఫ్ ఘనీ(Ashraf Ghani) అదిరిపోయి.. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌కు పలాయనం చిత్తగించారు. అదే సమయంలో పనిలోపనిగా ఉపాధ్యక్షుడు అమ్రుల్లా సలేహ్ కూడా పారిపోయారంటూ తాలిబన్లు ప్రచారం చేపట్టారు! ఇంతలో 'ఇప్పుడు నేనే అధ్యక్షుడిని.. దేశంలోనే ఉన్నాను' అంటూ అమ్రుల్లా ఓ ట్వీట్ చేశారు..! ఇది అంత తేలిగ్గా తేలదని తాలిబన్లకు ఏదో మూల అనుమానంగానే ఉంది..! ఆ తర్వాత పంజ్‌షేర్ నాయకుడు అహ్మద్ మసూద్‌తో(Ahmad Massoud) అమ్రుల్లా భేటీ అయిన ఫొటోలు బయటకు వచ్చాయి. తాలిబన్ల గుండెల్లో రాయిపడినట్లైంది..! కాబుల్ అంత తేలిగ్గా పంజ్‌షేర్ దక్కదని వారికి అర్థమైంది..! అది కేవలం ఆ ప్రాంతానికి ఉన్న భౌగోళిక పరిస్థితే కారణం కాదు.. అఫ్గానిస్థాన్ మొత్తం రాజీ పడినా.. ఇక్కడి నేతలు వెనక్కి తగ్గలేదు. కారణం.. వారు తాలిబన్ల చేతిలో ఆత్మీయులను కోల్పోవడమే..!
ఎవరీ మసూద్ అహ్మద్?
పంజ్‌షేర్ సింహంగా పేరున్న అహ్మద్ షా మసూద్(Ahmed Shah Masood) సంతానంలో పెద్దవాడు. స్కూల్ విద్య ఇరాన్‌లో పూర్తి చేసుకొన్నా.. సైనిక విద్య మాత్రం బ్రిటీష్ ఆర్మీకి చెందిన మిలటరీ అకాడమీ ఫర్ ఆఫీసర్స్‌లో పూర్తి చేశారు. 2015లో కింగ్స్ కాలేజ్ లండన్ నుంచి బ్యాచిలర్స్ డిగ్రీ అందుకొన్నారు. యూనివర్శిటీ ఆఫ్ లండన్ నుంచి అంతర్జాతీయ రాజకీయాల్లో మాస్టర్స్ అందుకొన్నారు. 2001లో విలేకర్ల రూపంలో అల్‌ఖైదా ఉగ్రవాదులు ఆయన తండ్రి అహ్మద్ షా మసూద్‌పై ఆత్మాహుతి దాడి చేశారు. అప్పట్లో అహ్మద్ షా నార్తర్న్ అలయన్స్‌కు నాయకత్వం వహిస్తున్నారు.
విద్యాభ్యాసం ముగించి పంజ్‌షేర్ చేరుకొన్న అహ్మద్ మసూద్ 2019లో అమెరికా దళాల ఉపసంహరణపై చర్చలు మొదలు పెట్టగానే భవిష్యత్తుపై ఆయన ఓ అంచనాకు వచ్చేశారు. శాంతి చర్చలు సరైన మార్గంలో లేవని కుండబద్దలు కొట్టినట్లు చెప్పేశారు. తండ్రి ప్రారంభించిన నార్తర్న్ అలయన్స్ బాటలోనే 'ది నేషనల్ రెసిస్టన్స్ ఫ్రంట్ ఆఫ్ అఫ్గానిస్థాన్'ను ప్రారంభించారు.
అందుకే వాషింగ్టన్ పోస్టులో ఓప్ ఎడ్ రాసింది..!
బైడెన్‌పై వ్యూహాత్మకంగా ఒత్తిడి పెంచేందుకు అహ్మద్ మసూద్ అమెరికా పత్రికలను ఎంచుకొన్నారు. ఇప్పటికే అడ్డగోలుగా బలగాల ఉపసంహరణతో బైడెన్ సర్కార్ అభాసుపాలైంది. 20 ఏళ్లుగా అమెరికన్ సైనికుల త్యాగాలను, ధనాన్ని ప్రభుత్వం బూడిదలో పోసిందని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనికి తోడు తాలిబన్ల వికృత చేష్టలు చూసి ఆగ్రహంతో రగిలిపోతున్నారు. అఫ్గాన్లు తాలిబన్ల భయంతో విమానాలకు వేలాడటం.. వాటి పై నుంచి పడి చనిపోవడం వంటి వార్తలు దీనికి ఆజ్యం పోశాయి. ఈ సమయంలో పంజ్‌షేర్ నుంచి తాలిబన్లను ఎదుర్కొనేందుకు రెసిస్టన్స్ ఫోర్స్ ముందుకొచ్చి.. తమకు సాయం చేయమని అమెరికాను బహిరంగంగానే కోరింది. ఈ మేరకు మసూద్ వాషింగ్టన్‌పోస్టులో ఓప్‌ఎడ్ వ్యాసం రాయటం సంచలనం సృష్టించింది. 2001లో అమెరికాకు భారీగా సాయం చేసింది పంజ్‌షేర్ పోరాట యోధులే. ఇప్పుడు వారిని అమెరికా గాలికొదిలేస్తే దేశ ప్రజల ముందు బైడెన్ ఇమేజ్ ఘోరంగా దెబ్బతినే పరిస్థితి నెలకొంది.
నాటికి పూర్తి వ్యతిరేక పరిస్థితి..
గుల్ముద్దీన్ హెక్మత్‌యర్ వంటి ముఠా నేతలు తాలిబన్ల ఎదుట తలవంచారు. కానీ, 1995లో పంజ్‌షేర్ లోయకు చెందిన అహ్మద్ షా మసూద్ ఒంటరిగా కాబుల్‌కు రెండు గంటల దూరంలోని తాలిబన్ల అడ్డా అయిన మదీన్ హషర్‌కు వెళ్లారు. ఆ సమయంలో అతను పూర్తి నిరాయుధుడు, ఒంటరిగా వచ్చాడు. అంతర్యుద్ధాన్ని ఆపేలా కొన్ని గంటలపాటు తాలిబన్లను ఒప్పించేందుకు ప్రయత్నించారు. చర్చలు విఫలం అయ్యాయి. నిరాశగా ఆయన తిరిగి కాబుల్ వచ్చారు. ఇది జరిగిన కొన్ని గంటల్లోనే మసూద్‌తో చర్చలు జరిపిన తాలిబన్ నాయకుడిని సహచరులే హత్య చేశారు. మసూద్‌ను ప్రాణాలతో పంపించినందుకే వారు ఈ ఘాతకానికి తెగబడ్డారు. ఈ ఘటన తర్వాత మసూద్ పంజ్‌షేర్‌కు చేరుకొని నార్తర్న్ అలయన్స్ ఏర్పాటు చేసి తాలిబన్లపై పోరాటం మొదలుపెట్టారు. 2001లో తాలిబన్లు, అల్‌ఖైదా ఉగ్రవాదులు కలిసి విలేకరుల రూపంలో మసూద్‌ను హత్య చేశారు.